చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలతో అమరావతికే నష్టం

57 వేల కోట్లు ఇతర రంగాలకు ఇస్తే సంపద సృష్టి ఎలా ?

రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త ఎం. పురుషోత్తం రెడ్డి సూటి ప్రశ్న

తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త ఎం.పురుషోత్తం రెడ్డి 

అమరావతి నిర్మాణంపై ప్రభుత్వంలో గందరగోళం

కేబినెట్ నిర్ణయాలే ఇందుకు నిదర్శనం

సెక్రటేరియట్ నిర్మాణంపై వేర్వేరు జీవోలెందుకు?

పేదలకు ఇచ్చిన 50 వేల ఇళ్ల పట్టాల రద్దు సరికాదు

అమరావతి నిర్మాణ ఖర్చుపై పొంతన లేని లెక్కలు

ప్రభుత్వ లెక్కల ప్రకారం చ.అడుగు ఖర్చు రూ.6982

వైయ‌స్ఆర్‌సీపీ ప్రకారం చ.అడుగు ఖర్చు రూ.18 వేలు

వాస్తవంగా పెడుతున్నది చ.అడుగుకు రూ.19,660 

అమరావతి నిర్మాణంలో ప్లాన్ ప్రకారమే వేర్వేరు జీవోలు

ఖర్చు తక్కువని చెప్పుకునేందుకే వేర్వేలు జీవోలు

చిత్తూరు మామిడి రైతులకు ఇవ్వడానికి డబ్బుల్లేవా ?

రాష్ట్రం స్దితిగతుల్ని మరచి అమరావతికి అప్పులు

అమరావతి నిర్మాణానికి 5-6 వేల ఎకరాలు అమ్మాల్సిందే

దానికి ముందు మౌలిక వసతులు, రైతుల ప్లాట్లు ఇవ్వాలి

వాటిని వదిలేసి రూ.57 వేల కోట్లు ఇతర పనులకా ?

ఇలా అయితే రాజధాని ఎప్పుడు పూర్తవుతుంది ?

రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త ఎం. పురుషోత్తం రెడ్డి ఆక్షేపణ

తిరుపతి:     అమరావతిపై కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రాజధాని నగరానికి ఏ విధంగానూ మేలు చేసేలా లేవని, తాజాగా కేబినెట్ భేటీలో అమోదించిన మూడు అంశాలే ఇందుకు నిదర్శమని రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త ఎం. పురుషోత్తం రెడ్డి మండిపడ్డారు. ఇందులో సచివాలయం నిర్మాణానికి ఇప్పటికే రూ.2540 కోట్లు కేటాయించడంతో పాటు త్వరలో అదనపు ఖర్చు కింద మరో రూ.4 వేల కోట్లు ఇచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాల్ని ఆయన ఆక్షేపించారు. అలాగే పేదలకు ప్లాట్లు అభివృద్ది చేసి ఇవ్వకుండా, మౌలిక సదుపాయాలు కల్పించకుండా రూ.57 వేల కోట్లను ఇతర అవసరాలకు కేటాయించడాన్ని పురుషోత్తం రెడ్డి తప్పుబట్టారు.  అమరావతి రాజధాని నిర్మాణం అవసరమే అయినా రాష్ట్రంలో ప్రజల స్దితిగతుల్ని, అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలని ఆయన చంద్రబాబు ప్రభుత్వానికి హితవు పలికారు.
ప్రెస్ మీట్ లో పురుషోత్తంరెడ్డి ఇంకేమన్నారంటే...

అమరావతిపై దారి తప్పుతున్న కూటమి సర్కార్ నిర్ణయాలు 

కూటమి ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి తాను అనుకున్న మహానగర విధానంలో కూడా సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదు.  తాజాగా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మూడు నిర్ణయాలు తీసుకుంది. ఇవి కూడా ప్రభుత్వం రాజధాని విషయంలో అనుకుంటున్న విధంగా లేవు. వీటిలో ఇంటిగ్రేటెడ్ సెక్రటేరియట్ ఎలివేషన్, వెలుగుల కోసం దాదాపు రూ.2540 కోట్లు ఖర్చు చేయాలని, అదనపు భూసేకరణ చేయాలని, గత ప్రభుత్వం అమరావతిలో పేదలకు ఇచ్చిన 50 వేల ఇళ్ల పట్టాలను రద్దు చేయాలని నిర్ణయించారు. ఈ మూడు నిర్ణయాలూ అమరావతికి కూడా ఉపయోగపడే నిర్ణయాలు కావు. మొట్టమొదటి అంశం రాష్ట్ర కార్యాలయాల నిర్మాణం, ఎలివేషన్ కోసం పెడుతున్న ఖర్చు. ప్రభుత్వం ఒక్కో చదరపు అడుగుకు రూ.6982 ఖర్చు చేస్తున్నట్లు చెబుతోంది. వైఎస్సార్సీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రపంచంలో ఏ నగరంలో లేని విధంగా ఒక్కో చదరవు అడుగుకు రూ.18 వేలు ఖర్చు పెడుతున్నట్లు చెప్తున్నారు. ఇంకా లోతుగా వెళ్తే.. ప్రభుత్వం ఇచ్చిన జీవోలు, కాంట్రాక్టర్లతో కుదుర్చుకున్న ఒప్పందాలు చూస్తే చదరపు అడుగుకు రూ.14,750 కేటాయిస్తున్నట్లు అర్దమవుతోంది. నిన్న తీసుకున్న నిర్ణయం ప్రకారం రూ.2540 కోట్లు ఎలివేషన్ పేరుతో తీసుకున్నారు. ఇంకా అదనపు  ఖర్చు పేరుతో మరో 4 వేల కోట్ల మేర జీవో ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ చదరపు అడుగుకు రూ.19,660 ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నట్లు అర్దమవుతోంది. 

