మొక్క‌జొన్న రైతుల‌కు రూ.3 వేల కోట్ల న‌ష్టం

ఆ న‌ష్టాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే భ‌రించాలి

వైయ‌స్ఆర్‌సీపీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ (వ్య‌వ‌సాయం, రైతు విభాగం) ఎంవీయ‌స్ నాగిరెడ్డి డిమాండ్‌

తాడేప‌ల్లి లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ (వ్య‌వ‌సాయం, 
రైతు విభాగం) ఎంవీయ‌స్ నాగిరెడ్డి 

సంక్షోభంలో శ‌న‌గ‌, పొగాకు, మొక్క‌జొన్న‌ రైతులు

వైయ‌స్ఆర్‌సీపీ హెచ్చ‌రిక‌ల్ని ప్ర‌భుత్వం పెడ చెవిన పెట్టింది

తూతూమంత్రంగా కొనుగోలు కేంద్రాలు.. అర‌కొర‌గా సేక‌ర‌ణ‌ 

పంట‌లు అమ్మిన రైతుకు బిల్లులు చెల్లించ‌డంలోనూ జాప్యం

పొగాకు పంట కేజీ స‌రాస‌రిన రూ. 220లు కూడా ప‌ల‌క‌డం లేదు

పెట్టుబ‌డి వెన‌క్కి వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు

మార్క్‌ఫెడ్ ద్వారా తెచ్చిన రూ. 13,883 కోట్లు ఏం చేశారు? 

మార్క్‌ఫెడ్ రుణాల‌తో రైతుల‌కు న్యాయం చేయాల‌ని కోరిన నాగిరెడ్డి

తాడేప‌ల్లి: మొక్క‌జొన్న క‌నీస మ‌ద్ధ‌తు ధ‌ర రూ. 2400 ఉంటే రైతులు రూ. 1400 నుంచి రూ. 1600ల‌కు మించి కొనుగోలు చేయ‌డం లేద‌ని, రైతులు నష్ట‌పోయిన‌ రూ.3వేల కోట్లను రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే చెల్లించి మొక్కొజొన్న రైతును ఆదుకోవాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ (వ్య‌వ‌సాయం, రైతు విభాగం) ఎంవీయ‌స్ నాగిరెడ్డి డిమాండ్ చేశారు. తాడేప‌ల్లి పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ మిర్చి పంట‌కు ప్ర‌త్యామ్నాయంగా మొక్క‌జొన్న సాగు చేసుకోవాల‌న్న ప్ర‌భుత్వ సూచ‌న‌ల‌తోనే రైతులు మొక్కజొన్న‌ను పండించార‌ని, అయినా వారిని ఆదుకోక‌పోతే ఎలా అని ప్ర‌శ్నించారు. శ‌న‌గ ధ‌రల‌ సంక్షోభం గురించి ప్ర‌భుత్వాన్ని ముందుగానే హెచ్చ‌రించినా ఈ ప్ర‌భుత్వం ప‌ట్టించు కోలేదని, మా పార్టీ ఎంపీలు కేంద్రమంత్రిని క‌లిసిన త‌ర్వాత కానీ చంద్ర‌బాబులో చ‌ల‌నం రాలేద‌న్నారు. అయినా లేఖ రాసి చేతులు దులిపేసుకున్నాడే కానీ శ‌న‌గ రైతుకి న్యాయం జ‌ర‌గ‌లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రూ. 7 వేలు చెల్లిస్తే కానీ శ‌న‌గ రైతుకి న్యాయం జ‌ర‌గ‌ద‌ని సూచించారు. అలాగే పొగాకు వేల కేంద్రాల‌ను ప‌రిశీలిస్తే రైతుకు స‌రాస‌రిన కేజీ రూ. 220 ల‌కు మించి ద‌క్క‌డం లేద‌ని, ఈ విధంగా ఉంటే పెట్టుబ‌డులు కూడా వెనక్కి వ‌చ్చే సూచ‌న‌లు క‌నిపించ‌డం లేద‌ని వివ‌రించారు. మార్క్‌ఫెడ్ ద్వారా ప్ర‌భుత్వం రూ. 13,853 కోట్లు రుణాలు తెచ్చింద‌ని, రైతుల కోసం తెచ్చిన ఆ డ‌బ్బుని రైతులకే వినియోగించాల‌ని ఎంవీయ‌స్ నాగిరెడ్డి ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు.   

