పోలీసుల వేధింపులకు తాళలేక యువకుడి ఆత్మహత్యాయత్నం

కర్నూలు త్రీ టౌన్‌ పోలీసుల యథేచ్ఛ మానవ హక్కుల ఉల్లంఘన

దీనిపై తక్షణమే విచారణ జరిపించండి

ఎన్‌హెచ్‌ఆర్‌సీకి వైయస్ఆర్‌సీపీ ఎంపీ ఎం.గురుమూర్తి లేఖ

తిరుపతి: కర్నూలు త్రీ టౌన్‌ పోలీసుల దారుణ వేధింపులు తాళలేక బాలు అనే యువకుడు ఆత్మహత్యా యత్నం చేశారని, ఈ ఘటనపై తక్షణమే జోక్యం చేసుకుని స్వతంత్య్ర విచారణ జరిపించాలని వైయస్ఆర్‌సీపీ ఎంపీ ఎం.గురుమూర్తి, జాతీయ మానవ హక్కుల సంఘాన్ని (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) కోరారు. ఈ మేరకు ఎన్‌హెచ్‌ఆర్‌సీకి లేఖ రాసిన ఎంపీ గురుమూర్తి, రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘణ యథేచ్ఛగా సాగుతోందని వెల్లడించారు.

ఎన్‌హెచ్‌ఆర్‌సీకి రాసిన లేఖలో ఎంపీ గురుమూర్తి ఇంకా ఏం ప్రస్తావించారంటే..
    బాలు ఏ నేరం చేయకపోయినా, ఆయనపై ఎలాంటి కేసు నమోదు కాకపోయినా, ఒక కేసులో విచారణ అంటూ ఆయన్ను పదే పదే స్టేషన్‌కు పిలిపించిన కర్నూలు త్రీ టౌన్‌ పోలీసులు దారుణంగా వేధించారు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన బాలు, చేయి కోసుకుని ఆత్మహత్యా యత్నం చేశాడు. అధికార పక్షానికి చెందిన కొందరు నాయకుల ఒత్తిడితోనే పోలీసులు ఆ విధంగా చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. తాను ఎలాంటి తప్పు చేయకపోయినా అక్రమంగా మద్యం, మాదకద్రవ్యాల కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితుడు బాలు తెలిపారు. తన నిర్దోషిత్వం గురించి, ఎంత చెప్పినా పట్టించుకోని పోలీసులు, ఆయన్ను మానసికంగానే కాకుండా, శారీరకంగా కూడా వేధించడంతో, అవమాన భారం తట్టుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
    కర్నూలు త్రీ టౌన్‌ పోలీసుల తీరు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, 21 కింద కల్పించిన సమానత్వ హక్కు, జీవన హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ, గౌరవప్రదమైన జీవన హక్కులకు పూర్తి విరుద్ధంగా ఉంది. అలాగే, మానవ హక్కుల పరిరక్షణ చట్టం–1993లోని సెక్షన్‌ 12(ఎ), 12(సి), 12(జె) ప్రకారం కూడా ఉల్లంఘనే. కాబట్టి దీనిపై విచారించే హక్కు ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఉంది. 
    అందువల్ల కర్నూలు త్రీటౌన్‌ పోలీసుల చర్యలపై స్వతంత్ర, నిష్పక్షపాత విచారణకు ఆదేశాలు ఇవ్వాలని, జిల్లా పోలీసు అధికారుల నుంచి సమగ్ర నివేదిక కోరాలని, బాధితుడు బాలుతో పాటు, అతడి కుటుంబానికి రక్షణ కల్పించాల వైయస్ఆర్‌సీపీ ఎంపీ గురుమూర్తి ఆ లేఖలో ఎన్‌హెచ్‌ఆర్‌సీకి విజ్ఞప్తి చేశారు. అలాగే, చట్ట విరుద్ధంగా వ్యవహరించి, అధికార దుర్వినియోగానికి పాల్పడిన అధికారులపై శాఖాపరంగా తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఎంపీ గురుమూర్తి కోరారు. 

Back to Top