కూటమి పాలనలో శాంతిభద్రతలు అదుపు తప్పాయి

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి 

నెల్లూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని వైయ‌స్ఆర్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. జిల్లాలో మైనర్ బాలికలపై అఘాయిత్యాలు పరిపాటిగా మారాయని, గంజాయి మత్తులో కొందరు ఈ దారుణాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గుమ్మళదిబ్బ ఘటన అనంతరం వరిగొండలో మరో మైనర్ బాలికపై అఘాయిత్యం జరగడం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెబుతోందన్నారు. ఇలాంటి సంఘటనలు జరిగిన తర్వాత వాటిని బయటకు రానీయకుండా దాచిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం ఏ మాత్రం బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని, ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం తప్ప పోలీసులు తమ బాధ్యతలను విస్మరిస్తున్నారని మండిపడ్డారు.

ప్రభుత్వ అసమర్థత బయటపడుతుందనే భయంతో అఘాయిత్యానికి గురైన బాలికను దాచిపెట్టారని కాకాణి ఆరోపించారు. సంఘటన జరిగిన తర్వాత సంబంధిత సీఐ రవి నాయక్‌తో పాటు ఎస్‌ఐలను సస్పెండ్ చేసినప్పటికీ, కొంతకాలం తర్వాత వారికి మళ్లీ మంచి పోస్టింగులు ఇస్తారని విమర్శించారు.  నెల్లూరు మాజీ ఎస్పీ కృష్ణకాంత్ కారణంగా జిల్లాలో పరిస్థితులు భ్రష్టు పట్టాయని ఆయన వ్యాఖ్యానించారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం తాను పది ఎకరాలు పోగొట్టుకున్నానని కథలు చెబుతున్నారని, కానీ వాస్తవానికి సోమిరెడ్డి మంత్రిగా ఉన్న‌ప్పుడు ఎన్ని ఎకరాలు దోచేశాడో అందరికీ  తెలుసునని కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. 

Back to Top