చంద్రబాబు రెండేళ్ల రాక్షస పాలన

జూన్‌ 4 నుంచి 12 వరకు నిరసన కార్యాచరణ

 వైయస్‌ జగన్‌ ప్రకటన

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో శ్రీ వైయస్‌ జగన్‌ సమావేశం.
పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల కోఆర్డినేటర్లు హాజరు.

చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై నిరసన కార్యాచరణ. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌–సర్‌) కార్యక్రమంపై చర్చ.

చంద్రబాబు రెండేళ్ల రాక్షస పాలనపై బుక్‌లెట్‌

‘వెన్నుపోటుకు రెండేళ్లు’ బుక్‌ విడుదల చేసిన శ్రీ వైయస్‌ జగన్‌

చంద్రబాబు కుట్రలను థీటుగా ఎదుర్కొని స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదాం

శ్రీ వైయస్‌ జగన్‌ పిలుపు

ఎస్‌ఐఆర్‌ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి

టీడీపీ బోగస్‌ ఓట్ల మీద కూడా ప్రత్యేక శ్రద్ద పెట్టాలి

పార్టీ శ్రేణులకు శ్రీ వైయస్‌ జగన్‌ దిశా నిర్దేశం

తాడేపల్లి: ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీ నిలబెట్టుకోకుండా అన్ని వర్గాలను దారుణంగా మోసం చేసిన చంద్రబాబు రెండేళ్ల రాక్షస పాలనపై జూన్‌ 4 నుంచి 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల, నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఆ నిరసన కార్యాచరణకు సంబంధించి, చంద్రబాబు చేసిన మోసం, దగా, ఆయన వెన్నుపోటుకు సంబంధించి ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో బుక్‌ రిలీజ్‌ చేసిన శ్రీ వైయస్‌ జగన్, అది గ్రామగ్రామానా, ఇంటింటికీ చేరేలా చూడాలని నిర్దేశించారు. ఇంకా ప్రతి ఒక్క కార్యకర్త వద్ద ఆ బుక్‌ ఉండాలని, అది డిజిటల్‌ రూపంలో కూడా అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు. 
    త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా, దౌర్జన్యాలు చేసినా, అన్నీ థీటుగా ఎదుర్కొని పార్టీని గెలిపించేందుకు ప్రతి ఒక్క నాయకుడు కృషి చేయాలని శ్రీ వైయస్‌ జగన్‌ ఆదేశించారు. పార్టీ కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్న వారిని ఇప్పటి నుంచే గుర్తించాలని, వారిని అభ్యర్థులుగా ప్రకటించి, ప్రతి అడుగులో వారికి తోడుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థి తమకు అండగా నిల్చారన్న భావన స్థానిక ఎన్నికల్లో పార్టీ నుంచి పోటీ చేసే ప్రతి ఒక్కరూ భావించేలా చొరవ చూపాలని నిర్దేశించారు. అప్పుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వారంతా ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపు కోసం పని చేస్తారని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో ఎక్కడా ఏకగ్రీవానికి అవకాశం ఇవ్వొద్దని, ఒకవేళ అలా జరిగితే, అది అక్కడి ఇన్‌ఛార్జ్‌ వైఫల్యంగా భావిస్తామని స్పష్టం చేశారు.
    ఇంకా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) గురించి మాట్లాడుతూ, ఈ కార్యక్రమంపై చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని శ్రీ వైయస్‌ జగన్‌ వెల్లడించారు. ఇటీవల ఎన్నికలు జరిగిన పశ్చిమ బెంగాల్, తమిళనాడును ప్రస్తావిస్తూ, ఆయా రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ‘సర్‌’ ఎలాంటి ప్రభావం చూపిందన్న విషయాన్ని గణాంకాలతో సహా వివరించారు. 
వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌ సమావేశమయ్యారు. 
పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల కోఆర్డినేటర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు.
    చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై నిరసన కార్యాచరణ. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌–సర్‌) కార్యక్రమంపై మాట్లాడిన శ్రీ వైయస్‌ జగన్, పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.
పార్టీ ముఖ్య నేతల సమావేశంలో శ్రీ వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే..:

