శ్రీకాకుళం, కాకినాడ: చంద్రబాబు తన పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి పదే పదే వైయస్ఆర్‌సీపీపైనా, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైనా అడ్డగోలు విమర్శలకు దిగుతున్నారని, శ్రీకాకుళం జిల్లాలో ఆయన పర్యటనలో ఇవాళ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శమని మాజీ మంత్రులు సీదిరి అప్పలరాజు, కురసాల కన్నబాబు వేర్వేరుగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లలో మండిపడ్డారు. వైయస్ఆర్‌సీపీని గొడ్డలి పార్టీ అంటున్న చంద్రబాబు వ్యాఖ్యలకు ప్రతిగా.. తాము కూడా టీడీపీని తెలుగు వెన్నుపోటు పార్టీ (టీవీపీ)గా నామకరణం చేస్తున్నట్లు తెలిపారు. ఎందుకంటే చంద్రబాబు బతుకంతా వెన్నుపోట్లే అన్నారు. ఎన్టీఆర్ మొదలుకుని ప్రజలకు, పార్టీ నేతలకు చంద్రబాబు ఎన్నో వెన్నుపోట్లు పొడిచారన్నారు. ఉత్తరాంధ్రలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్దిని తానే చేసినట్లు చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటని సీదిరి అప్పలరాజు, కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. ప్రెస్ మీట్లలో సీదిరి అప్పలరాజు, కురసాల కన్నబాబు ఇంకా ఏమన్నారంటే.. శ్రీకాకుళంలో చంద్రబాబు మూడో టూర్ కూడా వృథా: సీదిరి అప్పలరాజు చెత్త సంపద కేంద్రం ప్రారంభానికి సీఎం చంద్రబాబు రావడం విచిత్రంగా ఉంది. ఈ పేరుతో జిల్లాకు రెండేళ్లలో మూడోసారి వచ్చిన చంద్రబాబు .. జగన్మోహన్ రెడ్డిపై, వైయస్ఆర్‌సీపీపై విమర్శలకే పరిమితమయ్యారు. మొదటిసారి ఇచ్చాఫురానికి వచ్చినప్పుడు టీ పెట్టడం నేర్పించారు, రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు హార్బర్ మంజూరు చేసిన బుడగట్ల పాలెం వచ్చినప్పుడు ఆ పనులు వేగవంతం చేస్తారని భావించాం, కానీ ఆపేసి వెళ్లిపోయారు. ఇప్పుడు మూడోసారి వస్తున్నప్పుడు ఓ పెద్ద సంపద సృష్టించే కార్యక్రమం తెస్తున్నారని ఆశతో ఎదురుచూశాం. కానీ చెత్త సంపద కేంద్రం తెచ్చారు. శ్రీకాకుళం జిల్లా మీద చంద్రబాబుకు ఉన్న ప్రేమ.. చెత్త సంపద కేంద్రం ద్వారా తేటతెల్లమైంది. పైపెచ్చు జిల్లా ప్రజలకు చంద్రబాబు రెండు సలహాలు కూడా ఇచ్చారు. ఆయన ఇచ్చిన సలహాలతో జిల్లా ప్రజలు సంపద సృష్టించుకోవాలని మేం కూడా పిలుపునిస్తున్నాం. పిల్లల్ని కనండి, పిల్లలు మీకు భారం కాదు, పిల్లలే మీకు ఇచ్చే సంపద అంటున్నారు. ఆ సలహా ఏదో ఆయన కొడుకు లోకేష్ కు ఇవ్వొచ్చు కదా. పేదలకు ఎందుకు ఇస్తున్నారు ఇలాంటి సలహాలు ? మీరు మాత్రం ఎందుకు ఒక్క పిల్లాడిని కని ఆపేశారు, ఇద్దరినో, ముగ్గురినో ఎందుకు కనలేదు ? చెత్తను ప్రాసెస్ చేసుకుని సంపద సృష్టించుకోవాలని చంద్రబాబు మరో సలహా ఇచ్చారు. జిల్లా ప్రజలు సంపద ఎలా సృష్టించుకోవాలో చంద్రబాబు ఇచ్చిన అమూల్యమైన సలహా ఇది. శ్రీకాకుళం జిల్లా అంటే చంద్రబాబుకు ఇంత