చంద్రబాబుని మించిన మోసగాడు లోకేష్‌

 మాజీ మంత్రి ఆర్కే రోజా ఫైర్‌

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన నేతలు.
సమావేశం వివరాలతో పాటు, మహానాడులో సీఎం చంద్రబాబు, ఆ పార్టీ నాయకుల విమర్శలపై చురకలంటించిన వైయస్సార్‌సీపీ నేతలు.

చంద్రబాబు మోసాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, సర్‌ పై దిశానిర్దేశం  
:పేర్ని నాని, మాజీ మంత్రి.

– ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయకుండానే చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పులతో దివాళా తీయించాడు. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ బాండ్ల పేరుతో సంతకాలు పెట్టి మరీ ప్రజలను మోసగించారు. ఎన్నికల్లో ఓట్ల కోసం వారు చెప్పిన అబద్ధాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైయస్‌ జగన్‌ గారు ఆదేశించారు. ఓట్ల లెక్కింపు జరిగిన జూన్‌ 4 నుంచి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జూన్‌ 12వ తేదీ వరకు వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష‡్షŠట్రంలో నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి 
వేధింపులకు భయపడకుండా పోరాడాలని పిలుపునిచ్చారు. దీంతోపాటు స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌) పై కూడా అప్రమత్తంగా ఉండాలని వైయస్‌ జగన్‌ గారు సూచించారు. బీఎల్‌వోలకు ఓటర్‌ లిస్టు సవరణ పనులు తప్ప మరే ఇతర పనులూ అప్పగించకూడదని ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషనర్‌ని వైయస్సార్సీపీ తరఫున డిమాండ్‌ చేస్తున్నాం.  

మోదీ ముందు ఒంగడం, మైకులో మొరగడం.. 
:కొడాలి నాని, మాజీ మంత్రి

– మోడీ కనపడితే ఒంగోవడం, మైకు దొరికితే జగన్‌ని సైకో, గొడ్డలి అని తిట్టడం.. రెండేళ్లుగా కూటమి నాయకుల దినచర్య. రాష్ట్రానికి ఏం చేశావని నిలదీస్తే తల్లి, చెల్లి, గొడ్డలి అని డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. అంతేతప్ప ఓటేసిన ప్రజలకు చేసింది గుండు సున్నా. చంద్రబాబు దరిద్రం రాష్ట్రానికి ఎప్పుడు వదులుతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. సూపర్‌ సిక్స్‌ పేరుతో ఎన్నికల్లో హామీలిచ్చి ఇప్పుడు సూపర్‌ సున్నాగా మార్చేసిన వైనాన్ని జూన్‌ 4 నుంచి ప్రజలకు వివరిస్తాం. సర్‌ కారణంగా వైయస్సార్సీపీ ఓట్లు తొలగిపోకుండా అప్రమత్తంగా ఉండాలని వైయస్‌ జగన్‌ గారు ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి వైయస్సార్సీపీ అభ్యర్థి గెలుపు బాధ్యత నియోజకవర్గ ఇన్‌చార్జిలు తీసుకోవాలని, ఏకగ్రీవాలు కాకుండా పోరాడాలని పిలుపునిచ్చారు. వైయస్‌ జగన్‌ గారిని చర్చలకు రావాలని డిమాండ్‌ చేసే అర్హత లోకేష్‌కి లేదు. ఓడినా గెలిచినా జగన్‌ ప్రజల పక్షానే ఉంటారు. అంతేకానీ అధికారం కోసం తప్పుడుదారులు తొక్కడం, అబద్ధాలు చెప్పడం జగన్‌కి నచ్చదు. మోడీ కన్నాసీనియర్‌ నాయకుడినని చెప్పుకునే చంద్రబాబు ఆయన ముందు ఒంగి ఒంగి దండాలు పెట్టడం సిగ్గుచేటు. వైయస్‌ జగన్‌ గారు పార్టీ ఆఫీసులో నాయకులతో మీటింగ్‌ పెడితేనే మహానాడు డైవర్ట్‌ అయిపోయిందని అంటున్నారంటే.. ఆ పార్టీ ఎంత వీక్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

