అనంతపురం: రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్నది ప్రజా ప్రభుత్వం కాదని, రియల్ ఎస్టేట్ కంపెనీ తరహాలో పాలన కొనసాగుతోందని వైయస్ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. అమరావతిని రియల్ ఎస్టేట్ వ్యాపార కేంద్రంగా మార్చే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. రాజధాని అభివృద్ధి పేరుతో భారీగా అప్పులు చేస్తూ ప్రజలపై భారం మోపుతున్నారని ఆరోపించారు. బుధవారం అనంత వెంకట్రామిరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు తప్పవని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక విస్మరించడం చంద్రబాబుకు అలవాటేనని దుయ్యబట్టారు. గత ఎన్నికల ముందు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీల్లో నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు రూ.1500, 50 ఏళ్లకే పింఛన్ వంటి అంశాలు ఇప్పటికీ అమలు కాలేదని విమర్శించారు. ఉద్యోగులకు డీఏ, ఐఆర్, పీఆర్సీ బకాయిలు చెల్లించలేదని చెప్పారు. అంగన్‌వాడీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్‌ను ఖండించిన ఆయన, మహిళలపై దాడులు చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తల ఉద్యమాలకు వైయస్ఆర్‌సీపీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి మందగించిందని, పరిశ్రమలకు కేటాయించిన భూములు తిరిగి వెనక్కి వెళ్లిపోతున్నాయని ఆరోపించారు. అమరావతిని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చారని విమర్శిస్తూ, రాజధాని అభివృద్ధి పేరుతో భారీ అప్పులు చేస్తున్నారని పేర్కొన్నారు. హామీల అమలు కోసం పోరాటాలు తప్పవని హెచ్చరించారు.