రైతులు కష్టాల్లో ఉంటే కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లు ఎందుకు?

చంద్ర‌బాబు..సొల్లు క‌బుర్లు ఆపండి

మాజీ మంత్రి జోగి ర‌మేష్ మండిపాటు

తాడేపల్లిలోని  వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి జోగి రమేష్‌

రాష్ట్రంలో పరిపాలన ఉందా? ముఖ్యమంత్రి ఉన్నారా?

అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల ప్ర‌శ్న ఇదే

సీఎం చంద్రబాబు వ‌రుస కలెక్టర్ల కాన్ఫరెన్స్‌తో ప్రజలకు ఉపయోగం లేదు.

చంద్ర‌బాబు మాటలు కోటలు దాటుతున్నాయి.. కానీ ఫ‌లితం శూన్యం 

రైతులు ధాన్యం కొనుగోలు చేయాలని వేడుకుంటున్నా ప్రభుత్వం స్పందించడం లేదు.

గోనె సంచులు క‌రువు, ట్రాన్స్‌పోర్ట్ లేక ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి

రాష్ట్రంలో అసలు ముఖ్యమంత్రి ఉన్నారా? అని రైతులే ప్రశ్నిస్తున్న పరిస్థితి

రాష్ట్ర‌ వ్యవసాయ మంత్రి ఎక్కడున్నారో తెలియదు

మొక్కజొన్న, పొగాకు, మిర్చి, పత్తి రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు

అకాల వర్షాలు, వాతావరణ మార్పులతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు

రైతుల సమస్యలు పరిష్కరించకుండా కలెక్టర్ల సమావేశాలు నిర్వహించడం వల్ల ప్రయోజనం లేదు

మాజీ మంత్రి జోగి ర‌మేష్ ఆక్షేప‌ణ 

సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్.. ఎన్నికల హామీలు అమలు కాలేదు. 

ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ ఆస్తులను అమ్మే ప్రయత్నం జరుగుతోంది

మట్టి, ఇసుక, బార్లు, మద్యం దుకాణాల్లో కూటమి నేతలు దోపిడీ  

గూగుల్, రిలయన్స్ వంటి పెట్టుబడుల క్రెడిట్‌ను చంద్రబాబు తీసుకుంటున్నారు

పోర్టులు, మెడికల్ కాలేజీలు, హార్బర్లు జగనన్న హయాంలో వచ్చినవే 

ప్రెస్‌మీట్‌లో స్ప‌ష్టం చేసిన మాజీ మంత్రి జోగి ర‌మేష్  

 తాడేప‌ల్లి: రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ల పేరుతో సీఎం చంద్రబాబు కాలక్షేపం చేస్తున్నారని వైయ‌స్సార్‌సీపీ నేత‌, మాజీ మంత్రి జోగి ర‌మేష్ మండిపడ్డారు. రెండేళ్ల కూట‌మి ప్ర‌భుత్వంలో చంద్ర‌బాబు వరుసగా కలెక్టర్ల సమావేశాలు నిర్వహిస్తూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని, ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు మాత్రం తీసుకోవడం లేదని ఆక్షేపించారు. రైతులు ధాన్యం కొనుగోలు చేయాలని వేడుకుంటున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోనె సంచులు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని, ట్రాన్స్‌పోర్ట్ సదుపాయం లేక ధాన్యం మార్కెట్ యార్డుల్లోనే పేరుకుపోతుందని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. రైతుల స‌మ‌స్య‌ల‌ను విస్మ‌రించిన చంద్ర‌బాబు క‌లెక్ట‌ర్ల‌ను కూర్చోబెట్టుకొని సూప‌ర్ సిక్స్ సూప‌ర్ హిట్ అంటూ సొల్లు క‌బుర్లు చెబుతున్నార‌ని మండిప‌డ్డారు. అస‌లు రాష్ట్రంలో ప‌రిపాల‌న ఉందా? ముఖ్య‌మంత్రి, మంత్రులు ఉన్నారా అని రైతులు ప్ర‌శ్నిస్తున్నార‌ని తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో మాజీ మంత్రి జోగి రమేష్ కూటమి ప్రభుత్వంపై ధ్వ‌జ‌మెత్తారు. ప్రెస్‌మీట్‌లో ఆయ‌న ఏమ‌న్నారంటే.. 