ఇదీ సమావేశం ముఖ్య ఉద్దేశం:
    చంద్రబాబుగారి రెండేళ్ల రాక్షస పాలన çపూర్తి చేసుకుంటున్న సమయంలో ప్రభుత్వ వైఫల్యాలు, అమలు కాని హామీలు గుర్తు చేస్తూ నిరసన కార్యాచరణ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ సన్నద్ధతతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ ఆఫ్‌ ఎలక్ట్రోరల్‌ రోల్స్‌–సర్‌)కు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఈ మూడు అంశాలపై  అందరితో షేర్‌ చేసుకునేందుకే ఈ సమావేశం.

చంద్రబాబు రెండేళ్ల రాక్షస పాలన
‘ముసలి పులి. బంగారు కడియం’ కథ: 

    రెండేళ్ల చంద్రబాబుగారి పాలన గురించి బహుశా నాకన్నా కూడా ఏ కార్యకర్తకు మైక్‌ ఇచ్చినా చక్కగా చెబుతాడు. చంద్రబాబునాయుడు పాలన ఈ రెండేళ్లలో ఎలా ఉంది అని చూసిన తర్వాత.. ‘బాబు ష్యూరిటీ. మోసం గ్యారెంటీ’ అని మాత్రం రుజువైంది. 
    ఈరోజు చంద్రబాబునాయుడుగారి 2 సంవత్సరాల మోసపూరిత పాలన చూసిన తర్వాత.. కనిపించేవి ఆయనగారి వెన్నుపోటు, విధ్వంసం, అరాచకం, అబద్ధాలు, డైవర్షన్‌ పాలిటిక్స్, దోపిడీ, అవినీతి. ఇదే ఈ రెండేళ్ల చంద్రబాబునాయుడు పరిపాలన.
    ఇంతకు ముందు ఎన్నికలప్పుడు కథ కూడా చెప్పా. ‘ఒక ముసలి పులి. బంగారు కడియం’ కథ. చంద్రబాబునాయుడుకు ఓటు వేయడం అంటే ఇదే అని. కరెక్టుగా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు అదే రుజువు అవుతున్న పరిస్థితులు కూడా మన కళ్ల ఎదుటే చూశాం. ఆ రోజుల్లో చంద్రబాబు నోట్లో నుంచి వచ్చిన మాటలన్నీ కూడా జగన్‌ ఇచ్చేవే కాదు.. అంతకన్నా ఎక్కువ ఇస్తాను అని చెప్పి.. ఆరోజు చంద్రబాబునాయుడు పులి, బంగారు కడియం కథ మాదిరిగానే ప్రజలందరినీ నమ్మించిన పరిస్థితి. తీరా ఓటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని పులి తిన్నట్టుగానే తినేస్తున్నాడు. ఆ కథలో ముసలి పులి ఏ మాదిరిగా చేస్తోందో చంద్రబాబునాయుడును చూసినా ఈరోజు అదే కనిపిస్తుంది. 

