దశరథరామిరెడ్డిపై టీడీపీ గుండాల దాడి హేయం

పోలీసుల సమక్షంలోనే దాడి అత్యంత దారుణం

ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి «ధ్వజం

హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ  లోక్‌సభ పక్షనేత పీవీ మిథున్‌రెడ్డి.

దశరథరామిరెడ్డికి ప్రాణభయం ఉంది

రెండ్రోజుల క్రితమే సీఐ, డీఎస్పీలకు ఫిర్యాదు 

అయినా స్పందించకపోవడంతోనే ఈ దారుణం

ఈ తరహా దాడులకు పోలీసుల పరోక్ష సహకారం

ప్రెస్‌మీట్‌లో పీవీ మిథున్‌రెడ్డి తీవ్ర ఆక్షేపణ

హైదరాబాద్‌:  పోలీసుల సమక్షంలోనే వైయ‌స్ఆర్‌సీపీ నాయకుడు, రాయచోటి మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ దశరథరామిరెడ్డిపై టీడీపీ గూండాలు విచక్షణారహితంగా దాడి చేసి కాళ్లు చేతులూ విరిచేసి, తల పగుల గొట్టారని, ఇది అత్యంత హేయమని వైయస్సార్‌సీపీ లోక్‌సభ పక్షనేత పీవీ మిథున్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాయచోటిలో రెండు రోజులుగా తన ఫంక్షన్‌హాల్‌ మీద జరుగుతున్న దాడులపై సీఐ, డీఎస్పీకి ఫిర్యాదు చేసినా, వారు పట్టించుకోకపోవడం వల్లే ఈరోజు ఆయన చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడని తెలిపారు. పోలీసులు అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తూ దాడులకు పరోక్షంగా సహకరించడం హేయమని అన్నారు.
    దశరథరామిరెడ్డిపై దాడి చేసిన వారు వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తున్నా ఇప్పటికీ ఏ ఒక్కరిపైనా కేసు నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి చట్టపరంగా శిక్షించాలని హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన పీవీ మిథున్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.
ప్రెస్‌మీట్‌లో పీవీ మిథున్‌రెడ్డి ఇంకా ఏమన్నారంటే..:

పోలీసుల తీరు దారుణం:
    రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. పోలీసులు తమ బాధ్యత పూర్తిగా మర్చిపోయారు. రాష్ట్ర పోలీసులు వైయస్సార్సీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్టుల మీద పదేసి కేసులు పెట్టి రాష్ట్రమంతా తిప్పి పొలిటికల్‌ బాస్‌లను సంతృప్తి పరుస్తున్నారు. అదే సమయంలో మా పార్టీ నాయకుల మీద టీడీపీ గూండాలు పట్టపగలు బహిరంగంగా దాడులు చేసి ప్రాణాలు తీసేస్తున్నా వారికి చీమకుట్టినట్టు కూడా ఉండటం లేదు. సీఐ, డీఎస్పీ స్థాయి అధికారులే స్పందించడం లేదు. పోలీసుల సమక్షంలోనే దాడులు చేస్తున్నారంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా పతనమయ్యాయో చెప్పడానికి నిదర్శనం.
    ఇప్పటికైనా పోలీసులు తక్షణం స్పందించి దశరథరామిరెడ్డి మీద దాడులు చేసిన వారిని కేసులు నమోదు చేసి తక్షణం అరెస్టు చేయాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులదే. ఆ విధంగా అయినా తమ వ్యవస్థపై సన్నగిల్లుతున్న నమ్మకాన్ని పోలీసులు కాపాడుకోవాలి. అలా కాకుండా, ఇలాగే కక్షపూరిత రాజకీయాలను ప్రోత్సహిస్తే భవిష్యత్తులో ఇలాంటి చర్యలే ఎదుర్కోవాల్సి ఉంటుందని పీవీ మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు.

Back to Top