పరకామణి చోరీ కేసును తక్షణమే సీబీఐ కి అప్పగించాలి.

బీఆర్ నాయుడిని వెంటనే పదవి నుంచి తొలగించాలి

పరకామణి చోరీ  అసలు సూత్రధారులను బయటపెట్టాలి.

మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్ 

తాడేపల్లి వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో విడి, విడిగా మాట్లాడిన మాజీ మంత్రి వెల్లంపల్లి 
శ్రీనివాస్, వైయ‌స్ఆర్‌సీపీపీ నేత, పానెలిస్టు జ్వాలాపురం శ్రీకాంత్. 

పరకామణిలో కోటి రూపాయల బంగారం మాయం

ఘటన జరిగి నెలలు గడుస్తున్నా బయటకు రాని వైనం

మా హయాంలో పరకామణి చోరీ నిందితుడుపై చర్యలు

స్వామి వారికి నిందితుడి ఆస్తుల బదలాయింపు

అయినా నోటికొచ్చినట్లు మాట్లాడిన కూటమి నేతలు

తమ హయాంలో కోటి బంగారం చోరీ అయినా నోరెత్తని నేతలు

కూటమి నేతల 'డబుల్ గేమ్'  పై వెల్లంపల్లి నిప్పులు.

స్వామివారి కానుకలకే రక్షణ లేదు.

నిందితుడికి తక్షణమే బెయిలా?

ప్రభుత్వం ఎవరిని కాపాడుతోంది?

బినామీలకు ఉచిత భూములు

స్వామివారి గుడికి మాత్రం కోట్లలో ధరలా?

చంద్రబాబుపై మాజీ మంత్రి వెల్లంపల్లి ధ్వజం

బీఆర్ నాయుడి దృష్టంతా పరకాంతల మీదే

పరకామణి నిర్వహణ పట్టని పాలకమండలి చైర్మన్

తక్షణమే ఆయన్ను తొలగించాలి

పరకామణి చోరీపై సీబీఐ విచారణ జరపాలి

మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్ 

పరకామణి చోరీ వెనుక ఉన్న 'పెద్దల'ను తేల్చాలి 

చోరీ ఘటనపై సీబీఐతో విచారణ చేయించాలి

తిరుమల పరకామణిలో దోపిడీ దారుణం 

దొంగలకు కొమ్ముకాస్తున్న కూటమి ప్రభుత్వం

వైయ‌స్ఆర్‌సీపీ నేత శ్రీకాంత్ ధ్వజం

తాడేపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువున్న తిరుమల అపచారాలకు నిలయంగా మారిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. పరకామణిలో జరిగిన భారీ చోరీని ప్రభుత్వం, టీటీడీ కలిసి తొక్కిపెట్టడం వెనుక కూటమి నేతల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పరకామణిలో సుమారు రూ. 1 కోటి విలువైన బంగారం, వెండి కానుకలను అవుట్ సోర్సింగ్ ఉద్యోగి పెంచలయ్య చోరీ చేస్తే, ఆ విషయాన్ని ప్రభుత్వం ఎందుకు గప్ చుప్ గా ఉంచిందని మండిపడ్డారు. వైయస్ జగన్ గారి హయాంలో పరకామణి భద్రత అత్యంత పటిష్టంగా ఉంటే, నేడు దొంగతనం జరిగిన 2025 జనవరి నుండి ఇప్పటివరకు ఆ విషయాన్ని గోప్యంగా ఉంచడం దారుణమని ఆక్షేపించారు.  టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు దృష్టి పరకాంతల మీద తప్ప 'పరకామణి' మీద లేదని ఆగ్రహించారు. కంపెనీలకు కారు చౌకగా భూమిలిస్తున్న ప్రభుత్వం..చరిత్రలో తొలిసారిగా స్వామి వారి గుడికి మాత్రం టీటీడి నుంచి రూ.12.50  కోట్లు వసూలు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఇప్పటికైనా పరకామణి కేసులో అసలు సూత్రధారులు బయటకు రావాలంటే సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే...