- శ‌న‌గ రూ. 7వేల‌కు కొనుగోలు చేయాలి

కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక రెండు ఖ‌రీఫ్‌లు, రెండు ర‌బీలు పూర్త‌యిపోయాయి. ఈ ర‌బీలో స‌రాస‌రి సాగుక‌న్నా ఎక్కువగానే పంట‌లు పండినందుకు రైతులు సంతోషంగా ఉన్నారు. ఏడాది ర‌బీలో వ‌రి 22.70 ల‌క్ష‌ల ఎక‌రాలు, మొక్కజొన్న 12.35 ల‌క్ష‌ల ఎక‌రాలు, శ‌న‌గ 10.18 ల‌క్ష‌ల ఎక‌రాలు, పొగాకు 7.14 ల‌క్ష‌ల ఎక‌రాల్లో సాగైంది. దిగుమ‌తి సుంకాలు విధించ‌క‌పోతే శ‌న‌గ రైతులు సంక్షోభంలోకి వెళ్తున్నార‌ని ముందుగానే మా పార్టీ ఎంపీలు కేంద్ర మంత్రికి తెలియ‌జేశారు. ప్ర‌స్తుతం ఇస్తున్న క‌నీసం మ‌ద్ద‌తు ధ‌ర రూ. 5875లు రైతుకు ఏమాత్రం గిట్టుబాటు కాద‌ని, వెయ్యి రూపాయ‌లు బోన‌స్ ఇచ్చి రూ.7వేల‌కు పెంచాల‌ని సూచించ‌డం జ‌రిగింది. కానీ డ‌బుల్ ఇంజిన్ స‌ర్కార్ అని చెప్పుకుంటారే కానీ శ‌న‌గ విష‌యంలో కేంద్రానికి క‌నీసం లేఖ కూడా రాయ‌లేదు. శ‌న‌గ 10.18 ల‌క్ష‌ల ఎక‌రాల్లో సాగు జ‌రిగితే 7 ల‌క్ష‌ల ట‌న్నుల ఉత్ప‌త్తి జ‌రిగింది. శ‌నగ విష‌యాన్నివైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు లేవనెత్త‌డంతో కేంద్రం నుంచి కేవ‌లం 94,500 ట‌న్నులు మాత్ర‌మే సేక‌రించారు. క‌నీసం 4 ల‌క్ష‌ల ట‌న్నుల సేక‌ర‌ణ‌కు ప్ర‌భుత్వ అనుమ‌తి తీసుకొచ్చి ఉంటే చాలీచాల‌ని ధ‌ర‌ల‌తో రైతులు ఇబ్బంది ప‌డేవారు కాదు. శ‌న‌గ క‌నీస మ‌ద్ధ‌తు ధ‌ర రూ. 5875 ఉండ‌గా కేవ‌లం రూ. 4800 నుంచి 5 వేల‌కు కొనుగోలు చేయ‌డంతో శ‌న‌గ రైతుల‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని టీడీపీ అనుకూల ప‌త్రిక‌ల్లోనే రాస్తున్నారు. 

- పీడీపీఎస్ స్కీమ్ ప్ర‌కారమే మొక్క‌జొన్న రైతుకి రూ.3 వేల కోట్ల న‌ష్టం 

మొక్క‌జొన్న 12.35 ల‌క్ష‌ల ఎక‌రాల్లో సాగు జ‌రిగితే 42.8 ల‌క్ష‌ల ట‌న్నుల ఉత్ప‌త్తి జ‌రిగింది. ఈసారి దిగుబడి ఎక్కువ‌గా ఉండ‌బోతోంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ త‌ర‌ఫున ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించాం. గ‌త ఖ‌రీఫ్‌లో రూ. 2400 మ‌ద్ద‌తు ధ‌ర ఉంటే రైతులు కేవ‌లం రూ. 1400 నుంచి రూ. 1700ల‌కే అమ్ముకోవాల్సి వ‌చ్చింద‌ని చెప్పాం. ఖ‌రీఫ్‌లో మాదిరిగా ర‌బీలో న‌ష్ట‌పోకుండా రైతుల‌ను ఆదుకోవాల‌ని కోర‌డం జ‌రిగింది. గ‌తంలో ఎప్పుడూ కేంద్రం మొక్క‌జొన్న పంట‌ను కొనుగోలు చేయ‌లేదు. దీంతో వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో మూడేళ్ల‌పాటు మార్క్‌ఫెడ్ ద్వారా మొక్క‌జొన్న పంట‌ను సేక‌రించ‌డం జ‌రిగింది. తెలంగాణ‌, కర్నాట‌క, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లోనూ ఆయా ప్ర‌భుత్వాలే మొక్క‌జొన్న పంట‌ను సేక‌రిస్తున్నాయి. పీఎస్ఎస్ స్కీమ్ (ప్రైస్ స్టెబిలైజేష‌న్ స్కీమ్) ధ‌రల స్థిరీక‌ర‌ణ ప‌థ‌కం కింద రాష్ట్ర ప్ర‌భుత్వం పంట‌లు కొనుగోలు చేస్తే ఆ డ‌బ్బును కేంద్రం రీయింబ‌ర్స్ చేస్తుంది. అదే విధంగా ఏపీ ప్ర‌భుత్వం కొనుగోలు చేయాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఒత్తిడి తేవ‌డంతో చంద్ర‌బాబు మాత్రం పీడీపీఎస్ (ప్రైస్ డెఫిషియ‌న్సీ పేమెంట్ స్కీమ్‌) కింద కొనుగోలు చేయాల‌ని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశాడు. మ‌ద్ధ‌తు ధ‌ర క‌న్నా త‌గ్గిపోతే ఆ మేర‌కు సొమ్మును చెల్లించాల‌ని కోరాడు. ఆయిల్ సీడ్స్ కోసం మాత్ర‌మే ఈ స్కీమ్‌ను త‌యారు చేశారు. మొక్క‌జొన్న రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నార‌ని, రైతులు రూ. 1400 ల‌కే అమ్ముకోవాల్సి వ‌స్తుంద‌ని, పీడీపీఎస్ స్కీమ్ వ‌ర్తింప‌జేయాల‌ని కేంద్రానికి లేఖ రాశాడు. ఆయ‌న చెప్పిన లెక్క‌ల ప్ర‌కార‌మే మ‌ద్ధ‌తు ధ‌ర చెల్లించ‌ని కార‌ణంగా మొక్క‌జొన్న రైతు రూ. 3వేల కోట్లు న‌ష్ట‌పోయాడు. ఈ 3 వేల కోట్ల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వమే మొక్క‌జొన్న రైతుల‌కు చెల్లించాలి. రాష్ట్రంలో సగం ఏరియాలో మొక్క‌జొన్న పంట సాగైంది. గ‌తేడాది మిర్చి, పొగాకు పంట‌ల‌కు ధ‌ర‌లు లేక‌పోవ‌డంతో ప్ర‌భుత్వ సూచ‌న‌ల‌తో ఈసారి మొక్క‌జొన్న పంటను సాగు చేశారు. ప్ర‌భుత్వం చెప్పిన‌ట్టు మొక్క‌జొన్న పంట‌ను సాగుచేసినా వారికి గిట్టుబాటు ధ‌ర చెల్లించి ప్ర‌భుత్వం ఆదుకోవ‌డం లేదు. 

