రావులపాలెం : గడచిన 18 నెలల్లో కూటమి ప్రభుత్వం ఏ రంగంలోనూ వృద్ధి సాధించలేదని, విద్యా, వైద్య రంగాలను నిర్వీర్యం చేసి ప్రజల ఆరోగ్యం, భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తున్న ప్రజాకంఠక పాలన రాష్ట్రంలో నడుస్తోందని వైయస్‌ఆర్‌సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్, శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కోవిడ్ లాంటి విపత్కర సమయంలోనూ నాటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఈ ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో ప్రైవేట్‌పరం చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు చేపట్టిన ప్రజా ఉద్యమం-కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభించిందని తెలిపారు. ప్రజలు స్వచ్చందంగా ముందుకు వచ్చి చేసిన సంతకాలే ఇందుకు నిదర్శనమన్నారు. సోమవారం డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో పార్టీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, పార్లమెంట్ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మీ, పార్టీ నేతలతో కలిసి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ప్రెస్‌మీట్‌లో బొత్స సత్యనారాయణ ఇంకా ఏం మాట్లాడారంటే.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. ప్రజారోగ్యంపై దాడి పేద ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు, పేద విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేసేందుకు కరోనా సమయంలోనే వైయస్ జగన్ ప్రభుత్వం నిర్మించిన 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వీటిలో 10 మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే దురాలోచన కూటమి ప్రభుత్వం చేస్తోంది. కూటమి ప్రభుత్వ చర్యలతో పేదల వైద్యం, వైద్య విద్య పూర్తి కుప్పకూలడానికి దారితీస్తుంది. ప్రైవేట్ వైద్యం అంటే ప్రతి దానికి ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా దొరికే సేవలను దోపిడీదారుల చేతికి ఎందుకు అప్పగిస్తున్నారు. కోటి సంతకాల ఉద్యమానికి అపూర్వ స్పందన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అపూర్వ స్పందన లభించింది. టార్గెట్‌కు మించి సంతకాలు చేశారంటే..కూటమి ప్రభుత్వ విధానాన్ని ప్రజలు ఏవిధంగా వ్యతిరేకిస్తున్నారో చెప్పడానికి ఈ సంతకాలే నిదర్శనం. సేకరించిన సంతకాలను ఈ నెల 10వ తేదీ నియోజకవర్గ కేంద్రాలకు తరలించి, ప్రధాన కూడలిలో ఈ సంతకాలను ప్రదర్శించి, ఈ నెల 15వ తేదీ జిల్లా కేంద్రాలకు తరలించి అక్కడి నుంచి రాష్ట్ర కార్యాలయానికి ప్రత్యేక వాహనాల్లో తరలిస్తాం. పేద కూలీల కడుపు కొట్టొద్దు కూటమి ప్రభుత్వం ఈ 18 నెలల్లో ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో ఏడు కోట్ల పని దినాలు తగ్గించి పేద కూలీల కడుపుకొట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీల ఆకలి తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకంపై రాష్ట్ర ప్రభుత్వ పెత్తనం ఏంటి?. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా పేదలకు పని దినాలు కల్పించలేని ఈ ప్రభుత్వం.. అద్భుతమైన ఉద్యోగాలు కల్పిస్తామని ఎలా హామీ ఇస్తుంది?. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు కూటమి పాలనలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. ఎరువులు బ్లాక్‌మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఈ ప్రభుత్వంలో నెలకొంది. గతంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు, విత్తనాలు అందించేవారు. ధాన్యాన్ని మద్దతు ధరకు అప్పట్లో ప్రభుత్వమే కొనుగోలు చేసేది. ఇప్పుడు అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. రైతులకు గిట్టుబాటు ధర లేకుండా పోయింది. కొనుగోలు కేంద్రాలు మూతపడి రైతుల బాధలు అధికమయ్యాయి. పేరెంట్స్ మీటింగ్ జరిగిన పాఠశాలలు ఐదేళ్ల క్రితం ఎలా ఉన్నాయో?.. ఇప్పుడు ఎలా ఉన్నాయో చంద్రబాబు గమనించారా.? మంత్రులు అకౌంటబిలిటీతో మాట్లాడాలి. ఈ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయింది. గడచిన 18 నెలల్లో రాస్తున్న క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది. హత్యలు, మానభంగాలు చిన్నారులపై అఘాయిత్యాలు ఎక్కువైపోయాయి. గత ఐదేళ్లలో ఇలాంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు పర్యవేక్షణ లోపం కారణంగా ఇలాంటి దుశ్చర్యలు తలెత్తున్నాయి. ఇది ప్రజా ప్రభుత్వమా? దోపిడీ ప్రభుత్వమా?. ఇండిగో ఎయిర్‌లైన్స్ సంక్షోభం పూర్తిగా మ్యాన్–మేడ్, సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు వైఫల్యం వల్ల దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా విమానాలు రద్దు అయ్యాయి. విమానాలు రద్దు అవడంతో ప్రజలు ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంత్రి ముందస్తు సమన్వయం, సమీక్షలు చేయకపోవడం వల్ల ఇండిగో వంటి ప్రధాన ఎయిర్‌లైన్లు కుప్పకూలాయి. రామ్మోహన్ నాయుడు అసమర్థత వల్ల అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం ప్రతిష్ట దిగజారిపోయింది. తన శాఖలోని పరిణామాలు అంచనా వేయకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. మన రాష్ట్రానికి చెందిన మంత్రి ఉండి కూడా కేవలం భోగాపురం ఎయిర్‌పోర్టు చుట్టూ తిరిగి బాధ్యతలు మరిచిపోవడం సరికాదు. ప్రయాణికుల ప్రాణాలకు ప్రమాదం కలిగితే ఆ బాధ్యత ఎవరిది?. దేశం పరువు కాపాడడానికి ప్రధాన మంత్రి వెంటనే జోక్యం చేసుకోవాలి. కూటమి పాలనలో రోజు రోజుకు ప్రజల కష్టాలు అధికమవుతున్నాయి. ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రతి అన్యాయంపై వైయస్ఆర్‌సీపీ పోరాడుతుంది. వైద్యం, విద్య, రైతుల భవిష్యత్తు కోసం వైయస్‌ఆర్‌సీపీ ప్రజల పక్షాన నిలుస్తుంది” అని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.