అనకాపల్లి జిల్లా: అనకాపల్లి మండలం తగరంపూడి గ్రామంలో ఇటీవల జరిగిన మాజీ మంత్రి, కాపు నాయకుడు కీర్తిశేషులు గుడివాడ గురునాథ రావు విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో వైయస్ఆర్‌సీపీ నేతలు సంఘటనా స్థలాన్ని సందర్శించి విగ్రహాన్ని పరిశీలించారు. అనకాపల్లి నియోజకవర్గం వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త మాలసాల భరత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పర్యటనలో, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, రీజినల్ కో-ఆర్డినేటర్ బూడి ముత్యాల నాయుడు, కరణం ధర్మశ్రీ, అన్నంరెడ్డి అదీప్ రాజు, కంబాల జోగులు, జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డెడ ప్రసాద్ తదితర నేతలు పాల్గొన్నారు. జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల, టౌన్ అధ్యక్షులు మరియు గుడివాడ గురునాథరావు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, గుడివాడ గురునాథరావు విగ్రహాన్ని ధ్వంసం చేయడం అమానుషమైన చర్యగా ఖండించారు. ఈ ఘటనకు పాల్పడిన దుండగులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను కోరారు. అలాగే కూటమి ప్రభుత్వం అండదండలతో స్థానికంగా కొందరు నాయకులు దోషులను కాపాడుతున్నారని ఆరోపిస్తూ, నిజాయితీగా విచారణ జరిపి నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా స్పందన వెల్లువెత్తే అవకాశం ఉందని వైయస్ఆర్‌సీపీ నేతలు పేర్కొన్నారు.