చంద్రబాబుని మించిన మోసగాడు లోకేష్‌
:ఆర్కే రోజా, మాజీ మంత్రి

– మాయమాటలతో మోసపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను తీవ్రంగా మోసం చేశాడు. వైయస్‌ జగన్‌ ఇచ్చే అన్ని సంక్షేమ పథకాలతో పాటు సూపర్‌ సిక్స్‌ కూడా అమలు చేస్తామని ఎన్నికల సందర్భంగా చెప్పి ఓట్లేయించుకున్నాడు. కానీ అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీని అమలు చేయకుండా సూపర్‌ సిక్స్‌ సూపర్‌ హిట్‌ అని ప్రజలను ఏమార్చాలని చూస్తున్నారు. నిరుద్యోగ భతి, ఆడబిడ్డ నిధికి ఇంతవరకు మూడు బడ్జెట్‌లో కూడా నిధులు కేటాయించలేదు. మహిళలకు సంక్షేమం లేదు. మహిళలకు రక్షణ లేదు. కానీ స్త్రీ శక్తి అని పేరు పెట్టుకుని గొప్పలు చెప్పుకుంటున్నారు. చంద్రబాబే మోసగాడు అనుకుంటుంటే, ఆయన కొడుకు లోకేష్‌.. చంద్రబాబునే మించిపోయాడు. ఆయన నిర్వహించే విద్యారంగాన్ని పూర్తి భ్రష్టుపట్టించాడు. పిల్లలను చదువులకు దూరం చేస్తున్నాడు. వైయస్‌ జగన్‌ గారి ఆదేశాలతో రెండేళ్ల చంద్రబాబు వెన్నుపోటు గురించి ప్రజల్లో విస్తతంగా ప్రచారం చేస్తాం. ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్‌ కళ్యాణ్, ప్రజలను ఇన్ని రకాలుగా వంచిస్తున్న చంద్రబాబుని ఎందుకు ప్రశ్నించడం లేదు?  

మహానాడు కాదు.. మహా నాటకం
:డా. సీదిరి అప్పలరాజు, వైయస్సార్సీపీ డాక్టర్స్‌ విభాగం అధ్యక్షుడు, మాజీ మంత్రి  

– మహానాడు పేరుతో చంద్రబాబు ఒక మహా నాటకాన్ని రక్తి కట్టించడానికి సిద్ధమైపోయాడు. రెండేళ్లలో రాష్ట్రంలో ఆయన సాధించిన పురోగతి శూన్యం. వైయస్‌ జగన్‌ గారిని తిట్టడం, వ్యక్తిత్వ హననం చేయడం కోసమే మహానాడు పెట్టుకున్నాడు. దేవుడి దర్శనం కోసం వెళ్లినా అక్కడ చంద్రబాబుకి జగనే కనిపిస్తున్నాడు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడకూడని మాటలు కూడా చంద్రబాబు మాట్లాడుతున్నాడు. ప్రపంచ రాజకీయ చరిత్రలో చంద్రబాబు వెన్నుపోటుకే ప్రథమ స్థానం ఉంటుంది. చంద్రబాబు పాలనలో ప్రజలు తీవ్రమైన నిరాశా నిస్పహల్లో ఉన్నారు.  కూటమి ప్రభుత్వం వచ్చాక 1,23,684 ఉద్యోగాలు కల్పించారని వారి కరపత్రిక ఈనాడు రాసింది. కానీ వారు మాత్రం 20 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పడం సిగ్గుచేటు. చంద్రబాబు రెండేళ్ల విధ్వంస పాలనను ప్రజల్లోకి విస్తతంగా తీసుకెళ్లాలని వైయస్‌ జగన్‌ గారు ఆదేశించారు. కూటమి ప్రభుత్వంపై సమరశంఖం పూర్తిస్తున్నాం. రాష్ట్రాన్ని తిరోగమనంలోకి తీసుకెళ్లిన ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెబుతాం. 

మహానాడుకి బదులు వెన్నుపోటు నాడు అని పెట్టుకోవాల్సింది
:వరుదు కళ్యాణి, ఎమ్మెల్సీ 

– రెండేళ్లలో మహిళలు, ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు, విద్యార్థులు.. ఇలా అన్ని వర్గాలను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. మహానాడుకి కూడా వెన్నుపోటు నాడు అని పెట్టుకుంటే బాగుండేది. రెండేళ్ల చంద్రబాబు కూటమి పాలనలో ఒక పక్క మహిళలను నిట్టనిలువునా మోసి చేసిందే కాకుండా మహానాడుకి స్త్రీ శక్తి థీమ్‌ అంటూ మహిళలను దగా చేయడానికి పూనుకున్నాడు. గతంలో మహానాడులోనే ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని ప్రవేశపెట్టిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చాక మూడు బడ్జెట్‌లు ప్రవేశపెట్టినా ఈ పథకానికి కనీసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. కనీసం ఒక్క కొత్త పింఛన్‌ కూడా ఇవ్వకుండా 6 లక్షల పింఛన్లు పీకేశాడు. వైయస్‌ జగన్‌ గారు తీసుకొచ్చిన పథకాలన్నీ తీసేశాడు. ఆఖరుకి మహిళల రక్షణ కోసం తీసుకొచ్చిన దిశ యాప్‌ని నిర్వీర్యం చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. రోజుకి 60 నుంచి 70 మంది మహిళల మీద దాడులు జరుగుతున్నాయి. శాంతిభద్రతలు పూర్తిగా గాడితప్పాయి. రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమలు చేయడానికే పోలీసులను వినిగించడమే ఈ దుస్థితికి కారణం. వైయస్‌ జగన్‌ మాదిరిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. 

