తాడేపల్లి: ప్రభుత్వ వైఫల్యాలను వరుసగా ఎండగడుతూ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రెస్ మీట్ నిర్వహిస్తే వాటికి సమాధానం చెప్పుకునే ధైర్యం లేక జగన్ బీసీలను అవమానించాడంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని వైయస్ఆర్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. తణుకులోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మాటల సందర్భంలో ఒక వ్యక్తిని ఉద్దేశిస్తూ అనేవాడు అన్న మాటను పట్టుకుని యాదవులను అవమానించడానికి ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ, రజకులను, నాయీ బ్రాహ్మణులను ఉద్దేశించి తోకలు కత్తిరిస్తా, తోలు తీస్తా అన్న చంద్రబాబు మాటలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. వైయస్ జగన్ గారు సీఎంగా ఉండగా ముఖ్యమంత్రి అనే గౌరవం కూడా లేకుండా సైకో, బోష**, చంపేస్తా, నరికేస్తా అని చంద్రబాబు, లోకేష్, బుచ్చయ్య చౌదరి మాట్లాడిన మాటలు కనిపించలేదా అని దుయ్యబట్టారు. వ్యక్తులను గౌరవించడం వైయస్ జగన్ నుంచే నేర్చుకోవాలని హితవు పలికారు. యాదవులను రాజకీయంగా వాడుకుని వదిలేయడం చంద్రబాబుకి అలవాటని, వైయస్ జగన్ సీఎం అయ్యాక యాదవులకు రాజకీయంగా గుర్తింపు దక్కిందని చెప్పారు. విశాఖ, తిరుపతిలో యాదవ కులానికి చెందిన మహిళలను మేయర్లుగా నియమిస్తే.. కూటమి ప్రభుత్వం వచ్చాక అత్యంత అవమానకర రీతిలో తొలగించిందని గుర్తుచేశారు. ఇది యాదవులకు ద్రోహం చేయడం కాదా అని నిలదీశారు. చంద్రబాబు తన జీవిత కాలంలో ఏ ఒక్క బీసీకి రాజ్యసభ సభ్యునిగా అవకాశం కల్పించలేదని.. వైయస్ తొలిసారి ఏపీ చరిత్రలో నలుగురు బీసీలను రాజ్యసభకు పంపి బీసీలకు పెద్దపీట వేశారని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా యాదవ కులానికి చెందిన ఇద్దరికి, రాయలసీమలో రమేశ్‌యాదవ్‌కి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వివరించారు. అలాంటి వ్యక్తిని బీసీ వ్యతిరేకగా ముద్ర వేయాలని చూస్తే ఎవరూ పట్టించుకోరని స్పష్టం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ● సమాధానం చెప్పుకోలేక డైవర్షన్ పాలిటిక్స్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారు ఇటీవల నిర్వహించిన ప్రెస్‌మీట్ లో రాష్ట్రంలో కూటమి పాలన ప్రతి పౌరుడూ సేవ్ ఏపీ అని బాధపడేలా ఉందని చెబుతూ అందుకు కారణాలైన అవినీతి, భూదోపిడీ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, నకిలీ లిక్కర్ కుంభకోణం, తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం, పరకామణి కేసు, రెడ్ బుక్ రాజ్యాంగంతో వైయస్ఆర్‌సీపీ నాయకులపై నమోదవుతున్న అక్రమ కేసులు, పంటలకు మద్ధతు ధర.. ఇలా ఎన్నో అంశాలను ప్రస్తావించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఆధారాలతో సహా ఎత్తి చూపితే వాటికి సమాధానం చెప్పుకోలేక గోపీనాథ్ జెట్టి ని వాడు అని అవమానించాంటూ కొంతమంది టీడీపీ నాయకులు, తెలుగుదేశం సోషల్ మీడియాలో పనికట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వైయస్ఆర్‌సీపీ బీసీలకు వ్యతిరేకం అని దుష్ప్రచారం చేస్తున్నారు. వైయస్ జగన్ మాటలను వక్రీకరిస్తున్న టీడీపీ, ఆ పార్టీ సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. జగన్ తల తీసేస్తే తప్పేంటి అని మాట్లాడినప్పుడు ఆయన్ను మందలించారా? చంద్రబాబు గతంలో జగన్‌ని చంపేస్తే ఎవరడుగుతారు? అని మాట్లాడలేదా? సీఎంగా ఉన్నప్పుడు జగన్‌ని ఉద్దేశించి సైకో అని తిట్టలేదా? పట్టాభితో బోష** అని తిట్టించలేదా? 40 ఏళ్ల రాజకీయ అనుభవం.. దేశంలోనే సీనియర్ పొలిటీషియన్‌ని అని చెప్పుకునే చంద్రబాబు మాట్లాడే భాష ఇదేనా? నాయీ బ్రాహ్మణులకు తోకలు కత్తిరిస్తా, రజకులకు తోలు తీస్తా.. అని చంద్రబాబు మాట్లాడటం బీసీలను అవమానించడం కాదా? ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని చంద్రబాబు అన్న మాటలకన్నా.. గోపీనాథ్ జెట్టి అనేవాడు అనడం పెద్ద తప్పా..? అని నేరుగా అడుగుతున్నా. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు బాధ్యతగా ప్రవర్తించాల్సిన చంద్రబాబు ఆధారాలు లేకపోయినా తిరుమల లడ్డూ తయారీలో ఆవు కొవ్వు, పంది కొవ్వు కలిసిందని తీవ్రమైన ఆరోపణలు చేశాడు. ఏడాదిన్నర గడిచినా దానికి ఆధారాలు చూపించలేకపోయారు. