క‌ల్తీ పాల ఘ‌ట‌న‌పై కూట‌మి ప్ర‌భుత్వం హైడ్రామా

రోజుకో డెడ్‌బాడీ అప్ప‌గిస్తూ ఈ ఘ‌ట‌నను యాక్సిడెంట‌ల్‌గా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం

మాజీ ఎంపీ మార్గాని భ‌ర‌త్ మండిపాటు

రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో క‌ల్తీ పాలు తాగి ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న బాధితుల‌ను ప‌రామ‌ర్శించిన వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి, మాజీ ఎంపీ మార్గాని భ‌ర‌త్ అనంత‌రం మీడియాతో మాట్లాడారు.

రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో క‌ల్తీ పాల ఘ‌ట‌న జ‌రిగి 24 రోజులు అవుతుంది

‘ఇథలీన్‌ గ్లైకాల్‌’ క‌లిసిందంటూ  ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న‌

ఇంత‌వ‌ర‌కు ల్యాబ్ రిపోర్టులు ఎందుకు బ‌య‌ట‌పెట్ట‌డం లేదు

బాధితుల‌ను ప‌రామ‌ర్శించే తీరిక సీఎం చంద్ర‌బాబుకు లేదా?

కల్తీ పాలు ఘటనపై సీబీఐ దర్యాప్తు జరపాలి 

శాంపిల్స్‌ను  నేషనల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లకు పంపించాలి

బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి

కూట‌మి ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేసిన మార్గాని భ‌ర‌త్‌

రాజమహేంద్రవరం:  రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనపై కూటమి ప్రభుత్వం హైడ్రామా ఆడుతోందని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. రోజుకో బాధితుడి వెంటిలేటర్ తొలగించి మృతదేహాలను కుటుంబాలకు అప్పగిస్తూ ఈ ఘటనను యాక్సిడెంటల్‌గా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని ఆయన అనుమానం వ్య‌క్తం చేశారు. ఘటనపై పూర్తి నిజాలు వెలుగులోకి రావాలంటే స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన మార్గాని భ‌ర‌త్ క‌ల్తీ పాల ఘ‌ట‌న ప్ర‌భుత్వ వైఫ‌ల్య‌మేన‌ని ధ్వ‌జ‌మెత్తారు. 

ప్రెస్‌మీట్‌లో మార్గాని భ‌ర‌త్ ఇంకా ఏమ‌న్నారంటే..: 

శాంపిల్స్‌ను నేషనల్ ఫొరెన్సిక్ ల్యాబ్‌కు ఎందుకు పంప‌డం లేదు?

రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటన జ‌రిగి ఇప్ప‌టికి 24 రోజులు అవుతుంది. ఈ ఘ‌ట‌న‌పై నిజాలు వెలికి తీయాలనే ఇంగితజ్ఞానం ఈ ప్రభుత్వానికి లేదా?. ఈ ఘటనను యాక్సిడెంట్‌గా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది. కల్తీ పాల శాంపిల్స్‌ను నేషనల్ ఫొరెన్సిక్ ల్యాబ్‌లకు పంపకుండా స్థానిక ల్యాబ్‌లకే పంపుతున్నారు.  అలా చేస్తే నిజాలు బయటకు రావు. ఈ ఘటనపై పూర్తి నిజాలు వెలుగులోకి రావాలంటే దర్యాప్తును సీబీఐకి అప్పగించాలి. 

పాలలో యూరియా కలిపారా? లేక పురుగుల మందు కలిసిందా? 

పోలీసులు మొదట అల్లిన కథలు చెప్పి ఇప్పుడు కూలింగ్ లీక్ అయిందని, అందులోని ఇథిలీన్ గ్లైకాల్ వల్ల పాలు కల్తీ అయ్యాయని చెబుతున్నారు. ఒక పాల వ్యాపారి రోజూ 120 లీటర్లు సరఫరా చేస్తుంటే కేవలం 16 కుటుంబాలకే ఎందుకు ప్రభావం చూపిందో పోలీసులు స్పష్టంగా చెప్పాలి. పాలలో యూరియా కలిపారా? లేక పురుగుల మందు కలిసిందా? అనే కోణాల్లో కూడా దర్యాప్తు జరగాలి. ఈ ఘటనలో చిన్న పిల్లలు, వృద్ధులు తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యారు. కొందరి కిడ్నీలు కూడా దెబ్బతిన్నాయని వైద్యులు చెబుతున్నారు.  ఆరు నెలలు, ఏడాది వయసు ఉన్న చిన్నారులు మృత్యువుతో పోరాడుతున్న పరిస్థితి ఎంతో బాధాకరం. పాలు తాగించినందుకే మా పిల్లలు ఇలా అయ్యారని బాధిత తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణం

రాజ‌మ‌హేంద్ర‌వరంలో క‌ల్తీ పాలు తాగి ఇంత మంది మృత్యువాత ప‌డ‌టానికి ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్య‌మే ప్ర‌ధాన కార‌ణం. శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉండ‌గా  2023లో తీసుకొచ్చిన మిల్క్ ప్రొక్యూర్‌మెంట్ చట్టం ప్రకారం మిల్క్ అనలైజర్ల ద్వారా పాలను నిరంతరం పరిశీలించే వ్యవస్థను అమలు చేసి ఉంటే ఇలాంటి ఘటన జరిగేదే కాదు. అనార్గనైజ్డ్ మిల్క్ సెక్టార్‌ను ప్రభుత్వమే పర్యవేక్షించే బాధ్యత తీసుకుని ఉండాల్సింది. ఆ బాధ్య‌త‌ల నుంచి కూట‌మి ప్ర‌భుత్వం త‌ప్పుకోవ‌డం వ‌ల్లే ఇంత మంది మృత్యువాత ప‌డుతున్నారు.

రూ.25 ల‌క్ష‌లు ప‌రిహారం ఇవ్వాలి

క‌ల్తీ పాలు తాగి మ‌ర‌ణించిన బాధిత కుటుంబాలకు కేవలం రూ.10 లక్షల పరిహారం ప్రకటించడం అన్యాయం. కాకినాడలో ఫైర్ యాక్సిడెంట్ కార‌ణంగా చ‌నిపోయిన కుటుంబాల‌కు రూ.25 ల‌క్ష‌లు ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం ఇక్క‌డేందుకు త‌క్కువ‌గా ఇస్తున్నారు. ఈ రెండు ఘ‌ట‌న‌ల‌కు ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యమే కార‌ణం క‌దా?. క‌ల్తీ పాలు తాగి చ‌నిపోయిన  ప్రతి కుటుంబానికి కనీసం రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని వైయ‌స్ఆర్‌సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.

హెరిటేజ్‌ పాలు తాగండి అంటూ ప్ర‌చారం

రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో క‌ల్తీ పాల ఘ‌ట‌న‌ను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న కుటుంబ సంస్థ హెరిటేజ్‌కు లాభం చేకూర్చేలా ప్ర‌చారం చేసుకుంటున్నారు.  హెరిటేజ్ పాలు అత్యంత సురక్షితమని ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతోంది. ప్రభుత్వం ఈ ఘటనపై పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడించాలి, రక్త నమూనాలు, ల్యాబ్ రిపోర్టులు వెంటనే బయట పెట్టాలి. ఈ ఘ‌ట‌న జ‌రిగి 24 రోజులు అవుతున్నా ముఖ్యమంత్రి చంద్ర‌బాబుకు బాధిత కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించే తీరిక లేకుండా పోయింది. ఒక స‌మీక్ష నిర్వ‌హించ‌లేక‌పోతున్నారు. ప‌క్క‌నే ఉన్న కాకినాడ‌కు వ‌చ్చిన చంద్ర‌బాబు రాజ‌మ‌హేంద్ర‌వ‌రం రాలేక‌పోయారు. ఇప్ప‌టికైనా చంద్ర‌బాబు స్వ‌యంగా రాజమహేంద్రవరం వచ్చి బాధితులను పరామర్శించి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించాలి. ఈ ఘటనపై సీబీఐ విచార‌ణ జ‌రిపించి వాస్తవాలు బయటకు వచ్చే వరకు వైయ‌స్ఆర్‌సీపీ న్యాయపోరాటం కొనసాగిస్తుందని మార్గాని భరత్ స్పష్టం చేశారు.

Back to Top