అది మహానాడు కాదు.. బాబు–కొడుకుల భజన నాడు.
:అంబటి రాంబాబు. మాజీ మంత్రి

– ఇవాళ టీడీపీ మహానాడు నిర్వహిస్తూ వైయస్‌ఆర్‌సీపీపై విమర్శలు చేస్తున్నారు. అది మహానాడు కాదు.. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను దగా చేసిన నాడు. రెండేళ్ల పాలనలో ప్రజలకు చెప్పిన మాటలు వేరు.. చేస్తున్నది వేరు. ఎన్టీఆర్‌ పార్టీ పెట్టితే.. ఆ పార్టీని లాక్కొని ఇప్పుడు చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్‌ను భజన చేసే వేదికగా మహానాడు మారిపోయింది. చంద్రబాబు ఆవేశపడి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారిని, వైయస్‌ఆర్‌సీపీపై విమర్శలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం నిర్వహించింది మెగా డీఎస్సీ కాదు.. అది దగా డీఎస్సీ. మైదానంలో అడుగు పెట్టని వారికి కూడా స్పోర్ట్స్‌ సర్టిఫికెట్లు ఇచ్చి ఉద్యోగాలు కల్పించారు. నేను నా ఎక్స్‌ ఖాతాలో మెగా డీఎస్సీ అవకతవకాలపై ట్వీట్‌ చేస్తే భయపడి పోలీసులతో ఫిర్యాదులు చేయిస్తున్నారు. నా ట్వీట్‌ తొలగించాలని ఒత్తిడి తెస్తున్నారు. నిజం బయటపడుతుందనే భయంతో ఇలా చేస్తున్నారా?. రెండేళ్లలోనే తీవ్ర ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం ఇదే. ఎప్పుడూ డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తూ ‘గొడ్డలి పార్టీ’ అంటూ మాపై విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు టక్కుఠమారా రాజకీయాలను ఎదుర్కొనేందుకు వైయస్‌ఆర్‌సీపీ సిద్ధంగా ఉంది. 

చంద్రబాబుకు వెన్నుపోటు వెన్నతో పెట్టిన విద్య.
:కెకె రాజు. విశాఖ జిల్లా వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు.

– కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రెండేళ్లలో ప్రతి అడుగులోనూ రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచింది. రాష్ట్ర భవిష్యత్‌కే ద్రోహం చేసింది. చంద్రబాబుకు వెన్నుపోటు వెన్నతో పెట్టిన విద్య. నాడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి టీడీపీని లాక్కున్న చంద్రబాబు.. ఇప్పుడు ప్రజలకు కూడా అదే చేస్తున్నారు. ఎన్నికల సమయంలో అమలు చేయలేని హామీలు ఇచ్చి, తర్వాత ప్రజలను మోసం చేయడం ఆయనకు అలవాటైపోయింది.

సంక్షేమంపై చర్చకు ఎక్కడైనా సిద్ధం.
:మేరుగు నాగార్జున. మాజీ మంత్రి.

– మహానాడు వేదికపై మంత్రి నారా లోకేష్‌ చేసిన వ్యాఖ్యలు చూశాం. రాష్ట్ర చరిత్రలో సంక్షేమానికి పేటెంట్‌ అంటే అది శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి పనితనం. పేదల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకొచ్చిన నాయకుడు జగన్‌. సంక్షేమంపై ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు మేం సిద్ధం. లోకేష్‌ విద్యాశాఖను పూర్తిగా అటకెక్కించారు. విద్యాదీవెన, వసతి దీవెన అమలు చేసే పరిస్థితి కూడా లేదు. విద్యార్థుల భవిష్యత్తును, పిల్లల చదువులను కాలరాసిన వ్యక్తి లోకేష్‌. విజయవాడ నడిబొడ్డున డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని వైయస్‌ జగన్‌ ఏర్పాటు చేస్తే.. ఇప్పుడు దానిని మసకబార్చేలా వ్యవహరిస్తున్నారు. సంక్షేమానికి బాటలు వేసిన నాయకుడు జగన్‌ కాగా.. పేదలను మోసం చేసిన మీరా మాతో చర్చించేది? రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. పేదలను ఎలా మోసం చేశారో ప్రతి గ్రామంలో ఎండగడతాం.

