హంద్రీనీవా పనుల్లో భారీ అవినీతి

మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆగ్ర‌హం

అనంతపురం జిల్లా: హంద్రీనీవా ప్రాజెక్ట్ లైనింగ్ పనులపై రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ పనుల్లో దాదాపు వెయ్యి కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని ఆయన విమర్శించారు.
ప్రధానంగా చంద్ర‌బాబు స్వార్థ ప్రయోజనాల కోసం అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల ప్రజల అవసరాలను తాకట్టు పెట్టారని ఆయన ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. హడావిడిగా చేపట్టిన హంద్రీనీవా కాలువల లైనింగ్ పనుల ద్వారా భారీ స్థాయిలో అవినీతి జరిగిందని, ప్రజల డబ్బులు వృథా అయ్యాయని పేర్కొన్నారు.

ఈ నిర్వాకం కారణంగా ప్రత్యేకంగా శ్రీ సత్యసాయి జిల్లాలో అనేక ప్రాంతాలు సాగు, తాగునీటి సమస్యలను ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ప్రాజెక్ట్ లక్ష్యాలు నెరవేరకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పేరూరు డ్యాం కు నీరు అందకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపిస్తూ, టీడీపీ నేతలు పరిటాల సునీత, అమిలినేని సురేంద్ర బాబు పై కూడా విమర్శలు గుప్పించారు. వారి చర్యల వల్ల స్థానిక రైతులు నష్టపోతున్నారని అన్నారు. హంద్రీనీవా ప్రాజెక్ట్ పనుల్లో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు.
 

Back to Top