- మాట‌లు కోట‌లు దాటుతున్నాయి..ఫ‌లితం శూన్యం
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏడోసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. వరుస సమావేశాలు, ఊకదంపుడు ఉపన్యాసాలు, మాటలు కోటలు దాటుతున్నాయి కానీ తీరా చూస్తే ఫ‌లితం శూన్యం. ప్ర‌తి స‌మావేశంలో అదే మాటలు చెప్పడం తప్ప ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు కనిపించడం లేదు. ఈ రోజు రైతులు పొలం గట్లపై కూర్చొని “మా ధాన్యం కొనండి” అని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. గోనె సంచులు లేవు, సంచులు ఉంటే ట్రాన్స్‌పోర్ట్ లేదు, ట్రాన్స్‌పోర్ట్ చేసినా మార్కెట్ యార్డుల్లో కొనుగోలు లేదు. 

- సొల్లు క‌బుర్లు ఆపండి బాబూ!
చంద్రబాబు గారూ.. మీ సొల్లు ఉపన్యాసాలు మానేసి కలెక్టర్లను జిల్లాలకు పంపించి రైతుల కన్నీళ్లు తుడిపించండి. ఉపన్యాసాలతో రైతుల సమస్యలు తీరవు. రోడ్లపై ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులకు డబ్బులు చెల్లించాలి. ఒకవైపు రైతులు అరణ్యరోదన చేస్తుంటే, మరోవైపు ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్‌లు పెడుతున్నారు, వ్యవసాయ మంత్రి ఎక్కడున్నారో తెలియదు, 8 మంది మంత్రులు సింగపూర్‌లో షికార్లు కొట్టి వ‌చ్చారు. మొక్కజొన్న, పొగాకు, మిర్చి, పత్తి రైతులను ఎవరు ఆదుకుంటారు? రాష్ట్రంలో అసలు ముఖ్యమంత్రి ఉన్నారా? వ్యవసాయ మంత్రి ఉన్నారా? అని రైతులే ప్రశ్నించే పరిస్థితి వచ్చింది.

- ఒక్క సంక్షేమ పథకమైనా అమలు చేశారా?
రూ.9.74 లక్షల కోట్ల అప్పు ఉందని చంద్రబాబు క‌లెక్ట‌ర్ల స‌మావేశంలో చెబుతున్నారు. ఈ అప్పు ఎవరు చేశారో ప్రజలకు చెప్పాలి. రాష్ట్ర విభజన సమయంలో 2014లో రూ.1,40,717 కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని అప్పగిస్తే, 2019 నాటికి చంద్రబాబు ప్రభుత్వం అప్పును రూ.3,90,247 కోట్లకు తీసుకెళ్లింది. ఆ ఐదేళ్లలో ప్రజలకు ఉపయోగపడే ఒక్క సంక్షేమ పథకమైనా అమలు చేశారా?. మా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న 2019–2024 మధ్య కాలంలో డీబీటీ ద్వారా రూ.2.74 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం. అదీ పరిపాలన అంటే. మరో రూ.1.40 లక్షల కోట్లు నాన్-డీబీటీ రూపంలో ప్రజలకు అందించాం. జగనన్న బటన్ నొక్కితే ప్రజలు పండగ చేసుకున్నారు. రైతన్నను రారాజుగా నిలబెట్టిన ప్రభుత్వం వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం.

- అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు అవ‌స్థ‌లు
కూట‌మి పాల‌న‌లో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. రెండేళ్లుగా చంద్రబాబు మాత్రం సొల్లు కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పుల‌ కుప్పగా చేశారు.. ఆ డబ్బంతా ఏమైంది? రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. డ్వాక్రా మహిళలకు ఏమిచ్చారు? విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చారా? ఆరోగ్యశ్రీ అటకెక్కింది. వైద్యం అందక పేదలు విలవిల్లాడుతున్నారు. రాష్ట్రంలో పరిపాలన ఉందా? ముఖ్యమంత్రి ఉన్నారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

- సూప‌ర్ సిక్స్ అట్ట‌ర్ ఫ్లాప్‌
సూపర్ సిక్స్ సూప‌ర్ హిట్ అంటూ చంద్ర‌బాబు సినిమా డైలాగులు చెబుతున్నారు. అది అట్టర్ ఫ్లాప్ అయిందని ప్రజలే అంటున్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని మాట తప్పారు. అక్కచెల్లెమ్మలకు నెలకు రూ.1500 ఇస్తామని చెప్పారు.. ఏమైంది? 50 ఏళ్లు దాటిన వారికి రూ.4 వేల పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చారు.. ఎక్కడ అమలు చేశారు? ఉన్న పింఛన్లనే తొలగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నిక‌ల హామీల అమ‌లులో పూర్తిగా విఫలమైంది .

- ఒక్క మంచి పని అయినా చేశారా?
కాన్ఫరెన్స్‌లు ఎందుకు చంద్రబాబు? కలెక్టర్లను ఎదుట కూర్చోబెట్టుకొని సొల్లు కబుర్లు చెబితే ప్రజల సమస్యలను ఎవరు పట్టించుకుంటారు? రెండేళ్ల పాలనలో ఒక్క మంచి పని అయినా చేశారా?. ప్రైవేటీకరణ పేరుతో ఏది అమ్ముదామా, ఏ భూములు దోచుకుందామా అన్న పోటీలో ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారు. మట్టి, ఇసుక, బార్లు, మద్యం దుకాణాల్లో కూటమి నేతలు దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రజాసేవ కంటే దోచుకోవడంపైనే మీరు దృష్టి పెట్టారు. 

- ప్ర‌తి దాంట్లో చంద్ర‌బాబు క్రెడిట్ చోరీ
రాష్ట్రానికి వచ్చిన ప్రతి పరిశ్రమ, పెట్టుబడిపై తనకే క్రెడిట్ తీసుకోవడం చంద్రబాబు అలవాటైంది. గూగుల్, రిలయన్స్ వంటి సంస్థల పెట్టుబడుల నుంచి పోర్టులు, మెడికల్ కాలేజీలు, హార్బర్ల వరకు అన్నింటినీ తన ఘనతగా చెప్పుకుంటున్నారు. చంద్ర‌బాబు మాట‌లు ప్రజలు నమ్మడం లేదు. విజయవాడ వెస్ట్ బైపాస్, మచిలీపట్నం పోర్టు వంటి అభివృద్ధి పనులు జగనన్న ప్రభుత్వ హయాంలోనే జరిగాయి

చంద్ర‌బాబూ..రైతుల పక్షాన నిలబడి ధాన్యం కొనుగోలు చేయండి.. మామిడికి మద్దతు ధర ఇవ్వండి.. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోండి . రైతులు, విద్యార్థులు, అక్కచెల్లెమ్మల పక్షాన వైయ‌స్ఆర్‌సీపీ ఎప్పుడూ అండగా ఉంటుంది, ప్రతిపక్షంగా ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తాం.

2014–2019 మధ్య చంద్రబాబు జపాన్ వెళ్లి బుల్లెట్ ట్రైన్ వద్ద ఫొటోలు దిగి అమరావతికి బుల్లెట్ ట్రైన్ వస్తుందని ప్రచారం చేశారు. 12 ఏళ్లు గడిచినా అది ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ వస్తోందంటూ ఏఐ ఫొటోలతో ప్రచారం చేస్తున్నారు. తప్పుడు ప్రచారాలు మానేసి ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని మాజీమంత్రి జోగి ర‌మేష్‌ డిమాండ్ చేశారు.

Back to Top