కూటమి ప్రభుత్వం ఆధ్వర్వంలో టీటీడీ చైర్మన్ గా బీ ఆర్ నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చరిత్రలో మునుపెన్నడూ లేని ఘటనలు తిరుమలలో చోటుచేసుకుంటున్నాయి. ప్రజలు, భక్తులు జరుగుతున్న పరిణామాలన్నీ గమనిస్తున్నారు. పరకామణిలో రూ.1 కోటి విలువైన బంగారం, వెండి కానుకలను అవుట్ సోర్సింగ్ ఉద్యోగి పెంచలయ్య చోరీ చేస్తే... ఆ ఘటనను ప్రభుత్వం, టీటీడీ, పోలీసులు సైతం కనీసం బయటకు రానివ్వకుండా తొక్కిపెట్టారు. 
మరోవైపు తాను దోచుకున్న స్వామి వారి కానుకలను పెంచలయ్య తిరుపతిలో బ్యాంకులో తాకట్టు పెట్టడంతో పాటు, ప్రముఖ బంగారు షాపుల్లో నగల రూపంలో మార్పు చేశాడు. ఇంత పెద్ద ఎత్తున బంగారం చోరీ జరిగితే టీటీడీ చైర్మన్ బీ ఆర్ నాయుడు ఎందుకు ఈ విషయాలను మీడియా దృష్టికి తీసుకుని రాలేదు? చంద్రబాబు సైతం ఎందుకు మౌనంగా ఉన్నారు? గతంలో వైయస్.జగన్ సీఎంగా ఉన్నప్పుడు పరకామణిలో డాలర్లు చోరీ ఉదంతంలో గగ్గోలు పెట్టిన కూటమి నేతలు... ఈ కేసులో మౌనంగా ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. 

- పరకామణి చోరీలో కూటమి డబుల్ గేమ్...

మా ప్రభుత్వ హయాంలో రవికుమార్ అనే ఉద్యోగి డాలర్లు దొంగతనం చేసి పట్టుబడితే పూర్తిస్ధాయిలో విచారణ చేసి అరెస్టు చేయడంతో పాటు ఆయన ఆస్తులను కూడా టీటీడీకి రాయించారు. ఈ కేసును లోకాయుక్త ద్వారా పరిష్కరిస్తే... ఆ రోజు నోటికొచ్చినట్లు మాట్లాడిన కూటమి నేతలు ఇవాళ తమ ప్రభుత్వ హయాంలో సుమారు కోటి విలువైన స్వామి వారి కానుకలు చోరీకి గురైతే నామమాత్రంగా కేసు నమోదు చేశారు. రవికుమార్ విషయంలో ప్రత్యేక దర్యాప్తు చేయించిన కూటమి నేతలు... తమ హయాంలో జరిగిన భారీ చోరీ గురించి ఎందుకు నోరు విప్పడం లేదు? ప్రభుత్వం తూతూమంత్రంగా వ్యవహరించడం వల్ల నిందితుడు బెయిల్ పై బయటకు వచ్చాడు. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే... నిందితుడు పెంచలయ్య వెనుక అసలైన సూత్రధారులున్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈ మొత్తం వ్యవహారంలో నిజనిజాలు నిగ్గు తేల్చడానికి సీబీఐ విచారణ చేయించాలి. పరకామణి చోరీలో పెంచలయ్య దొరికిన దొంగైతే దొరకని దొంగలు చాలా మంది ఉన్నారు.. వారందరినీ విచారణ చేయాలి. చైర్మన్ బీ ఆర్ నాయుడు దృష్టంతా పరకాంతల మీద తప్ప పరకామణి మీద లేదన్నది స్పష్టం అవుతుంది. ఎల్లోమీడియా సైతం పరకామణి చోరీ విషయాన్ని ఎందుకు ప్రచారం చేయడం లేదు. 

- మీ పాపాల వల్లే వరుస అపచారాలు..

