అనంతపురం: జిల్లాలోని పేద ప్రజలకు ఆశాజ్యోతి అయిన ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్ఏ రెన్యూవల్ సాధనలో మాజీ ఎంపీ, వైయస్ఆర్‌సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని శింగనమల వైయస్ఆర్‌సీపీ నాయకులు అభినందించారు. అనంతపురంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో రంగయ్యను మర్యాదపూర్వకంగా కలిసి, శాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్ మాట్లాడుతూ, జిల్లాలో దశాబ్దాలుగా విద్య, వైద్యం, సామాజిక సేవా రంగాల్లో ఆర్డీటీ సంస్థ అందిస్తున్న సేవలు అమూల్యమైనవని పేర్కొన్నారు. సాంకేతిక కారణాలతో ఆగిపోయిన ఎఫ్‌సీఆర్ఏ రెన్యూవల్‌ను తిరిగి సాధించేందుకు రంగయ్య ఢిల్లీ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ పెద్దలతో నిరంతరం సంప్రదింపులు జరిపి పట్టుదలతో ప్రయత్నించారని గుర్తుచేశారు. జిల్లా అభివృద్ధి, నిరుపేద ప్రజల సంక్షేమంపై ఆయనకు ఉన్న అంకితభావానికి ఈ విజయమే నిదర్శనమని నేతలు ప్రశంసించారు. ఆర్డీటీ సంస్థకు నిధుల కొరత లేకుండా ఆయన చేసిన కృషి జిల్లా చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ అధ్యక్షులు మంత్రి ఆంజనేయులు, జిల్లా కార్యదర్శి రామాంజనేయులు, వివిధ మండలాల ఎస్సీ సెల్ అధ్యక్షులు, అనుబంధ విభాగాల నాయకులు, నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని రంగయ్యకు శుభాకాంక్షలు తెలిపారు.