కర్నూలు జిల్లా: రైతులను కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ మండిపడ్డారు. రైతుల పట్ల కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతన్నలు దయనీయ పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటిస్తున్న గిట్టుబాటు ధరలు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయని విమర్శించారు. తుగ్గలి మండలం నునుసురాళ్ల గ్రామంలో వైయస్ఆర్‌సీపీ నాయకులతో కలిసి మామిడి తోటలను పరిశీలించిన ఆమె, స్థానిక మామిడి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మామిడి బాక్స్‌కు కనీసం రూ.2000 గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏ పంట పండించిన రైతుకూ న్యాయం జరగడం లేదని మండిపడ్డ శ్రీదేవమ్మ, ధాన్యం పండించిన రైతులు కూడా తమ పంటను అమ్ముకోలేక గిట్టుబాటు ధర కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో పెట్టుబడి సాయం నుంచి గిట్టుబాటు ధర కల్పించే వరకు రైతులకు ప్రభుత్వం అండగా నిలిచిందని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో రైతులు పండించిన పంటను అమ్ముకునే పరిస్థితి కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ఇలాగే రైతులను నిర్లక్ష్యం చేస్తే వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రైతుల తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని కంగాటి శ్రీదేవమ్మ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అనుబంధ కమిటీ నాయకులు, జిల్లా ఉపాధ్యక్షుడు, జిల్లా కమిటీ నాయకులు, అనుబంధ సంఘాల తాలూకా అధ్యక్షులు, మండల కన్వీనర్, మండల కమిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.