రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి

రామచంద్రపురం నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాశ్ డిమాండ్‌

 రామచంద్రపురంలో వైయ‌స్ఆర్‌సీపీ నిరసన

రామ‌చంద్రాపురం: రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ రామచంద్రపురం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాశ్ పాల్గొని ప్రభుత్వ వైఖరిని ఎండ‌గ‌ట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రైతులు పండించిన పంటలకు సరైన ధర లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం వెంటనే సీఎంఆర్‌ రేటుకే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలను ఒక యూనిట్‌గా తీసుకుని అన్ని రైస్ మిల్లుల్లో సీఎంఆర్ విధానం అమలు అయ్యేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల సమస్యలను ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర రైతు విభాగం ఉపాధ్యక్షుడు కొవ్వూరి త్రినాధ్‌రెడ్డి మాట్లాడుతూ, రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

అనంతరం రైతుల సమస్యలకు సంబంధించిన వినతిపత్రాన్ని ఆర్డీవో కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌కు పార్టీ నాయకులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్దఎత్తున పాల్గొని రైతుల సమస్యలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.
 

Back to Top