పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు వైయ‌స్ఆర్‌సీపీ పిలుపు

వైయ‌స్ఆర్‌సీపీ కీలక నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్‌

తాడేప‌ల్లి: పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యకులు, పార్లమెంటు పరిశీలకులు, ఎమ్మెల్యే / సమన్వయకర్తలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు (కో-ఆర్డినేషన్), రాష్ట్ర కార్యదర్శులు (కో-ఆర్డినేషన్), అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులతో పార్టీ స్టేట్‌ కోఆర్డినేటర్‌ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు

ఈ సందర్భంగా శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచడం తీవ్ర ఆందోళనకర విషయమన్నారు. ఎన్నికల ముందు టీడీపీ అధికారంలోకి వస్తే పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిస్తామని తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చినప్పటికీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. ప్రస్తుతం దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లోనే అధిక ధరలకు పెట్రోలు, డీజిల్ విక్రయించడం జరుగుతోందన్నారు.

ఇప్పటికే అధిక ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో తగ్గించడం బదులు మరింతగా ధరలు పెంచడం ద్వారా సామాన్య ప్రజలపై ప్రభుత్వం భారీ భారం మోపుతోందన్నారు. పెట్రోలు, డీజిల్ ధరల పెంపు ప్రభావం రైతాంగం, రవాణా రంగం, చిన్న వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్రంగా పడుతోందని పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి ప్రజల జీవన వ్యయం మరింత భారమవుతోందన్నారు.

పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌ గారి ఆదేశాల మేరకు పెట్రోలు, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ 18.05.2026 సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించిందన్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు / సమన్వయకర్తల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టి, అనంతరం జిల్లా కలెక్టర్‌, ఆర్డీఓ, ఎంఆర్ఓలకు వినతిపత్రాలు అందజేయాలని సూచించారు.

గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ టీడీపీ‌ అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్‌, డీజిల్ ధరలను నియంత్రిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు వారు ఇచ్చిన అదే హామీని అమలు చేయాలని ప్రజల తరఫున డిమాండ్‌ చేస్తున్నామన్నారు.

రేపు నిర్వహించే నిరసన కార్యక్రమాలను అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో విజయవంతం చేయాలని, వినూత్నంగా చేపట్టాలని పార్టీ నాయకులకు సూచించారు. పార్టీతో కలిసి వచ్చే రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, అనుబంధ సంఘాలను కూడా కలుపుకుని భారీ ప్రదర్శనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

ఎస్‌ఐఆర్‌ (స్పెషల్ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో పార్టీ యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బూత్‌ను ఒక యూనిట్‌గా తీసుకుని మైక్రో లెవల్‌లో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని, ప్రతి బూత్‌లో సమర్థవంతమైన బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్‌ఏలు) నియామకం అత్యంత కీలకమని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా బీఎల్‌ఏల నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. బీఎల్‌ఏలకు అవసరమైన ఓరియెంటేషన్‌, శిక్షణ కార్యక్రమాల కోసం పార్టీ కేంద్ర కార్యాలయం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసిందని తెలిపారు. ఎన్నికల జాబితాల సవరణ ప్రక్రియలో ప్రతి ఓటు విలువైనదని, ఎక్కడా నిర్లక్ష్యం చోటు చేసుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.

పార్టీ కమిటీల నియామకం, ఐడీ కార్డుల వెరిఫికేషన్‌, డిజిటలైజేషన్‌ ప్రక్రియలను వచ్చే రెండు వారాల్లో తప్పనిసరిగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి జాప్యం ఉండకూడదన్నారు. వైయస్‌ జగన్‌ గారు స్వయంగా ఈ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. వెరిఫికేషన్‌ ప్రక్రియలో వెనుకబడి ఉన్న జోన్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

వైఎస్సార్సీపీ చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల్లోకి మరింత విస్తృతంగా వెళ్లేలా జిల్లా, నియోజకవర్గ స్థాయిలో మీడియా క్యాంపెయిన్‌, సోషల్ మీడియా ప్రచారాన్ని మరింత బలోపేతం చేయాలని నాయకులకు సూచించారు. ప్రజా సమస్యలపై పార్టీ పోరాటాలు, నాయకత్వం చేపడుతున్న కార్యక్రమాలు సమర్థవంతంగా ప్రజలకు చేరేలా ప్రతి నాయకుడు బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

Back to Top