‘ఉపాధి’ బకాయిలు వెంటనే చెల్లించాలి

రాష్ట్రవ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ పంచాయతీరాజ్ విభాగం ఆందోళనలు 

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి హామీ పథకం (MGNREGA) కూలీలకు నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని వైయ‌స్ఆర్‌సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సమస్యపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వద్ద వైయ‌స్ఆర్‌సీపీ పంచాయతీరాజ్ విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఉపాధి హామీ కూలీలకు పెండింగ్‌లో ఉన్న బకాయిలను తక్షణమే చెల్లించాలని, అలాగే పథకంలో జరుగుతున్న అవినీతి పై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, రాష్ట్ర పంచాయతీరాజ్ అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ వేములకొండ తిరుపతిరావు, జగ్గయ్యపేట ఇంచార్జ్ తన్నీరు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్లకార్డులతో నిరసన తెలుపుతూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం పీజీఆర్ఎస్ ద్వారా జాయింట్ కలెక్టర్ ఇలక్కియకు వినతిపత్రం అందజేశారు. 2025 డిసెంబర్ నుండి పెండింగ్‌లో ఉన్న కూలీల వేతనాలను వెంటనే విడుదల చేయాలని, జిల్లాలో ఉపాధి హామీ పథకంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని కోరారు.

రూ.1800 రెట‌క‌లే ఎక్కడికి పోయాయి?: వెన్నపూస రవీంద్రారెడ్డి  
రాష్ట్రంలో సుమారు 42 లక్షల కూలీలకు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఐదు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం వల్ల కూలీల జీవనోపాధి దెబ్బతింటోంది. మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేసిన వెంటనే రూ.1800 కోట్లు విడుదల చేసినట్లు ప్రకటించారు. అయితే ఆ నిధులు ఎక్కడికి వెళ్లాయో ప్రభుత్వం వెల్లడించాలి. సోషల్ ఆడిట్‌లో బయటపడిన అవినీతి అంశాలపై తక్షణ విచారణ జరపాలి. ఉపాధి కూలీల సమస్యలను పట్టించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని వెన్న‌పూస ర‌వీంద్రారెడ్డి హెచ్చరించారు. 

Back to Top