మ్యానిఫెస్టో చెత్తబుట్టలో వేసిన చంద్రబాబు:
    ఇక చంద్రబాబునాయుడుగారు ఎన్నికలప్పుడు సూపర్‌ సిక్స్‌ అన్నాడు. సూపర్‌ సెవెన్‌ అన్నాడు. మేనిఫెస్టో కాపీ అన్నాడు. 143 హామీలు. అవన్నీ మేనిఫెస్టోలో పెట్టి చివరికి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన పరిస్థితులు ఈరోజు మనమంతా చూస్తున్నాం. రెండేళ్లు అయిపోయింది. మూడో బడ్జెట్‌ కూడా ప్రవేశపెట్టారు. ఈరోజుటుకి కూడా సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్లలో భాగంగా ఆడబిడ్డ నిధి ఏమైంది? 18 ఏళ్ల వయసు నిండిన ప్రతి ఒక్క చెల్లెమ్మకూ ప్రతి నెలా రూ.1500 చొప్పున సంవత్సరానికి రూ.18 వేలు ఇస్తా అన్నావు కదా? రెండేళ్లు అయిపోయింది. మూడో సంవత్సరం బడ్జెట్లో కూడా పెట్టలేదు కదా అని అడిగితే మాట రాదు. 
    సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌లో భాగంగా నిరుద్యోగభృతి అని, చదువుకున్న ప్రతి పిల్లాడికీ కూడా రూ.3 వేల భృతి ఇస్తానన్నావు. సంవత్సరానికి రూ.36 వేలు. రెండేళ్లకు రూ.72 వేలు. ఇప్పటికే బాకీ పడ్డావు. మూడో సంవత్సరంలో బడ్జెట్లో కూడా పెట్టలేదు కదా అంటే దాని మీద మాట ఉండదు. 
    50 ఏళ్లకే పెన్షన్‌ అన్నావు. 50 ఏళ్లు నిండిన ప్రతి అక్కచెల్లెమ్మకూ సంవత్సరానికి రూ.48 వేలు బాకీ. రెండేళ్లలో రూ.96 వేలు బాకీ. మూడో సంవత్సరం కూడా బడ్జెట్లో దాని గురించి కేటాయింపులు లేవు కదా అంటే దాని గురించి కూడా ఎక్కడా పత్తా ఉండదు. మేనిఫెస్టో అడ్రస్‌ ఎక్కడా కనిపించదు. అడిగితే మాత్రం చంద్రబాబుకు బీపీ పెరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఆయన బీపీ చాలా ఎక్కువగా పెరుగుతోంది. టపా అని ఎక్కడన్నా పొరపాటున చంద్రబాబునాయుడు గారిని నిద్రలేపి, మావిగన్‌ అని చెవిలో అన్నారంటే మాత్రం అక్కడే పడిపోయినా పడిపోతాడు. ఈ మధ్య కాలంలో చంద్రబాబునాయుడు గారిలో ఇవన్నీ చూస్తున్నాం. 

పెట్రో ధరల తగ్గింపుపైనా మోసమే:
    143 హామీల్లో మనందరికీ కూడా ప్రధానంగా కనిపించేవి.. పెట్రోలు, డీజిల్‌ కళ్ల ఎదుటే కనిపిస్తోంది. పెట్రోలు, డీజిల్‌ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి చూస్తే ఈరోజు లీటరు పెట్రోలు రూ.117 దాటింది. లీటరు డీజిల్‌ చూస్తే రూ.105 దాటింది. ఈ పెట్రోలు, డీజిల్‌ ధరలు అధికారంలోకి రాగానే తగ్గిస్తామని చంద్రబాబు తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాడు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయిపోయింది. మూడో సంవత్సరం కూడా మొదలైంది. ఈరోజు పెట్రోలు, డీజిల్‌ ను విపరీతంగా బాదుడే బాదుడు కనిపిస్తోంది. ఇప్పటికే పెట్రోలు రూ.117 దాటింది, డీజిల్‌ రూ.105 దాటింది. స్టేట్‌ గవర్నమెంట్‌కు ట్యాక్సుల రూపేణా వచ్చే సొమ్ము లీటరు పెట్రోల్‌లు మీద రూ.31.62, లీటరు  డీజిల్‌ మీద రూ.23.46. అదే కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం లీటరు పెట్రోలు మీద రూ.11.90. లీటరు డీజిల్‌ మీద రూ.7.80.
    మరి ఈరోజు పెట్రోల్, డీజిల్‌ మీద ఇంత దారుణమైన బాదుడు కనిపిస్తున్నప్పుడు, వాటి ద్వారా నీకు వచ్చే ట్యాక్సులు ఎందుకు తగ్గించడం లేదయ్యా? ఎన్నికల మేనిఫెస్టోలో నువ్వే కదా ఈ మాటలన్నీ రాశావు కదా? అని అడిగితే మాత్రం చంద్రబాబు నాయుడుకు బీపీ పెరుగుతుంది. 

