తిరుపతి జిల్లా: పాకాల మండలం ఆదెనపల్లి పంచాయతీ శ్రీనివాసపురానికి చెందిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవనాయుడుపై ఎమ్మెల్యే నాని అనుచరులు హత్యాయత్నానికి పాల్పడ్డారని చంద్రగిరి వైయస్ఆర్‌సీపీ ఇంచార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యే తప్పులను ప్రశ్నించినందుకు మాధవనాయుడిపై చంద్రగిరి మండలం తొండవాడ సాయిబాబా గుడి సమీపంలో ఆయనపై ఆరుగురు వ్యక్తులు మూకుమ్మడిగా దాడి చేశారని తెలిపారు. ఈ మేరకు శనివారం చంద్రగిరి సీఐకి వారు ఫిర్యాదు చేశారు. దాడిలో మాధవనాయుడు తీవ్రంగా గాయపడి, నోటి నుంచి రక్తం కారుతున్నా దుండగులు వదల్లేదని తెలిపారు. రక్తంతో తడిసిన బట్టలతోనే చంద్రగిరి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ఆయనను పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారని తెలిపారు. ఎమ్మెల్యే నాని అవినీతిపై ప్రశ్నించినందుకే ఈ దాడి జరిగిందని చంద్రగిరి వైయస్ఆర్‌సీపీ ఇంచార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఖండించారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరిస్తూ, లేనిపక్షంలో పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపడతామని తెలిపారు.