చిన్నచూపు ఎందుకని అడుగుతున్నాం. టీడీపీ అంటేనే వంచన, దగా అని అందరికీ తెలుసు సీఎం హోదాలో జిల్లా టూర్ కు వచ్చిన చంద్రబాబు.. ఆ ప్రాంతానికి తానేం చేశారో చెప్పకుండా రాజకీయ ప్రసంగానికి పరిమితం కావడం సిగ్గుచేటు. చెప్పుకోపడానికి చంద్రబాబు చేసిందేమీ లేదు. చంద్రబాబు పదే పదే నరకాసురుడు అంటున్నారు. మేం ఆయన్ను నారాసురుడని పిలుస్తున్నాం. మాది గొడ్డలి పార్టీ అయితే మీది గునపం పార్టీ, వెన్నుపోటు పార్టీ. ఈ విషయం చంద్రబాబు గుర్తుంచుకోవాలి. ఆనాటి ఎన్టీఆర్ తెలుగుదేశానికీ, నేడు చంద్రబాబు టీడీపీకి చాలా తేడా ఉంది. వైశ్రాయ్ హోటల్ లో వంచన, దగా పునాదుల మీద ఆవిర్భవించి పార్టీ చంద్రబాబు టీడీపీ. గునపం వేటుతో వంచన, దగాల్ని మూలస్తంభాలుగా చేసుకుని ఆవిర్భవించిన పార్టీ టీడీపీ అయితే వైఎస్సార్ గారి ఆశయాలతో, ప్రజల సంక్షేమం కోసం ఆవిర్భవించిన దమ్మున్న పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. రెండింటికీ ఎంత తేడా ఉందో గమనించాలి. ఆవిర్బావంలో కానీ, ఆశయాల్లో కానీ, ఆదర్శాల్లో కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, చంద్రబాబు టీడీపీకి ఎక్కడైనా పోలిక ఉందా అసలు ? అందుకే బోత్ ఆర్ నాట్ సేమ్.. వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికే విమర్శలు పాలనలో వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికే, చేతకానితనం నుంచి దృష్టి మళ్లించడానికే చంద్రబాబు ఇలా వెళ్లిన ప్రతిచోటా విమర్శిస్తుంటారు. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు జగన్నామస్మరణే చేస్తుంటారు. లేకపోతే ఇవాళ సందర్భం ఏమిటి ? మీరు చేస్తున్న విమర్శలు ఏంటని అడుగుతున్నాం. దేశంలో నిన్న పెట్రోల్ రేట్లు పెరిగాయి. దేశంలో అత్యధిక పెట్రోల్ రేటు ఎక్కడ ఉందని చూస్తే గుంటూరులో అత్యధిక రేటు లీటరుకు రూ.113.50 ఉంది. ఈ రేట్లు ఎందుకు తగ్గించరు ? గతంలో పెట్రోల్ రేట్లు ఎక్కువగా ఉంటే జగన్మోహన్ రెడ్డి వల్లే పెరిగాయని చెప్పారు. ఇవాళ పెరిగితే మాత్రం కేంద్రం వల్లే పెరిగాయని చెప్పుకుంటున్నారు. 31 శాతం వ్యాట్ తో పాటు మరో నాలుగు రూపాయలు అదనపు వ్యాట్ ఉంది. మరో రూపాయి రోడ్డు అభివృద్ది సెస్ పేరుతో వసూలు చేస్తున్నారు. మీకు చేతనమైతే పెట్రోల్, డీజిల్ పై అదనపు వ్యాట్ నాలుగు రూపాయలు తగ్గించండి. అప్పుడు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ ధరలు తగ్గుతాయి. ఉత్తరాంధ్రలో భోగాపురం ఎయిర్ పోర్టు, మూలపేట పోర్టుల్ని తన ఘనతగా చెప్పుకుంటున్న చంద్రబాబు.. .