మదనపల్లె: విచారణ పేరుతో వేధింపులు.. కూటమి ప్రభుత్వం అణిచివేత ధోరణికి నిదర్శనమని మదనపల్లె నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ మండిపడ్డారు. వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ పూర్వపు అధ్యక్షుడు సజ్జల భార్గవ్‌రెడ్డికి మద్దతుగా వైయస్ఆర్‌సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో సంఘీభావం తెలిపారు. కేసు విచారణ నిమిత్తం మదనపల్లె డీఎస్పీ కార్యాలయానికి హాజరైన సజ్జల భార్గవ రెడ్డిని మదనపల్లె నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ కలిసి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా నిస్సార్ అహమ్మద్ మాట్లాడుతూ, రాజకీయ కక్షసాధింపుతోనే సజ్జల భార్గవ రెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేశారని ఆరోపించారు. విచారణ పేరుతో వేధింపులకు గురిచేస్తూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం కూటమి ప్రభుత్వ అణిచివేత ధోరణికి నిదర్శనమన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ అభిప్రాయ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉందని, సోషల్ మీడియాలో ప్రజా సమస్యలపై స్పందించినందుకు కేసులు నమోదు చేయడం తగదని పేర్కొన్నారు. చట్టపరమైన విచారణకు పూర్తి సహకారం అందిస్తామని, నిజం ఎప్పటికైనా వెలుగులోకి వస్తుందనే నమ్మకం తమకు ఉందని తెలిపారు. రాజకీయ ఒత్తిడులతో కేసులు నమోదు చేసినా న్యాయం తప్పకుండా జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేసిన నిస్సార్ అహమ్మద్, వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు సజ్జల భార్గవ రెడ్డికి అండగా నిలుస్తారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వి.ఎస్. రెడ్డి, ఇర్ఫాన్ షేక్, ఖలీల్ బి. కొత్తకోట, శ్రీనివాసులు, మహేష్, జావేద్, రహమతుల్లా, పవన్, ఫిరోజ్, తాసిర్, మహేష్ గ్రానైట్, నాగమణి, ధనలక్ష్మి, ఇమ్రాన్, ఎన్. నవాజ్ తదితరులు పాల్గొన్నారు.