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే తిరుమలలో వరుస అపచారాలు చోటుచేసుకుంటున్నాయి. తిరుమలలో యధేచ్చగా మద్యం, మాంసం దొరకడం, స్వామి వారి ప్రసాదం కోసం వస్తున్న నెయ్యి ట్యాంకు బోల్తా పడ్డం, తొక్కిసలాటలో భక్తుల మృతి వంటి ఘటనలు మునుపెన్నడూ చోటు చేసుకోలేదు. కేవలం దేవదేవుడి పట్ల కూటమి ప్రభుత్వం చేస్తున్న అపచారం వల్లే ఇవన్నీ చోటుచేసుకున్నాయి. తిరుమలను రాజకీయకేంద్రంగా చేసుకుని కూటమి ప్రభుత్వం భ్రష్టుపట్టిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం తన తీరు మార్చుకోవాలి. పరకామణి చోరీపై రాష్ట్ర ప్రజలకు వివరణివ్వాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, దేవాదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డిలు సైతం ఈ దొంగతనంపై స్పందించకపోవడం దారుణం. 

- స్వామి ఆలయ నిర్మాణ భూమికి టీటీడీ నిధులా?

ఎకరా 99 పైసలకే కాదు అవసరమైతే మొత్తం భూమి ఇస్తానంటూ తన బినామీ కంపెనీలకు సలహాలు ఇచ్చిన మంత్రి లోకేష్... అమరావతిలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం కోసం మాత్రం డబ్బులు తీసుకుంటారా? టీటీడీ చరిత్రలో ఇంతవరకు స్థలం కొన్న దాఖలాలు లేవు. స్వామి వారి గుడి నిర్మాణం కోసం సాధారణంగా భక్తులు స్ధలాన్నివ్వడం సహజం, కాని పక్షంలో ప్రభుత్వమే గుడికి అవసరమైన భూమి ఇస్తుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి కులదైవం అని చెప్పుకునే చంద్రబాబు ఆ స్వామి గుడి నిర్మాణానికి ఎకరా రూ.50 లక్షలు చొప్పున రూ.12.50 కోట్లు టీటీడీ నిధులు తీసుకుంటారా? ఇదేమి భక్తి? అమరావతిలో పదుల సంఖ్యలో కంపెనీల కోసం ఉచితంగా భూములిస్తున్న కూటమి ప్రభుత్వం స్వామి వారి గుడి నిర్మాణానికి ఎందుకు ఉచితంగా భూములివ్వడం లేదు? గుడి నిర్మాణానికి ఎందుకు 25 ఎకరాలు ఇవ్వడం లేదు? శ్రీ వేంకటేశ్వర స్వామి గుడి నిర్మాణం అంటే భక్తులే ఉచితంగా భూమిలిస్తారు? 
దేవుడి సొమ్ముతో ప్రభుత్వ స్థలాలు కొనిపించడం అత్యంత అమానుషం. గుడికి దేవుడి సొమ్ము వసూలు చేస్తూ... మీ అనుకూల, బినామీ కంపెనీలకు మాత్రం వందల కోట్ల భూమి ఉచితంగా కట్టబెడతారా? 
మీరు చేస్తున్న పాపాలకు స్వామి వారి ఆగ్రహానికి గురికాక తప్పదు. దేవుడు మీకు తగిన శిక్ష విధించడం ఖాయం. టీటీడీని చివరకు టీడీపీకి కేరాఫ్ అడ్రస్ గా మార్చడం అత్యంత దారుణం. 

- పరకామణి చోరీ సూత్రధారులు కూటమి నేతలే...

వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలను తప్పుడు కేసుల్లో అరెస్టు చేసి నడిపించుకుని తీసుకెళ్తూ.. పోలీస్ శాఖలో వాహనాలు లేకపోవడం వల్లే నడిపించామన్న డీజీపీ... ఏకంగా స్వామి వారి కానుకలకే కన్నం వేసిన నిందితుడ్ని ఎందుకు నడిపించకుని తీసుకెళ్లలేదు? ఎందుకు మీడియా మీందు ప్రవేశపెట్టలేదు? 2025లో పరకామణి చోరీ జరిగితే ఇంతవరకు ఈ విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారు. ఈ చోరీ వెనుక సూత్రధారులు కూటమి నేతలే అన్న విషయం దీని ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. నిందితుడ్ని నామమాత్రంగా అరెస్టు చేస్తే... వెంటనే బెయిల్ మీద బయటకు వస్తే... ప్రభుత్వం ఎందుకు ఉపేక్షించింది. స్వామి వారి కానుకలు కొన్న బంగారు షాపుల మీద కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు? టీటీడీలో గడిచిన 20 నెలల్లో జరిగిన అపచారాలు మునుపెన్నడూ లేవు. కారణం కూటమి ప్రభుత్వం స్వామి వారి పట్ల చేస్తున్న అపచారమే. ప్రజలకు కూటమి నేతలను నిలదీయాల్సిన అవసరం ఉంది. హిందూ దేవాలను ఎందుకు కూల్చుతున్నారని ప్రశ్నించాలి. టీడీపీ అంటేనే టెంపుల్ డిమాలిషన్ పార్టీ. ఇన్ని దారుణాలు జరుగుతున్నా తాను సనాతని అని చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడ్డం లేదు? ఎందుకు ప్రశ్నించడం లేదు? రంగు దుస్తులేసుకుని ఊగిపోతే మాట్లాడ్డం కాదు, టీటీడీలో జరుగుతున్న తప్పులను అరికట్టండి. తక్షణమే బీ ఆర్ నాయుడుని టీటీడీ చైర్మన్ పదవి నుంచి తప్పించడంతో పాటు పరకామణి కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. 

● జ్వాలాపురం శ్రీకాంత్ - వైయ‌స్ఆర్‌సీపీ నేత
 
గత 20 నెలల కూటమి పాలనలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువున్న తిరుమలలో అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందని వైయ‌స్ఆర్‌సీపీ పానెలిస్ట్ జ్వాలాపురం శ్రీకాంత్ విమర్శించారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..
పరకామణిలో జరిగిన బంగారం చోరీ ఉదంతంపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఎండగట్టారు. తిరుమల పరకామణిలో జరిగిన చోరీని ప్రభుత్వం కావాలనే బయటకు రాకుండా తొక్కిపెట్టిందని శ్రీకాంత్ ఆరోపించారు. చోరీకి పాల్పడ్డ నిందితుడికి బెయిల్ ఇప్పించి, కేసును నిర్వీర్యం చేయడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. సనాతన ధర్మ పరిరక్షకుడినని చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గానీ, తిరుమలలో ఏ చిన్న ఘటన జరిగినా గగ్గోలు పెట్టే భానుప్రకాష్ రెడ్డి గానీ ఈ భారీ దోపిడీపై ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు.

- ఏఐ టెక్నాలజీ దోపిడీల కోసమేనా?

పాలకమండలి చైర్మన్ బీఆర్ నాయుడు ఏఐ  టెక్నాలజీ ద్వారా భక్తులకు వేగంగా దర్శనం చేయిస్తానని చెప్పి, ఆ సాంకేతికతను ఇలాంటి దోపిడీలను దాచిపెట్టడానికి వాడుతున్నారా అని శ్రీకాంత్ ఎద్దేవా చేశారు. పరకామణిలో బంగారం మాయం కావడం వెనుక, నిందితుడు పెంచలయ్యకు బెయిల్ రావడంలో ఉన్న అసలు సూత్రధారులు ఎవరో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు.

- వైయ‌స్ జగన్ గారి హయాంలో పటిష్ట భద్రత

పరకామణిలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండటానికి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి హయాంలో రూ. 30 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన భవనాన్ని నిర్మించారని శ్రీకాంత్ గుర్తు చేశారు. ఆ రోజు ఆ సాంకేతికత వల్లే రవికుమార్ అనే వ్యక్తి పట్టుబడ్డాడని, వెంటనే అతడ్ని అరెస్టు చేసి లోక్ అదాలత్ ద్వారా అతని ఆస్తులను స్వామి వారికి కట్టబెట్టేలా కఠిన నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. కానీ నేడు కూటమి ప్రభుత్వం దొంగలను కాపాడుతూ స్వామి వారి పట్ల అపచారం చేస్తోందని, ఇది దేవస్థాన ప్రతిష్టను దిగజార్చడమేనని ఆవేదన వ్యక్తం చేశారు.
స్వామి వారిని రాజకీయాలకు వాడుకోవాలని చూసే వారికి అధోగతి తప్పదని హెచ్చరించిన శ్రీకాంత్, పరకామణి చోరీ ఘటనపై తక్షణమే సీబీఐవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అప్పుడే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు.

Back to Top