విజయవాడ: అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తితోనే ప్రస్తుతం కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై వైయస్ఆర్‌సీపీ పోరాటం కొనసాగిస్తోందని మల్లాది విష్ణు స్పష్టం చేశారు. విజయవాడలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రామకృష్ణాపురం వంతెన వద్ద ఉన్న అల్లూరి విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు వైయస్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, వైయస్ఆర్‌సీపీ ఎప్పుడూ అల్లూరి సీతారామరాజు అడుగుజాడల్లోనే నడుస్తోందని అన్నారు. గిరిజనుల హక్కులు, స్వాభిమాన రక్షణ కోసం పోరాడిన అల్లూరి స్ఫూర్తి పార్టీకి ఆదర్శమని పేర్కొన్నారు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు పేరును జిల్లాకు పెట్టి గౌరవించిందని గుర్తుచేశారు. అలాగే అల్లూరి పర్యటించిన ప్రాంతాల్లో మ్యూజియంలు ఏర్పాటు చేసి ఆయన చరిత్రను భవిష్యత్ తరాలకు పరిచయం చేసే ప్రయత్నం చేశారని తెలిపారు. భీమవరంలో ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా అల్లూరి విగ్రహం ఆవిష్కరించబడిందని పేర్కొన్నారు. క్షత్రియ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తూ అసెంబ్లీ, మండలిలో అవకాశాలు కల్పించడంతో పాటు క్షత్రియ కార్పొరేషన్ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు.