అనంతపురం జిల్లా : బోయ కులస్తులను వెంటనే ఎస్టీ జాబితాలో చేర్చాలని వైయస్ఆర్‌సీపీ ఆలూరు ఎమ్మెల్యే బూనేసి విరూపాక్షి డిమాండ్ చేశారు. గుంతకల్లు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో 36 గంటలపాటు నిర్వహిస్తున్న దీక్షలో ఆయన పాల్గొని సంఘీభావం తెలిపారు. వాల్మీకి సంఘం నాయకులు నిర్వహిస్తున్న ఈ దీక్షలో జిల్లా వాల్మీకి సంఘం అధ్యక్షుడు బోయ సుంకప్ప ప్రధానంగా పాల్గొంటున్నారు. వాల్మీకుల ఎస్టీ సాధన పునరుద్ధరణ కోసం చేపట్టిన ఈ దీక్షకు పెద్ద సంఖ్యలో వాల్మీకి సంఘం నాయకులు, సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మాట్లాడుతూ రాష్ట్రంలో వాల్మీకి కులస్తులు చాలా వెనుకబడిన పరిస్థితుల్లో ఉన్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు బోయ కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చుతామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాయలసీమ ప్రాంతంలో మాత్రమే బోయ కులస్తులు ఎస్టీ జాబితాలో లేరని, ఇతర ప్రాంతాల్లో మాత్రం ఎస్టీ జాబితాలో ఉన్నారని పేర్కొన్నారు. రాయలసీమకు చెందిన బోయ కులస్తుల ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కలిసి పోరాటం చేస్తే ఈ డిమాండ్ సాధ్యమవుతుందని ఆయన అన్నారు.బోయ కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చే వరకు పోరాటం కొనసాగాలని, తాను కూడా ఇలాంటి ఉద్యమాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని “జై వాల్మీకి.. జై జై వాల్మీకి” నినాదాలతో తమ నిరసన వ్యక్తం చేశారు.