రాష్ట్రంలో సమస్యల్నీ వదిలేసి అమరావతికే డబ్బులా ?

మనం 1500 చదరవు అడుగుల విస్తీర్ణం ఉన్న ఒక అపార్ట్ మెంట్ 50 లక్షలు ఇచ్చి కొంటే, చదరపు అడుగుకు అయ్యే ఖర్చు రూ.2500 నుంచి 3 వేలు అవుతుంది. ఇంకో 50 లక్షలు ఇచ్చి అపార్ట్ మెంట్ కు ఎలివేషన్ పేరుతో అభివృద్ధి చేసుకుంటే మొత్తం కోటి అవుతుంది. ఇక్కడ అమరావతిలోనూ జరుగుతుంది ఇదే. ప్రభుత్వం అమరావతిలో నిర్మాణాలకు కావాలనే వేర్వేరు జీవోలు ఇస్తోంది. చదరపు అడుగుకు తక్కువ ఖర్చే పెడుతున్నట్లు చెప్పుకునేందుకే ఇలా వేర్వేరు జీవోలు ఇస్తోంది. రెండో అంశం రాష్ట్ర రాజధాని కార్యాలయాలు ఐకానిక్ బిల్డింగ్స్ లా ఉంటాయనడంలో ఎవరికీ అభ్యంతరం లేదు. అయితే వీటికి పెడుతున్న ఖర్చు ఎంత అనేది ఇక్కడ చర్చనీయాంశం. ఒక రాష్ట్రానికి రాజధాని నిర్మించాలనుకునేటప్పుడు ప్రాథమికంగా గుర్తించాల్సింది రాష్ట్రంలో అన్ని తరగతుల ప్రజలు, వారి స్దితిగతులు కూడా చూడాలి. రాష్ట్ర ప్రజల కోసమే, రాష్ట్ర ఆదాయంతోనే ఐకానిక్ బిల్డింగ్ లు కట్టాల్సి ఉంటుంది. మరోవైపు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మామిడి రైతులకు గుజ్జు కంపెనీల ఇవ్వాల్సిన బకాయిలు ఇంకా చెల్లించలేదు. ప్రభుత్వాన్ని అడిగితే డబ్పులు లేవంటోంది. అలాంటి పరిస్ధితుల్లో 50 వేల కోట్లు అప్పు తెచ్చి అయినా రాజధాని కడతామని చెప్పడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి. రాష్ట్రంలో ప్రతీ వ్యక్తీ ఇది నా రాజధాని అనుకోవాలి. అలా అనుకోవాలంటే వారి సమస్యలు కూడా తీర్చాలి. వారి సమస్యలకు వచ్చేటప్పుడు ఆర్ధిక సంక్షోభం, డబ్బులు లేవని చెప్పి, అమరావతికి వచ్చే సరికి అవేవీ లేవని చెప్తే ప్రజలు దాన్ని ఎలా స్వీకరిస్తారో ప్రభుత్వం చూడాలి. 

అమరావతిలో 57 వేల కోట్లు ఇతర అవసరాలకు ఎందుకు ?

