రైతుల గోడు పట్టించుకోని కూటమి ప్రభుత్వం

నంద్యాల మార్కెట్ యార్డ్ వద్ద వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల నిరసన

నంద్యాల : రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ నంద్యాల జిల్లాలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. నంద్యాల టేక్కే మార్కెట్ యార్డ్ వద్ద నిర్వహించిన ఈ నిరసనలో ఎమ్మెల్సీ ఇసాక్ బాష, మాజీ మార్క్‌ఫెడ్ చైర్మన్ పీ.పీ. నాగిరెడ్డి సహా పలువురు నాయకులు పాల్గొని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నేతలు ఆరోపించారు. “మద్దతు ధర ఏది?” అంటూ మార్కెట్ యార్డ్ సాక్షిగా కూటమి ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. రైతుల పక్షాన వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం ఎప్పటికీ ఆగదని ఎమ్మెల్సీ ఇసాక్ బాష హెచ్చరించారు.

రబీ, ఖరీఫ్ సీజన్లలో రైతులకు అవసరమైన యూరియా, పురుగుమందులు సకాలంలో అందించడంలో ప్రభుత్వం విఫలమైందని, దీంతో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని నాయకులు మండిపడ్డారు. జొన్న, మొక్కజొన్న, వరి, పసుపు పంటలకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినప్పటికీ, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక రైతులను నట్టేట ముంచుతోందని విమర్శించారు. గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు) ద్వారా విత్తనాలు, ఎరువులు అందించి రైతులకు అండగా నిలిచారని గుర్తు చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని మాజీ మార్క్‌ఫెడ్ చైర్మన్ పీ.పీ. నాగిరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల పంటలను కొనుగోలు చేసే కేంద్రాలను ఏర్పాటు చేయాలని, రాజకీయాలకు అతీతంగా రైతులకు న్యాయం చేయాలని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా రైతుల తరఫున పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, మహిళా విభాగం ప్రతినిధులు, నంద్యాల మండల అధ్యక్షులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

 

Back to Top