వీటికి ఎవరు శ్రీకారం చుట్టారో, ఎవరు పనులు పూర్తి చేశారో చెప్పాలి. మీరు చెప్పుకుంటున్న ప్రతీదీ జగన్మోహన్ రెడ్డి ఘనతే. జంఝావతి, తోటపల్లి రబ్బర్ డ్యామ్ పనులు రాజశేఖర్ రెడ్డి గారు మొదలుపెడితే మిగిలిన భాగం జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు. వంశధార స్టేజ్ 2 నేరడి బ్యారేజ్ పనులపైనా అదే తీరు. గతంలో నేరడి బ్యారెజ్ వివాదంపై ఒడిశా సీఎం దగ్గరకు వెళ్లి మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారే. ఇందులో చంద్రబాబు పాత్ర ఏముందో చెప్పాలి. పలాసలో కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రి, వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టు, శ్రీకాకుళం ప్రభుత్వ మెడికల్ కాలేజీ ..ఇలా ప్రతీదీ జగన్మోహన్ రెడ్డి పనులు ప్రారంభించి పూర్తి చేశారు. పార్వతీపురంలో మెడికల్ కాలేజీ, ట్రైబల్ వర్సిటీ ఇచ్చాం. నర్సీపట్నం, అనకాపల్లిలో మెడికల్ కాలేజీలు, భోగాపురం, మూలపేట పోర్టులు తెచ్చారు. కానీ ఇవన్నీ తామే చేసినట్లు చంద్రబాబు చెప్పుకునే పరిస్ధితికి వచ్చారు. మాది గొడ్డలి పార్టీ అయితే మీది వెన్నుపోటు పార్టీయా ?: కురసాల కన్నబాబు వైయస్ఆర్‌సీపీకి గొడ్డలి పార్టీ అని నామకరణం చేసినట్లు చంద్రబాబు ఈ మధ్య సభల్లో పదే పదే చెప్తున్నారు. మేం కూడా టీడీపీకి టీవీపీగా నామకరణం చేస్తున్నాం. దీని అర్దం తెలుగు వెన్నుపోటు పార్టీ. పొరుగు రాష్ట్రంలో ఉన్న టీవీకేకు దగ్గరిగా కూడా ఉంటుంది. మీ టీవీపీ ఏ ఒక్క వర్గాన్ని అయినా సరే మోసం చేయకుండా, దగా చేయకుండా, వెన్నుపోటు పొడవకుండా వదిలిపెట్టిందా చెప్పాలి. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడవటం ఎలాగో ఓ చరిత్ర. దాన్ని వదిలేస్తే ఎన్నికల్లో భారీ వాగ్దానాలు ఇచ్చి ఓట్లు దండుకున్నాక వాళ్లను మోసం చేసిన చరిత్ర ప్రజలు మర్చిపోయినా మేం మర్చిపోలేదు. 2004 నుంచి ఏ ఎన్నికలు తీసుకున్నా చంద్రబాబుది ఇదే తీరు. ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోకుండా ప్రతిసారీ ప్రజల్ని వెన్నుపోటు పొడిచారు. గత ఎన్నికల్లో సైతం ఆడబిడ్డ నిధి నుంచి నిరుద్యోగ భృతి వరకూ ఏది అడిగినా ఇచ్చేశాం అంటున్నారు. ఉచిత పంటల బీమా దగ్గరి నుంచి సకాలంలో ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చే వరకూ రైతుల్ని మోసం చేయడం నిజం కాదా ? ఉద్యోగులకు ఎన్నో ఆశలు చూపించి వారికి పీఆర్సీ కూడా వేయకుండా మోసం చేసి వెన్నుపోటు పొడిచారు. ఆక్వా రైతుల నుంచి వరి, మొక్కజొన్న, ప్రత్తి ఇలా ప్రతీ రైతునూ వెన్నుపోటు పొడిచారు. మీ పార్టీలో సీనియర్లను సైతం వెన్నుపోటు పొడిచారు. 2014లో బీజేపీతో వెళ్లి 2019 వచ్చే సరికి అదే మోడీని నానా బూతులు తిట్టి వెన్నుపోటు పొడిచారు. కమ్యూనిస్టుల్ని సైతం వెన్నుపోటు పొడవలేదా చెప్పాలి. నికృష్టమైన రాజకీయాలు చేస్తూ వైఎస్సార్సీపీని బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. వైఫల్యాల నుంచి డైవర్షన్ కోసమే శ్రీకాకుళంలో ఇవాళ చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తుంటే చాలా కారణాలు కనిపిస్తున్నాయి. దేశంలో అత్యధిక రేట్లకు పెట్రోల్ ఉత్పత్తుల్ని విక్రయిస్తున్న రాష్ట్రం