రాష్ట్ర బడ్జెట్ నుంచి కాకుండా అప్పులు తెచ్చి అమరావతికి ఖర్చు చేస్తున్నాం అంటున్నారు. అమరావతిలో సృష్టించే సంపదే ఆ అప్పుల్ని తీరుస్తుందంటున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 34 వేల ఎకరాలు ప్రభుత్వ భూమి, 20 వేలకు పైగా ఎకరాలు వాగులు, వంకలున్నాయి. ఇవన్నీ కలిపితే 54 వేల ఎకరాలు జమ అయ్యాయి. ఇందులో మౌలిక సదుపాయాలు పోను, ఓ పది వేల ఎకరాల్లో రైతులకు లక్ష ప్లాట్లు ఇవ్వాలి. ఇంకో పది వేల ఎకరాలు ప్రభుత్వ అవసరాలకు ఉంచుకోవాలి, ఓ ఐదారు వేల ఎకరాలు మిగిలితే దాన్ని అమ్మి లక్ష కోట్లు వస్తుందని చెప్తున్నారు. ఇందులో ముందుగా రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు అభివృద్ది చేసి ఇవ్వడంతో పాటు మిగిలిన భూమి అమ్మాలి. అమరావతిలో సంపద రావాలంటే ఐదారు వేల ఎకరాలు అమ్మాల్సిందే. ఇది కావాలంటే కనీసం లక్ష కోట్లు ఖర్చుపెట్టి మౌలిక వసతుల కల్పన, ప్లాట్ల అభివృద్ది చేయాల్సిందే. ఇప్పుడు 57 వేల కోట్ల విలువైన పనుల్ని ప్రభుత్వం కాంట్రాక్టర్లకు ఇచ్చింది. కానీ సంపద సృష్టి, ప్లాట్ల అభివృద్దికి రూపాయి అయినా కేటాయించారా ? ఈ 57 వేల కోట్లు ఇతర రంగాలకు కేటాయించుకుని, ఆ లక్ష కోట్లు ఎప్పుడు తీసుకొచ్చి సంపద సృష్టిస్తారు ? వచ్చే సంవత్సరం నుంచి ప్రపంచ బ్యాంక్ కు ఇవ్వాల్సిన  15 వేల కోట్లకు వడ్డీ చెల్లింపులు కట్టాల్సిందే. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులు ఖర్చు చేసే పరిస్ధితుల్లో ఉందా లేదా అనేది చెప్పాలి. అమరావతిలో 34 వేల ఎకరాల రైతులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం అభివృద్ది చేసిన కమర్షియల్, హౌసింగ్ ప్లాట్లు ఇవ్వడం, ప్రతీ ఏడాది కౌలు ఇవ్వాలి. ఇప్పటివరకూ ప్రభుత్వం పదేళ్లలో రైతులకు 2500 కోట్లు కౌలు రూపంలో ఇచ్చింది. త్వరగా ప్లాట్లు ఇవ్వకపోవడం వల్ల ఏటా 300 కోట్ల కౌలు ఖర్చు కొనసాగుతుంది. దీని కోసం కనీస ప్రయత్నాలు చేయకుండా 57 వేల కోట్లు ఇతర అవసరాలకు కేటాయిస్తుంటే రాష్ట్రానికి అదనపు భారం అవుతుందా లేదా చెప్పాలి. 

అమరావతి ప్లాన్ పై చంద్రబాబు పునరాలోచించుకోవాలి

ఆగ్రాకు వెళ్తే మొగలాయి ఘాట్ ప్రపంచంలోనే ఐకానిక్ భవనం, తాజ్ మహల్, ఆగ్రా పోర్టు ఉన్నాయి. వీటి చుట్టుపక్కన జనం బిచ్చమెత్తుకుంటున్నారు. యూపీ అంతా పేదరికం. మొఘల్ రాజులు బుద్దిపుట్టినట్లు భవనాలు నిర్మించుకుంటూ పోయారు. అవన్నీ ఇప్పుడు ప్రపంచానికి మోడలే. వాటిని చూసేందుకు లక్షలాది మంది ప్రజలు వస్తున్నారు. ఆ తరహా విధానం అమరావతిలో కరెక్టా కాదా అనేది ప్రభుత్వం ఆలోచించాలి. రాష్ట్రంలో ప్రజలు, ప్రాంతాల మధ్య సమతుల్యం లేకుండా, వారి స్దితిగతులు ఆలోచించకుండా భారీ నగర నిర్మాణానికి వెళ్లడం రాచరిక పోకడే అవుతుంది. ఆగ్రా పోర్టే ఇందుకు నిదర్శనం. అలాంటి స్దితి ప్రజలకు  మరోసారి అవసరమా ? గత ప్రభుత్వం పేదలకు ఇచ్చిన 50 వేల ఇళ్ల పట్టాలు రద్దు చేసింది. దీనికి రాజకీయ కారణాలు ఉండొచ్చు కానీ, అవన్నీ అభివృద్ది చేసి ఉంటే 2.5 లక్షల మంది ప్రజలు ఇక్కడికి వచ్చి ఉండేవారు. ఓ నగర వాతావరణం వచ్చేది. హైదరాబాద్ లో మాదాపూర్, హైటెక్ సిటీ పక్కన కూడా స్లమ్ లు ఉంటాయి. పేదలు, మధ్యతరగతి ప్రజలు లేని నగరాన్ని ఊహించుకోగలమా ? మీరు అలాంటి నగరం నిర్మించే ఆలోచనతో సమతుల్యత దెబ్బతింటుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజల అవసరాల దృష్ట్యా పరిమితంగా రాజధానిని అభివృద్ది చేసే విషయం ఆలోచించాలి. లేకపోతే మాకు అధికారం ఉంది కదా అని ముందుకెళ్తే రాష్ట్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త ఎం. పురుషోత్తం రెడ్డి హెచ్చరించారు.

Back to Top