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో బోలేబాబా డెయిరీ పేరుతో వైయస్ఆర్‌సీపీని ఇరికించబోయి చంద్రబాబు పూర్తిగా ఇరుక్కుపోయాడు. జూన్‌లో వెనక్కి పంపిన 4 నెయ్యి ట్యాంకర్లను ఆగస్టులో ఎలా వాడారని వైయస్ జగన్ గారు ప్రెస్‌మీట్ ద్వారా ఆధారాలతో ప్రశ్నిస్తే సమాధానం చెప్పుకోలేక అర్థం పర్థం లేని వ్యాఖ్యలతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. కూటమికి చెందిన 164 మందికి ఎమ్మెల్యేల్లో ఎవరికైనా చేతనైతే వైయస్ జగన్ గారు సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. పరకామణి వ్యవహారం రాజీ చేసుకోవడం తప్పని వాదిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆ పార్టీకే చెందిన ఎమ్మెల్యే అహోబిలం ఆలయంలో రూ. 27 లక్షలకు సెటిల్మెంట్ చేసుకుంటే నోరు మెదపరే. యాదవ సామాజికవర్గానికి చెందిన నన్ను అల్లరిపాలు చేసేందుకు టీడీఆర్ బాండ్లలో అవినీతికి పాల్పడ్డానని టీడీపీ ఎమ్మెల్యేతో హైకోర్టులో నాపై చంద్రబాబు కేసు వేయించాడు. మొత్తం రూ. 70 కోట్లు విలువ చేసే 25 ఎకరాల భూమి విషయంలో నేను రూ. 360 కోట్లు అవినీతికి పాల్పడ్డానని టీడీపీ ఆఫీసులో పట్టాభితో ప్రెస్‌మీట్ పెట్టించి తీవ్రమైన ఆరోపణలు చేయించారు. ఆ తర్వాత తణుకు టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో రూ. 691 కోట్ల అవినీతి జరిగినట్టు ఏసీబీ గుర్తించిందని ఎల్లో మీడియాలో ఊదరకొట్టారు. తణుకు పర్యటనకు వచ్చినప్పుడు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు రూ. 800 కోట్లు కుంభకోణం జరిగిందని నాపై బురదజల్లి వెళ్లిపోయారు. చివరికి అదంతా పచ్చి అబద్ధమని కూటమి ప్రభుత్వంలోనే మున్సిపల్ కమిషనర్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాడు. అందులో ఎలాంటి అవినీతి జరగలేదని హైకోర్టు కూడా కేసును కొట్టివేసింది. టీడీపీ చేసినవన్నీ తప్పుడు ఆరోపణలని రుజువు కావడంతో ఇప్పుడు యూట్యూబ్‌లో వీడియోలన్నీ డిలీట్ చేశారు. యాదవ సామాజికవర్గానికి చెందిన నాపై ప్రభుత్వ పెద్దలంతా కలిసి ఇన్ని విధాలుగా వేధింపులకు పాల్పడితే తప్పు కాదా? ఏమీ జరగకపోయినా తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసి నా వ్యక్తిత్వ హననం చేసేలా తప్పుడు ప్రచారం చేయడం దుర్మార్గం కాదా? దీనికి చంద్రబాబు, టీడీపీ నాయకులు ఏం సమాధానం చెబుతారు? ఇన్ని విధాలుగా నాపై బురదజల్లినా వైయస్ జగన్ గారు నాకు మంత్రిగా అవకాశం కల్పించారు. ఇది యాదవులకు ఆయన ఇచ్చే గౌరవం. ● వైయస్ జగన్ పాలనలోనే యాదవులకు మేలు యాదవులకు మేలు జరిగింది వైయస్ జగన్ గారి ఐదేళ్ల పాలనలోనే. తిరుమలలో ఆలయ తలుపులు తెరిచే యాదవుల వంశపారంపర్య హక్కును చంద్రబాబు తొలగిస్తే వైయస్ జగన్ సీఎం అయ్యాక మళ్లీ పునరుద్ధరించారు. గొళ్ల మండపాన్ని తొలగించాలని గత టీడీపీ హయాంలో నిర్ణయం తీసుకుంటే వైయస్ జగన్ గారు ఆపేయించారు. వీటికి ప్రస్తుతం మంత్రిగా ఉన్న పార్ధసారథి సాక్ష్యం. అవునో కాదో ఆయనే చెప్పాలి. అంతేకాదు శ్రీకాకుళం, విశాఖ చరిత్రలో యాదవులకు ఎప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చింది లేదు. వైయస్ జగన్ వచ్చాకనే ఇచ్చారు. యాదవ సామాజికవర్గానికి చెందిన మహిళ హరి వెంకట కుమారిని విశాఖ మేయర్‌ను చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక అత్యంత అవమానకరంగా దింపేశారు. యాదవ సామాజిక వర్గానికే చెందిన మరో మహిళ డాక్టర్ శిరీషను తిరుపతి మేయర్ ని చేసింది కూడా జగనే. ఆమెను కూడా అవమానకరంగా పదవి నుంచి దింపేశారు. ఇదంతా తెలుగుదేశం పార్టీ యాదవులకు చేసిన అన్యాయం కాదా? యనమల రామకృష్ణుడు యాదవ్ కారణంగా ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు.. ఇప్పుడు ఆయనకి అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు. చంద్రబాబు ఇన్నేళ్లలో ఏ ఒక్క బీసీకి రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇవ్వలేదు. వైయస్ఆర్‌సీపీ హయాంలోనే ఆర్ కృష్ణయ్య, బీదా మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ వంటి వారు రాజ్యసభకి ప్రాతినిథ్యం వహించారు. రాయలసీమలో రమేశ్ యాదవ్‌కి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు.