రోగులకు మెరుగైన వైద్యం అందించాలి

పీహెచ్‌సీని త‌నిఖీ చేసిన అరకు ఎమ్మెల్యే  

అరకు:  రోగుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ అర‌కు ఎమ్మెల్యే రేగం మ‌త్స్య‌లింగం సూచించారు. అర‌కు నియోజకవర్గంలోని డుంబ్రిగూడ మండలం సాగర గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న కిల్లోగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆకస్మికంగా సందర్శించారు. వైయ‌స్ఆర్‌సీపీ నాయకులతో కలిసి ఆసుపత్రిని పరిశీలించిన ఆయన, చికిత్స కోసం వచ్చిన రోగులను పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో మందుల నిల్వలు, సిబ్బంది హాజరు పట్టికను స్వయంగా పరిశీలించారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని వైద్య సిబ్బందికి హెచ్చరించారు. డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ 24 గంటలు అందుబాటులో ఉండాలని, మందుల కొరత లేకుండా చూసుకోవాలని ఆదేశించారు.

అనంతరం సాగర గ్రామపంచాయతీ సచివాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే, సిబ్బంది విధి నిర్వహణపై ఆరా తీశారు. సమయపాలన పాటించడంతో పాటు రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి లోపాలు పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమ్మిడి అశోక్, వైయ‌స్ఆర్‌సీపీ అరకు వ్యాలీ మండల పార్టీ అధ్యక్షుడు స్వాభి రామ్మూర్తి, సుంకరమెట్ట గ్రామపంచాయతీ అధ్యక్షుడు కొర్ర అర్జున్ రావు, నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జ్ రామ్‌తో పాటు ఆసుపత్రి మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
 

Back to Top