ఇది వెన్నుపోటు పరిపాలన.
:మార్గాని భరత్‌. మాజీ ఎంపీ.

– రెండేళ్ల చంద్రబాబు పాలన పూర్తిగా ‘వెన్నుపోటు పరిపాలన’గా మారింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో కనీసం 10 శాతం కూడా అమలు చేయకుండా అన్నీ పూర్తి చేశామంటూ చంద్రబాబు ప్రకటనలు ఇస్తున్నారు. ప్రజలను చైతన్యవంతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 10 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తాం.

మహానాడు పేరుతో ఎన్టీఆర్‌ను గుర్తు చేసుకుంటున్న చంద్రబాబు.. అదే ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి. అమరావతి లోతట్టు ప్రాంతం, అక్కడ రాజధాని పేరుతో ప్రజలను చంద్రబాబు మభ్యపెడుతున్నారు. రాజధాని ప్రాంతంలో రిజర్వాయర్లు కట్టిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబే. చంద్రబాబు నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు నష్టపోతున్నారు.

అది తెలుగుదేశం వెన్నుపోటు పార్టీ.
:జోగి రమేష్‌. మాజీ మంత్రి

– మహానాడు ఇప్పుడు మాయనాడుగా మారింది. మాయ మాటలు చెబుతూ చర్చకు సిద్ధమంటూ లోకేష్‌ మాట్లాడుతున్నారు. అభివృద్ధి, సంక్షేమంపై ఎక్కడైనా చర్చించేందుకు వైయస్‌ఆర్‌సీపీ సిద్ధంగా ఉంది. టైమ్, డేట్, వేదిక మీరే చెప్పండి. వైయస్‌ఆర్‌సీపీని గొడ్డలి పార్టీ అంటున్నారు. మహానాడు వేదికపై ఎన్టీఆర్‌ ఫొటోకు దండలు వేస్తున్న మీరు నిజంగా ఆయనకు నివాళి అర్పించే అర్హత ఉందా.. చంద్రబాబు, లోకేష్‌ ఆత్మపరిశీలన చేసుకోవాలి. టీడీపీ పేరు మార్చి ‘తెలుగు దేశం వెన్నుపోటు పార్టీ’ అని పెట్టుకుంటే బాగుంటుంది. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారణమైన వారే ఇప్పుడు ఆయన ఫొటోకు దండలు వేయడం కంటే దుర్మార్గం ఇంకేముంటుంది?

హామీలపై జగన్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.
:కె.నారాయణస్వామి. మాజీ డిప్యూటీ సీఎం.

– మా నాయకుడు జగన్‌గారు ఇటీవల ప్రెస్‌మీట్‌లో నిజాలు నిక్కచ్చిగా మాట్లాడారు. గత ఐదేళ్లు మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతలా భావించి ఇచ్చిన హామీలను వైయస్‌ జగన్‌ గారు అమలు చేశారు. కానీ చంద్రబాబు మాత్రం ఏనాడూ మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేయలేదు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి టీడీపీని లాక్కున్న విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసు. జగన్‌గారు ప్రెస్‌మీట్‌లో లేవనెత్తిన ప్రశ్నలకు దమ్ముంటే సమాధానం చెప్పాలి. మీడియా అండతో కూటమి ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి. 

ప్రజల సంపదను కార్పొరేట్‌ వర్గాలకు దోచిపెడుతున్నారు.
:గొల్ల బాబూరావు. ఎంపీ.

– సంపద సృష్టి పేరుతో పేదరికాన్ని తొలగించకుండా చంద్రబాబు తన సొంత సంపదను పెంచుకుంటున్నారు. ప్రజల ఆస్తులను కార్పొరేట్‌ వర్గాలకు దోచిపెడుతున్నారు. విశాఖలో అనేక కార్పొరేట్‌ కంపెనీలకు భూములను కారుచౌకగా కట్టబెట్టారు. లక్షల కోట్లు దోచుకునేందుకు కార్పొరేట్‌ కంపెనీల పేర్లు చెబుతున్నారు. నిజమైన సంపద సృష్టి అంటే ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడం. అది శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి హయాంలోనే జరిగింది. పేదల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేసి వారి జీవన స్థితిగతులను మెరుగుపరిచారు. 

Back to Top