‘సూపర్‌హిట్‌’ అంటూ నిస్సిగ్గుగా ప్రచారం:
    ఎన్నికల హామీల్లో ఇంకా చాలా ఉన్నాయి. సూపర్‌ సిక్సులు, సూపర్‌ సెవెన్లు పచ్చి మోసాలుగానే కనిపిస్తున్నాయి. సూపర్‌ సిక్సులు, సూపర్‌ సెవెన్లు పూర్తిగా ఒకవైపున ఎగరగొడుతూనే, మరోవైపున సూపర్‌ సిక్సులు, సూపర్‌ సెవెన్లు అన్నీ చేసేశాం అని ఏకంగా ప్రకటనలు ఇస్తూ ప్రచారం చేసుకుంటున్న ముఖ్యమంత్రి బహుశా దేశ చరిత్రలో ఎవడూ ఉండడేమో. ఇంతగా అబద్ధాలను బుల్డోజ్‌ చేసి, పేపర్లో అడ్వర్టైజ్‌మెంట్లు ఇచ్చి మరీ దాన్ని ముందుకు తీసుకునిపోయే వ్యక్తి బహుశా ప్రపంచ చరిత్రలో ఎవడూ ఉండడేమో.. ఒక్క చంద్రబాబునాయుడుగారు తప్ప. 

అందుకే చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌:
    ఇదే పెద్దమనిషి చంద్రబాబునాయుడుగారు తాను ఫలానా మంచి చేశాను అని చెప్పుకునే పరిస్థితి లేదు. నోరు తెరిస్తే అబద్దాలు తప్ప ఆయన నోట్లో నుంచి ఏవీ కూడా ప్రజలకు ఈ రెండు సంవత్సరాల్లో ఈ మంచి నేను చేశాను అని చెప్పుకునే పరిస్థితి లేదు. ఈ రెండేళ్లలో ఆయన చేసిన మంచి ఎక్కడా కూడా లేదు కాబట్టి, చెప్పుకునేందుకు ఏమీ లేదు కాబట్టి ఆయన డైవర్షన్‌ పాలిటిక్స్‌లో పూర్తిగా నిమగ్నమై ఉన్నాడు. ఏ అంశమైనా కూడా డైవర్ట్‌ చేయాలి. ప్రజలను ఈ టాపిక్‌ నుంచి ఈ టాపిక్‌ లోకి మభ్య పెట్టాలన్న దిక్కుమాలిన ఆలోచనతోనే అడుగులు పడ్డాయి. 
అందుకే ఈ మధ్య లేటెస్ట్‌గా గొడ్డళ్లు, కత్తులు, కటార్లు అంటూ కొత్త డైవర్షన్‌ పాలిటిక్స్‌ మనమంతా చూస్తూనే ఉన్నాం. నిజంగా ప్రజలందరూ పిచ్చోళ్లు అని చంద్రబాబునాయుడు అనుకుంటున్నాడు కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్లు. ప్రజలు చాలా చైతన్య వంతులు. 

రాష్ట్రాభివృద్ధి ఎప్పుడు జరిగిందంటే..:
అందుకే గర్వంగా కాలర్‌ ఎగరేసుకుని చెప్పగలం:

    నిజంగా రాష్ట్రంలో ఏ ప్రాంతమైనా బాగు పడిందన్నా, రాష్ట్రంలో నిజంగా ఎక్కడైనా అభివృద్ధి జరిగిందన్నా, నిజంగా రాష్ట్రంలో ఎక్కడైనా పేదవాడికి నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లాయి అన్నా, ఒక రైతు బాగుపడ్డాడు అన్నా, ఒక అక్కచెల్లెమ్మ బాగు పడిందన్నా, ఒక పిల్లాడు చదువుల విషయంలో బాగుపడినాడు అన్నా.. ఇవన్నీ ఎక్కడైనా జరిగాయా అంటే ఒక్క నాన్నగారి పాలనలోనే జరిగాయి. దాని తర్వాత వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, మీ జగనన్న పాలనలోనే జరిగాయి అని గర్వంగా చెప్పగలుగుతాను. 
    నిజంగా మంచి చేశాము అని చెప్పి కాలర్‌ ఎగరేసుకుని, మాట ఇచ్చాం, మాట నిలబెట్టుకున్నాం అని గర్వంగా ప్రతి ఇంటికీ వెళ్లగలిగిన పరిస్థితి ఒక్క వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి మాత్రమే ఉందని కూడా గర్వంగా చెప్పగలుగుతాం. ఈరోజు ఇన్ని మోసాలు, ఇన్ని అబద్ధాలు, ఇన్ని అరాచకాలు, ప్రజలకు వివరించేందుకు చంద్రబాబు నాయుడుగారి రెండు సంవత్సరాల పాలన పూర్తయిన నేపథ్యంలో ప్రజలను జాగృతి పర్చేందుకు ఒక బుక్‌ లెట్‌ ను కూడా రిలీజ్‌ చేస్తున్నాం. 