మనదే. ఏపీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.113.60, డీజిల్ లీటరుకు రూ.101.24కు చేరింది. మీ శిష్యుడు ముఖ్యమంత్రిగా తెలంగాణలో పెట్రోల్ లీటరుకు రూ.110.89, డీజిల్ రూ.98.96. ఇదెక్కడో కాదు పక్కనే ఉన్న తెలంగాణలోనే. మీ శిష్యుడు కూడా మీ కంటే తక్కువ రేట్లకే పెట్రోల్, డీజిల్ అమ్ముతున్నారు. మీ కూటమిలో భాగస్వామి అధికారంలో ఉన్న గుజరాత్ లో లీటరు పెట్రోల్ రూ.97.95. అక్కడికీ ఇక్కడికీ దాదాపు లీటరుకు రూ.15 తేడా ఉంది. లోకేష్ యువగళం పాదయాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్రోల్ రేట్లను భారీగా పెంచేశారని ఆరోపణ చేశారు. పలమనేరుకు వచ్చినప్పుడు లోకేష్ ఈ విషయం మాట్లాడారు. పెట్రోల్ బంకు దగ్గరికి వెళ్తే చాలు ఫొటో తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు పెంచేశారని విపరీతంగా బురద జల్లారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పెట్రోల్ ఎంతో మీరే సమాధానం చెప్పండి. కానీ ఇప్పుడు పెట్రోల్ రేట్లు దేశంలోనే అత్యధిక స్దాయిలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ను అగ్రస్థానంలో నిలబెడతామని చెప్పిన మీరు.. అవినీతి, అధిక ధరల్లో మాత్రం నిలబెట్టారు. వంటనూనెలు సైతం మేం అధికారంలో ఉన్నప్పుడు కేజీ 110 రూపాయలు ఉంటే ఇప్పుడు 190 రూపాయలకు చేరింది. ధరల నియంత్రణలో ఎందుకు చేతులెత్తేస్తున్నారో చెప్పాలి. జగన్ పై ఇంత నిస్సిగ్గుగా విమర్శలు చేస్తారా ? పెట్రోల్, డీజిల్ రేట్లు మండిపోతుంటే వ్యవసాయ ఉత్పత్తుల ధరలు మాత్రం పడిపోయాయి. అక్వా మేత ధరలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తెచ్చిన అప్సెడాకు కూడా తెలియకుండా ఎలా పెరిగాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఉత్పత్తి వచ్చినప్పుడు ధరలు ఎందుకు పడిపోతున్నాయి, మేత ధరలు ఎందుకు పెరిగాయో చెప్పాలి. వీటన్నింటి నుంచి డైవర్ట్ చేసేందుకే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారిపై విమర్శలకు దిగుతున్నారు. మేం మాత్రం డైవర్ట్ అయ్యే ప్రశ్నే లేదు. కరెంటు ఛార్జీలు సహా అన్ని రేట్లూ పెంచేశారు. రేట్లు పెరిగిన విషయం జనానికి తెలుసు. 17 మెడికల్ కాలేజీలకు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుడితే వాటిని ప్రైవేటుకు అప్పగించాలనుకోవడం వెన్నుపోటు కాక మరేమిటి ? చంద్రబాబు చెప్పేందుకే నీతులు ఉంటాయి. మనమంతా సైకిళ్ల మీద తిరిగితే ఆయన మాత్రం ప్రైవేటు జెట్లలో తిరుగుతారు. సింగపూర్ కు లోకేష్ వెళ్లిన్పపుడు మూడు రోజుల ఖర్చు 92 లక్షలు. కాబట్టి వైయస్ఆర్‌సీపీని విమర్శించే హక్కు మీకు లేదు. జగన్మోహన్ రెడ్డి సర్వే చేస్తే ఆస్తులు లాక్కోవడానికి అని విమర్శలు చేశారు. ఇప్పుడు కూటమి సర్కార్ చేస్తే ఆస్తుల పరిరక్షణకు అంటున్నారు. ఇంత నిస్సిగ్గుగా ఎలా మాట్లాడతారో అర్దం కావట్లేదు.