రాజమండ్రి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో అన్నదాతను నిలువునా ముంచేసిందని, ఎన్నికల ముందు ఇచ్చిన పెట్టుబడి సాయం హామీని తుంగలో తొక్కి ప్రతి రైతుకు రూ.52 వేల చొప్పున బాకీ పడిందని మాజీ ఎంపీ మార్గాని భరత్ ధ్వజమెత్తారు. రాజమండ్రి లోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను నట్టేట ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పుష్కరాల్లో చంద్రబాబు షూటింగ్ పిచ్చికి 29 మంది బలికావడాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు కూడా ఏర్పాట్లలో అశ్రద్ధ వహిస్తూ కేవలం మాక్ డ్రిల్స్ తో కాలక్షేపం చేస్తున్నారని, తక్షణమే పుష్కరాల నిర్వహణ, నిధులు పై మాస్టర్ ప్లాన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే... - రైతులకు అందని 'భరోసా'- రూ. 52 వేల బకాయిలు ఏవి? రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. వరి, మొక్కజొన్న, మామిడి ఇలా ఏ పంటకూ మద్దతు ధర లభించక రైతులు అయినకాడికి అమ్ముకుంటున్నారు. ఏటా రూ. 20 వేల పెట్టుబడి సాయం ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, రెండేళ్లలో ప్రతి రైతుకు రూ. 40 వేలు బాకీ పడ్డారు. కేంద్ర సాయంతో కలిపి నేడు ప్రతి రైతు ఖాతాలో రూ. 52 వేలు జమ కావాల్సి ఉందని, కానీ ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదు. - పేదవాడి సొంతింటి కలపై కూటమి నిర్లక్ష్యం.. వైయస్ జగన్ హయాంలో పేదలకు అందజేసిన ఇళ్ల పట్టాలు, జగనన్న కాలనీలను కూటమి ప్రభుత్వం అటకెక్కించింది. గతంలో తాము ఇచ్చిన ఇళ్లను 'అగ్గిపెట్టెలు' అని విమర్శించిన చంద్రబాబు.. ప్రతి పేదవాడికి 2 నుండి 3 సెంట్ల స్థలం ఇస్తామన్న హామీని ఎందుకు అమలు చేయడం లేదు. రాజమండ్రిలో 25 వేల మందికి కలెక్టర్ చేతుల మీదుగా ఇచ్చిన పట్టాలను ఎందుకు ముందుకు తీసుకెళ్లడం లేదు. - టిడ్కో ఇళ్ల దుస్థితి: కనీస మౌలిక సదుపాయాలు లేక టిడ్కో ఇళ్లు ఖాళీగా ఉన్నాయని, లబ్ధిదారులపై ఈఎంఐల భారం వేయడం దారుణం. టిడ్కో ఇళ్ల కోసం ధర్నాలు చేస్తున్నారు. ఒకవైపు టిడ్కో ఇళ్లకు కనీస మౌలిక సదుపాయాలు అందించలేదు.. వాటి కోసం లబ్ధిదారులు ధర్నాలు చేస్తుంటే మరోవైపు వారికి ఈఎమ్ఐలు మొదలుకావడంతో ఆందోళన చెందుతున్నారు. చాలా చోట్ల టిడ్కో ఇళ్లు ఖాలీగా ఉన్నాయి. కారణం కనీస మౌలిక సదుపాయాలు కల్పించని దౌర్భాగ్య పరిస్ధితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యమే. ఏ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఉండే అవకాశం లేదు. - గోదావరి పుష్కరాలు - 29 మంది బలిని మర్చిపోయారా? మరో కీలకమైన అంశం రాజమండ్రి పుష్కరాలకు సంబంధించి సరిగ్గా ఏడాది కాలం ఉంది. ఈ నేపధ్యంలో ఎస్పీతో పాటు అధికారులు మాక్ డ్రిల్లింగ్ చేశారు. క్రౌడ్ మేనేజిమెంట్ పై మాక్ డ్రిల్లింగ్ చేశారా? భక్తులు ఎక్కువగా వస్తే షూటింగ్ ఎలా చేయాలన్నదానిపై మాక్ డ్రిల్లింగ్ చేశారా? కారణం గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆయన పబ్లిసిటీ కోసం ప్రజలను జమ చేసి.. షూటింగ్ చేసినప్పుడు తొక్కిసలాటలో 29 మంది చనిపోయారు. పుష్కరఘాట్ ప్రాంతానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో అక్కడకే వస్తారు. అధికారులు ఈ పాటికే అక్కడున్న గోడ తొలగించాల్సి ఉంది. గతంలో బాటిల్ నెక్ కింద రెండు గేట్లు పెట్టడం వల్ల, మానవ తప్పిదంతోనే 29 మంది చనిపోయారు. గత అనుభవాల నేపథ్యంలో ఇప్పటికైనా ఆ గోడను తొలగించాలి. పుష్కరాలకు ఎంత నిధులు కేటాయిస్తున్నారో ప్రభుత్వం బహిరంగ ప్రకటన చేయాలి. పుష్కర నిర్వహణపై చేయబోతున్న కార్యక్రమాలపై బ్లూ ప్రింట్ రూపొందించాలి. వేసవిలో పనులు చేపడితే... పక్కాగా ఉంటాయి. ఆఖరు క్షణంలో హడావుడిగా పనులు పేరుతో దోపిడీకి తెర తీయకుండా ఇప్పటి నుంచి ప్రణాళిక రూపొందించాలి. పుష్కరాలకు కేటాయించే నిధులపై, పనులపై ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళిక విడుదల చేయాలి. అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయాలి. - నగర సమస్యలు - ఎమ్మెల్యే వైఫల్యం రాజమండ్రిలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారు. శివరాత్రి రోజే 2 లక్షల మందిని అదుపు చేయలేకపోయిన ప్రభుత్వం, 10 కోట్ల మంది వచ్చే పుష్కరాలను ఎలా నిర్వహిస్తుంది?. మోరంపూడి ఫ్లై ఓవర్ పనులపై స్పష్టత లేదు, గోదావరిపై మరో బ్రిడ్జి నిర్మించాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యేలు ఇసుక ర్యాంపుల ద్వారా దోచుకోవడంలో ఉన్న శ్రద్ధ, ప్రజా సమస్యలపై చూపడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు అని చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం, కేవలం పబ్లిసిటీకే పరిమితం కాకుండా పేదలకు, రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని భరత్ డిమాండ్ చేశారు. పుష్కరాల వంటి అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని గతంలో లాగా 'షూటింగ్' ఈవెంట్‌గా మార్చి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని హెచ్చరించారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు మేల్కొని రాజమండ్రి పుష్కరాల నిర్వహణపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, సమగ్ర బ్లూప్రింట్‌ను విడుదల చేయాలని వైయస్సార్సీపీ తరపున భరత్ డిమాండ్ చేశారు.