నెల్లూరు జిల్లా: జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుని ఆరు దశాబ్దాల పాటు క్రియాశీలకంగా సేవలందించిన సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి తండ్రి, దివంగత నాయకుడు కాకాణి రమణారెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజితతో పాటు పార్టీ నాయకులు కాకాణి రమణారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో విశిష్ట స్థానం సంపాదించుకున్న కాకాణి రమణారెడ్డి, ఆనం కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కొనసాగించడమే కాకుండా ఏసీ సుబ్బారెడ్డి ప్రియశిష్యుడిగా, పుత్రసమానుడిగా గుర్తింపు పొందారు. ఆయన విలువలకు కట్టుబడి హుందాతనంతో రాజకీయాలు నిర్వహించారని నాయకులు స్మరించుకున్నారు. 1953లో కేవలం 22 ఏళ్ల వయస్సులోనే తోడేరు పంచాయతీ సర్పంచ్‌గా ఎన్నికై రాజకీయాల్లో అడుగుపెట్టిన రమణారెడ్డి, ఎలాంటి అండదండలు లేకుండా స్వయంకృషితో ఎదిగి జిల్లా రాజకీయాల్లో కీలక నాయకుడిగా నిలిచారు. అనంతరం 1959లో పొదలకూరు సమితి అధ్యక్షుడిగా ఎన్నికై 1977 వరకు ఏకధాటిగా 18 సంవత్సరాలు కొనసాగి చరిత్ర సృష్టించారు. సమితి అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో వందలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించి వారి కుటుంబాలకు అండగా నిలిచారని నేతలు గుర్తుచేశారు. సేవా కార్యక్రమాలు, ప్రజల పట్ల మమకారం, నిబద్ధత ఆయనను ప్రజానాయకుడిగా నిలబెట్టాయని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన ల్యాండ్ సీలింగ్ పథకంలో భాగంగా తన సొంతంగా ఉన్న 50 ఎకరాల మెట్ట భూమి, 10 ఎకరాల మాగాణి భూమిని ప్రభుత్వానికి అప్పగించి ఆదర్శంగా నిలిచారని తెలిపారు. చిన్ననాటి నుంచే అభ్యుదయ భావాలతో పేదలను అక్కున చేర్చుకోవడంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారని స్మరించుకున్నారు.