‘వెన్నుపోటుకు రెండేళ్లు’ బుక్‌ ఇందుకు:
    ‘చంద్రబాబునాయుడుగారి వెన్నుపోటుకు రెండేళ్లు’ అని చంద్రబాబు నాయుడుగారి మీద బుక్‌ లెట్‌. ఇందులో ఆయన సూపర్‌ సిక్సులు, సూపర్‌ సెవెన్లు ఏరకంగా ఆయన మోసం చేశాడు దగ్గర నుంచి ఏ రకంగా విద్యాదీవెన, వసతి దీవెన వంటి కార్యక్రమాలతో ఎలా పిల్లలను రోడ్ల మీదకు తీసుకొచ్చినాడు అన్న పరిస్థితి నుంచి ఆరోగ్యశ్రీ పరిస్థితి, విద్య, వైద్యం, వ్యవసాయం ఏరకంగా కుప్పకూలిపోయింది, అక్కచెల్లెమ్మల జీవితాలు ఎలా చీకటిమయం అయిపోయాయి ఇటువంటి అన్ని విషయాలతో పాటు ఆయన దుర్మార్గాలు, దౌర్జన్యాలు, అవినీతి అన్నీ కూడా, ఈ పుస్తకంలో క్లుప్తంగా ఏ ఒక్కరికైనా అర్థమయ్యే భాషలో ఈ బుక్‌ లెట్‌ రూపొందించడం జరిగింది. ఈ బుక్కు కూడా అందరికీ అందుబాటులోకి తీసుకొస్తు్తన్నాం. క్యూఆర్‌ కోడ్, డిజిటల్‌ కాపీలు ప్రతి కార్యకర్తకూ కూడా చేరేలా మన పార్టీ వెబ్‌ సైట్లో కూడా ఈ బుక్కు వివరాలు అన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం. 

ప్రతి కార్యకర్త వద్ద ఉండాలి. ప్రతి ఇంటికీ చేర్చాలి:
    బుక్‌లో అన్ని అంశాలకు సంబంధించి క్షుణ్నంగా కూడా మనం చదువుకోవడమే కాకుండా, మన పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా ఈ రెండేళ్ల పాలన ప్రతి అంశం మీద అవగాహన ఉండేలా ఈ పుస్తకాన్ని రూపకల్పన చేసి వారికి అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇది వాళ్లందరికీ అందుబాటులోకి వెళ్లేలా మీరందరూ కూడా చర్యలు తీసుకోవాలి. ప్రజలకు చంద్రబాబు పొడిచిన వెన్నుపోట్లను వివరిస్తూ మొదటి ఏడాది ఏరకంగా అయితే మనం ర్యాలీలు నిర్వహించామో బాగా జరిగింది అప్పట్లో కార్యక్రమం. అంతకన్నా కూడా రెండో ఏడాది చంద్రబాబునాయుడుగారి పాలన మీద నిరసన తెలుపుతూ ఇంకా గొప్పగా ర్యాలీలు జరగాలి. ఈ కార్యక్రమాలు అన్నింటికీ కూడా జూన్‌ 4 నుంచి 12 వరకు వెన్నుపోటుకు రెండేళ్లు.. కార్యక్రమం అనేది పార్టీ తరఫున చేపడుతున్నాం. 