- కుమార‌స్వామికి ఉన్న చొర‌వ చంద్ర‌బాబుకేది? 

కంది పంట‌కు క‌ర్నాట‌క‌లో కుమార‌స్వామి మంత్రిగా ఉండి 9 ల‌క్ష‌ల కంది పంట సేక‌ర‌ణ‌కు కేంద్రం నుంచి అనుమ‌తి తీసుకొస్తే చంద్ర‌బాబు మాత్రం ఏపీలో కేవ‌లం 1.17 ల‌క్ష‌ల ట‌న్నుల సేక‌ర‌ణ‌కు మాత్ర‌మే అనుమ‌తులు తెచ్చి, 80 వేల ట‌న్నులు మాత్ర‌మే సేక‌రించారు. ధాన్యం అమ్మిన రైతుల‌కు ఇంత‌వ‌ర‌కు చెల్లింపులు చేయ‌లేదు. స‌కాలంలో చెల్లింపులు చేయ‌క‌పోవ‌డంతో పంట కొనుగోలు కేంద్రాల‌కు రైతులు ముఖం చాటేసే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ప్ర‌భుత్వం మీద రైతులు న‌మ్మ‌కం కోల్పోతున్నారు. పంట ఉత్ప‌త్తి జ‌రగ‌కముందే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే మార్కెట్లో పోటీ పెరిగి ధ‌ర వ‌స్తుంద‌ని చెబుతున్నా ఈ ప్ర‌భుత్వానికి ప‌ట్ట‌డం లేదు. పక్క రాష్ట్ర ప్ర‌భుత్వాలు తెరిచినా కూట‌మి ప్ర‌భుత్వం క‌నీస ఆలోచ‌న చేయ‌లేదు. పొగాకు రైతుల ప‌రిస్థితి కూడా ద‌య‌నీయంగా ఉంది. వ‌ర్జీనియా పొగాకుని స‌రాస‌రి రూ. 220కి మించి కొన‌డం లేదు. 35 నుంచి 50 శాతం బేళ్ల‌ను కొనుగోలు చేయ‌క‌పోవడంతో రైతులు వెన‌క్కి తీసుకెళ్లాల్సిన దుస్థితి. పొగాకు రైతుకి పెట్టుబ‌డి కూడా వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. 

ప్ర‌భుత్వం ఇప్ప‌టికే మార్క్‌ఫెడ్ పేరుతో రూ. 12,053 కోట్లు రుణం తీసుకుంది. మ‌ళ్లీ మ‌రో రూ. 1800 కోట్ల రుణానికి ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేసింది. మొత్తంగా రూ. 13,853 కోట్లు స‌మీక‌రించారు. మార్క్‌ఫెడ్ ద్వారా పంట‌ల‌ను కొనుగోలు చేసి రైతుల‌ను ఆదుకోవాల్సిందిబోయి ఆ డ‌బ్బంతా ఏం చేసిన‌ట్టు?  రైతుల పేరు మీద తెచ్చిన ఈ రుణం ఏమైందో ప్ర‌భుత్వం స‌మాధానం చెప్పాలని ఎంవీయ‌స్ నాగిరెడ్డి ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు.

Back to Top