విజయవాడ : అకాల వర్షాలు, ఈదురు గాలులతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు తక్షణ సాయం అందించాలని వైయస్ఆర్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు. జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు ఏలూరి శివాజీలు విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఇలక్కియాకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ నెల 18న కురిసిన అకాల వర్షాలు, బలమైన గాలులతో జగ్గయ్యపేట నియోజకవర్గంలో మొక్కజొన్న, వరి, మామిడి, బొప్పాయి, అరటి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. ముఖ్యంగా మొక్కజొన్న రైతులు భారీగా నష్టపోయారని పేర్కొన్నారు. నష్టపోయిన మొక్కజొన్న పంటకు ఎకరానికి రూ.50 వేల నష్టపరిహారం చెల్లించాలని, రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా మార్కెఫెడ్ ద్వారా మొక్కజొన్నను కనీస మద్దతు ధర రూ.2400కు కొనుగోలు చేయాలని, వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. పంట నష్టాల వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు త్వరితగతిన సేకరించి, అర్హులైన రైతులకు వెంటనే పరిహారం అందించాలని సూచించారు. వరి, మొక్కజొన్నతో పాటు మామిడి, బొప్పాయి, అరటి రైతులను గుర్తించి సహాయం చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి శివరాత్రి పృథ్వీరాజ్, జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రచార విభాగ అధ్యక్షుడు భైరబోయిన బాబు తదితరులు పాల్గొన్నారు.