ఇదీ నిరసన కార్యక్రమాల కార్యాచరణ:
    జూన్‌ 4 నుంచి 12 వరకు జరగబోయే ఈ కార్యక్రమాలు.. ఒకవైపున ఎస్‌ఐఆర్‌ కారణంగా, కమిటీల వెరిఫికేషన్‌ మనకు గ్రామ స్థాయిలో కమిటీల వెరిఫికేషన్‌ కారణంగానూ, ఎండల తీవ్రతను కూడా పరిగణనలోకి తీసుకుని ఈ షెడ్యూల్‌ రూపొందించడం జరిగింది.
    జూన్‌ 4న మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రతి మండలంలోనూ మీమీ నియోజకవర్గాల్లో జూన్‌ 4న ఈ కార్యక్రమం చేపట్టండి. చంద్రబాబునాయుడుగారికి సంబంధించి ఆయన మేనిఫెస్టో అంటే ఈనాడులో ఎన్నికల ముందు ఆయన ఇచ్చిన అడ్వర్టైజ్‌మెంట్‌ కాపీ, బాండ్లు ఏదైతే ఇచ్చారో, పవన్‌ కల్యాణ్, చంద్రబాబునాయుడు ఫొటోలతో సంతకాలు చెప్పి బాండ్లు ఏదైతే ఇచ్చారో, ఆ బాండ్ల కాపీలు. ఇవి నెట్లో అందుబాటులోనే మన దగ్గరా ఉన్నాయి. మీరు కూడా మీమీ నియోజకవర్గాల్లో ప్రతి కార్యకర్తకూ కూడా ఈ విషయాలన్నీ చెప్పి దీంట్లో కూడా, ఈ బుక్కులో కూడా పెట్టడం జరిగింది. ఈనాడులో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు సంబంధించిన అడ్వర్టైజ్‌మెంట్లు, బాండ్లు. ఇవి ప్రతి మండల కేంద్రంలో కూడా 4వ తేదీన ఈ రెండూ చూపిస్తూ మండల కేంద్రాల్లో నాలుగు కూడళ్ల మధ్య నిప్పంటించి నిరసన తెలిపే కార్యక్రమం. అదే జూన్‌ 4న మండల కేంద్రాల్లో చేసే కార్యక్రమం. ఇందులో ఏదో ఒక మండలంలో నియోజకవర్గ ఇన్‌చార్జి పాలు పంచుకోవాలి. మిగిలిన మండలాల్లో కార్యకర్తలు పాలు పంచుకునే కార్యక్రమం జరిగేలా ప్రణాళిక వేశాం.
    తరువాత జూన్‌ 8, 9 తేదీల్లో తమ వీలును బట్టి నియోజకవర్గ కేంద్రాల్లో వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో టౌన్‌ హాల్‌ సదస్సు ఉంటుంది. యువకులు, రైతులు, మహిళలు పాల్గొనే ఈ కార్యక్రమంలో వీరందరి సమక్షంలో వెన్నుపోటుకు రెండేళ్లు పుస్తకంలోని అన్ని అంశాలను కూలంకషంగా చర్చించి అవగాహన కల్పించడం జరుగుతుంది.
    చివరగా జూన్‌ 12న రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనకు నిరసన తెలుపుతూ భారీ నిరసన ర్యాలీలు నిర్వహిద్దాం. ఈ కార్యక్రమాన్ని స్వయంగా నేను కూడా పర్యవేక్షించడం జరుగుతుంది. తూతూ మంత్రంగా నిర్వహిస్తే సహించేది లేదు. ప్రజలకు చేసిన వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకి నిరసన సెగ తగిలేలా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. 

