బీఎల్వోల పూర్తి జాబితా విడుదల చేయాలి

సీఈఓకు లేళ్ళ అప్పిరెడ్డి లేఖ

తాడేప‌ల్లి: ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బూత్ లెవల్ ఆఫీసర్ల (బీఎల్వోలు) పూర్తి జాబితాను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు అందించాలని కోరుతూ వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ)కు లేఖ రాశారు. ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన బీఎల్వోల పేర్లు, వారికి కేటాయించిన పోలింగ్ స్టేషన్లు లేదా పార్ట్ నంబర్లు, హోదాలు, సంప్రదింపు వివరాలను రాజకీయ పార్టీలకు అందుబాటులో ఉంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

బీఎల్వోల వివరాలు అందుబాటులో ఉంటే ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పెరుగుతుందని, ఎన్నికల అధికారులు మరియు రాజకీయ పార్టీల మధ్య సమన్వయం మరింత మెరుగుపడుతుందని లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా ఓటరు జాబితా సవరణ, క్లెయిమ్స్ & అబ్జెక్షన్స్ ప్రక్రియలో సమయానుకూల సమన్వయం సాధ్యమవుతుందని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా బీఎల్వోల పూర్తి జాబితాను వీలైనంత త్వరగా విడుదల చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని లేళ్ళ అప్పిరెడ్డి కోరారు.
 

ఎస్‌ఐఆర్ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలి: సీఈఓకు అప్పిరెడ్డి విజ్ఞప్తి

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (SIR) కోసం ఉపయోగించబోయే ఓటరు జాబితాను డిజిటల్ ఫార్మాట్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు అందించాలని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కోరారు.

ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, నిష్పాక్షికత కోసం పూర్తి ఓటరు జాబితా వివరాలు రాజకీయ పార్టీలకు అందుబాటులో ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గాల వారీగా, బూత్‌ల వారీగా సెర్చ్ చేయగలిగే డిజిటల్ ఫార్మాట్‌లో ఓటరు జాబితాను అందించాలని డిమాండ్ చేశారు.

ఓటర్ల అక్రమ తొలగింపులు, డూప్లికేట్ ఎంట్రీలు, ఓటర్ల మార్పిడి వంటి అంశాలపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని అప్పిరెడ్డి పేర్కొన్నారు. ఓటర్ల చేర్పులు, తొలగింపులు, సవరణలు, వలసల ప్రక్రియలో అనుసరిస్తున్న విధానాలు, భద్రతా చర్యలను వెల్లడించాలని కోరారు.

సరైన ప్రక్రియ పాటించకుండా ఏ ఒక్క నిజమైన ఓటరునూ ఓటు హక్కు నుంచి దూరం చేయకూడదని స్పష్టం చేశారు. స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణ కోసం ఎస్‌ఐఆర్ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని విజ్ఞప్తి చేశారు.

గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు సంబంధిత డిజిటల్ ఓటరు డేటాను తక్షణమే అందుబాటులో ఉంచాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని లేళ్ళ అప్పిరెడ్డి కోరారు.

Back to Top