అక్రమ కేసులపై వైయ‌స్ఆర్‌సీపీ యువజన విభాగం ఆందోళన

అన‌కాప‌ల్లి: రాష్ట్ర వైయ‌స్ఆర్‌సీపీ పిలుపు మేరకు రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి మలసాల కుమార్ రాజా, జిల్లా అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్ ఆధ్వర్యంలో అనకాపల్లి బీమునిగుమ్మంలోని బీఆర్ అంబేద్క‌ర్‌ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. కర్నూలు జిల్లా యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు బాలుపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపిస్తూ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నాయ‌కులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం “రెడ్ బుక్ రాజ్యాంగం” పేరుతో ప్రజల తరఫున ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు నమోదు చేస్తోందని విమర్శించారు. ముఖ్యంగా యువజన విభాగం నాయకులను అణచివేయడమే ప్రభుత్వ ధ్యేయంగా పరిపాలన కొనసాగుతోందని ఆరోపించారు. ప్రజలు అన్నింటిని గమనిస్తున్నారని, రేపటి రోజున అధికారంలోకి వచ్చే ప్రభుత్వం తప్పు చేసిన నాయకులు, అధికారులను వదిలే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఇప్పటికే దీనిపై హెచ్చరించారని, అందుకు అనుగుణంగా వైయ‌స్ఆర్‌సీపీ డిజిటల్ బుక్‌లో సంబంధిత వారి పేర్లు నమోదు చేస్తున్నామని తెలిపారు. తప్పు చేసిన వారికి తప్పక శిక్ష పడుతుందని స్పష్టం చేశారు. 

ఈ కార్యక్రమంలో అనకాపల్లి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు కర్రీ రుద్రి, మాడుగుల నియోజకవర్గ అధ్యక్షుడు ఆకుల సాయి ప్రసాద్, పెందుర్తి అధ్యక్షుడు పెద్దిశెట్టి శేఖర్, జిల్లా కార్యదర్శి పెచ్చేట్టి మణిరాజు, అనకాపల్లి పట్టణ అధ్యక్షుడు వేగి త్రినాధ్‌తో పాటు పలువురు యువజన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top