మన అభ్యర్థికి ఆ భరోసా ఇవ్వాలి:
    త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. చంద్రబాబు నాయుడి కుట్ర రాజకీయాల గురించి మనందరికీ తెలిసిందే. చంద్రబాబు ఏ విధంగా కుట్రలు పన్నుతాడో ఈ మధ్య కాలంలోనే జరిగిన కార్పొరేషన్, మున్సిపల్, మండల పరిషత్‌ ఉప ఎన్నికల సందర్భంగా మనమంతా చూశాం. ఏ విధంగా పోలీసులను వాడుకుంటాడో వారి ద్వారా ఎలా దౌర్జన్యాలు చేస్తాడు, బరి తెగించి ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీ చేస్తాడో మనందరికీ తెలిసిన విషయాలే. అయినా సరే, స్థానిక సంస్థల ఎన్నికలను మనం ఖచ్చితంగా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ప్రతి ఒక్కరికీ స్పష్టంగా చెబుతున్నా. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రతి కార్యకర్తకు మనం తోడుగా నిలబడాల్సిందే. ఎందుకంటే, ఎన్నికల్లో నిలబడిన కార్యకర్త గెలిచినా, ఓడినా మా ఎమ్మెల్యే అభ్యర్థి మాకు తోడుగా నిలబడ్డాడని వారికి అనిపించాలి. చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడి నన్ను ఓడించడానికి శతవిధాలా ప్రయత్నించినా, పరాజయం పాలైనా సరే నా ఎమ్మెల్యే క్యాండిడేట్‌ నాకు అండగా ఉన్నాడనే ధైర్యం వారికి అనిపించాలి. స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా కార్యకర్తల మనసులు గెలుచుకోవడానికి ప్రతి నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే, ఈరోజు వారికి మీరు అండగా నిలబడితే రాబోయే ఎన్నికల్లో ఈ కార్యకర్తలు మీ గెలుపు కోసం కృషి చేస్తారనే విషయాన్ని మాత్రం మరువొద్దు. 

ఏకగ్రీవ ఎన్నిక జరిగితే అది ఇన్‌ఛార్జ్‌ ఫెయిల్యూర్‌:
    చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా సరే ప్రతి స్థానంలోనూ వైయ‌స్ఆర్‌సీపీ జెండా ఎగుర వేయాలి. ఎక్కడైనా ఏకగ్రీవం జరిగిందంటే మాత్రం దాన్ని నేను సీరియస్‌గా తీసుకుంటా. ఏకగ్రీవం జరిగిందంటే దాన్ని నియోజకవర్గ ఇన్‌చార్జి ఫెయిల్యూర్‌గానే భావిస్తానని ఖచ్చితంగా చెబుతున్నా. దీన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి. ఈరోజు నుంచే ప్రజల్లో నిరంతరం ఎవరున్నారు? పార్టీ కార్యక్రమాల్లో ఎవరు చురుగ్గా పాల్గొంటున్నారు? అనే అంశాల మీద అవగాహన పెంచుకుంటూ సరైన అభ్యర్థిని ఎంపిక చేసుకోవాలి. ఇప్పటికే గ్రామ స్థాయి నుంచి వేసిన కమిటీలను బలోపేతం చేసుకుంటూ ముందుకు పోవాలి. 

చంద్రబాబు అవినీతిపై ప్రజలను చైతన్యపర్చాలి:
    ప్రతి వార్డులోనూ, ప్రతి గ్రామంలోనూ కమిటీలు, అనుబంధ విభాగాలు ఏర్పాటు చేయడం జరిగింది. వారి ద్వారా ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పుస్తకం అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. డిజిటల్‌ కాపీలు వారందరికీ చేరవేయాలి. వీరి ద్వారా చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన వైనాన్ని ప్రతి ఇంటిలో చర్చ జరిగేలా చేయాలి. చంద్రబాబు వెన్నుపోటు మీద ఎప్పుడైతే చర్చ జరుగుతుందో..  మనం ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ రద్దైపోయి, రాష్ట్ర సర్వ నాశనం అయిపోయిన పరిస్థితులు ప్రజలకు కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తాయి. ఆ స్థాయిలో మనం చొరవ చూపి వారికి అవగాహన కల్పించాలి. చంద్రబాబు మాటలు మోసాలు, అబద్ధాలుగా మారి ప్రజలపై చేస్తున్న దౌర్జన్యాలు, కంటికి కనిపించేలా జరుగుతున్న అవినీతిపై ప్రతి ఒక్కర్నీ చైతన్యవంతులను చేయాలి. అప్పుడే ప్రజలు తిరగబడతారు. మన పార్టీకి అండగా నిలబడతారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలను చాలా సీరియస్‌గా తీసుకోవాలి. 

‘స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌’ (సర్‌)పై అప్రమత్తం:
ఈ అంశాన్ని ఎందుకు సీరియస్‌గా తీసుకోవాలి అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు చెప్పాలి.
    ఇటీవల జరిగిన తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలు అందరం చూశాం. పశ్చిమ బెంగాల్‌లో 91 లక్షలు (11.9 శాతం) ఓట్లు, తమిళనాడులో 74 లక్షల ఓట్లు (11.6 శాతం) ఈ ఎస్‌ఐఆర్‌ ద్వారా తొలగించారు. మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్‌ అనే నియోజవకర్గంలో 45,982 ఓట్లు తొలగిస్తే 15 వేల ఓట్లతో ఆమె ఓడిపోయారు. తమిళనాడులో స్టాలిన్‌ పోటీ చేసిన కొళతూర్‌ అనే నియోజకవర్గంలో 71 వేల ఓట్లు తొలగిస్తే ఆయన 8 వేల ఓట్లతో ఓడిపోయారు. ప్రతి ఒక్కరూ ఈ రెండు అంశాలను గుర్తు పెట్టుకోవాలి.
    బెంగాల్‌ 91 లక్షల ఓట్లు తొలగిస్తే ఆ రాష్ట్రంలో మమత పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌ 31 లక్షల ఓట్ల తేడాతో ఓడింది. అదే విధంగా తమిళనాడులో 74 లక్షల ఓట్లు తీసేస్తే స్టాలిన్‌ పార్టీ డీఎంకే ఓడింది 17 లక్షల ఓట్ల తేడాతోనే. ఎస్‌ఐఆర్‌ అనేది ఎంత ఇంపార్టెంట్‌ అనేది చెప్పడానికే ఇవన్నీ చెప్పాల్సి వస్తోంది. ఇవన్నీ తెలుసుకుంటే మీ మీ నియోజకవర్గాల్లో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో మీకు స్పష్టత వస్తుంది. మనం ఓట్లు పెరగడం వల్ల ఓడిపోయాం. వాళ్లు ఓట్లు తొలగించడం వల్ల ఓడిపోయారు. రెండూ ప్రమాదమే.
    కుప్పంలో టీడీపీకి 20 వేలకు పైగా బోగస్‌ ఓట్లు ఉన్నాయి. ఒకే పేరు ఐదు సార్లు, పది సార్లు కనిపిస్తోంది. లిస్టులో ఆ పేరు కనిపించిన ప్రతి సారీ తండ్రి పేరు చూసినా లేదా భర్త పేరు చూసినా ఒకటే ఉంటాయి. ఇదీ కుప్పంలో మన కళ్ల ఎదుటే కనిపిస్తున్న హిస్టరీ అండ్‌ మిస్టరీ. ప్రతి ఊరిలో మన వారు అనుకున్న 50 ఓట్లు తొలగిస్తే చాలు నియోజకవర్గ వ్యాప్తంగా 5 వేల వరకు మన ఓట్లు పోయినట్టే.
ప్రతి ఊరిలో మన ఓటర్లు అనుకునే వాళ్లవి కేవలం 50 ఓట్లు తీసేస్తే చాలు.. నియోజకవర్గం మొత్తంలో మనవి 50 వేల ఓట్లు డ్రాప్‌ అయిపోతాయి. కాబట్టి ప్రతి ఊరిలో కూడా ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పడానికి మీ అందరికి కొన్ని కొన్ని ఉదాహరణలు చెప్పడం జరిగింది.
    ఈ జాగ్రత్తలు, సూచనలు మనం పాటిస్తే.. నియోజకవర్గాల్లో అవి ఎంతో ఉపయోగపడతాయి. మన  ఓట్లను ఎవరూ తీసేయకుండా..  మనవాళ్ల ఓట్లను మనం ప్రొటెక్ట్‌ చేసుకోవడానికి అవి చాలా ఉపయోగపడతాయి. అవి చాలా అవసరమని అందరం భావించి.. ఈ మేరకు ఎక్సర్‌సైజ్‌ చేసి అందరి దృష్టికి తీసుకురావడం జరిగిందని శ్రీ వైయస్‌ జగన్‌ వివరించారు.
    ఆ తర్వాత ‘సర్‌’ కు సంబంధించి ఎలా అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. పార్టీ నష్టపోకుండా ఏ విధంగా వ్యవహరించాలి అన్న అంశాలపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు సమావేశంలో పీపీటీ ద్వారా చూపారు.

Back to Top