ఏకసభ్య కమిషన్ ఏకపక్ష కమిషన్‌గా మారిపోయింది

చంద్రబాబుకు అనుకూలంగా దినేష్‌కుమార్ నివేదిక‌

టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి ఆక్షేప‌ణ 

తిరుపతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన వైయస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్‌ 
భూమన కరుణాకర్‌రెడ్డి

తిరుమ‌ల లడ్డూలో జంతుకొవ్వు కలవలేదని సీబీఐ సిట్‌ తేల్చింది

చంద్ర‌బాబు పన్నాగం పన్ని ఎలాగైనా తమను దోషులుగా నిలబెట్టాలనే ఏక‌స‌భ్య క‌మిష‌న్‌

దినేష్‌ కుమార్‌ అనే వ్యక్తికి టీటీడీ ఛైర్మన్‌ పదవి ఇస్తామని చంద్ర‌బాబు హామీ

అందుకే చంద్రబాబుకు అనుకూలంగా దినేశ్‌ కుమార్ నివేదిక ఇచ్చారు 

చంద్ర‌బాబు కంటే ముందుగానే ఎల్లోమీడియాకు నివేదిక అందింది

అందుకే రెండు రోజులుగా ఆంధ్ర‌జ్యోతి,ఈనాడు పేప‌ర్ల‌లో విరుద్ధ కథనాలు

అప్ప‌ట్లో టీటీడీ బోర్డుకు మేము ప్రత్యేక ఆహ్వానితులమే 

స్ప‌ ష్టం చేసిన భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి

సీబీఐ విచారణలో మా పాత్ర లేదని క్లారిటీ

దినేష్‌కుమార్ మ‌మ్మ‌ల్ని విచార‌ణ‌కు  పిలవకుండానే నివేదిక ఇచ్చారు

సీబీఐ-సిట్‌ కంటే ఏక‌స‌భ్య కమిషన్ గొప్పదా? 

ఇందాపూర్‌–హెరిటేజ్‌కు ఉన్న అక్రమ సంబంధం బయటపడుతుందనే చంద్ర‌బాబుకు భయం

డైవర్షన్‌ కోసమనే చంద్రబాబు ఈ ఏకపక్ష కమిషన్‌ నియమించారు 

అసలు విషయాన్ని పక్కననెట్టి మమ్మల్ని దోషులుగా చిత్రీకరించే ప్ర‌య‌త్నం

మాపై ఎన్ని కేసులైనా పెట్టండి భ‌య‌ప‌డేది లేదు

కూట‌మి ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించిన భూమ‌న‌

తిరుపతి: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏర్పాటు చేసిన దినేష్‌కుమార్ ఏకసభ్య కమిషన్‌..ఏక‌ప‌క్ష క‌మిష‌న్‌గా మారింద‌ని వైయ‌స్సార్‌సీపీ అధికార ప్ర‌తినిధి, టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి ఆక్షేపించారు. చంద్రబాబు చెప్పినట్టుగానే దినేష్‌కుమార్ తన నివేదికను తయారు చేశారని స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. చంద్రబాబు కంటే ముందే ఈ నివేదిక ఎల్లో మీడియాకు చేరిందన్నారు.  మమ్మల్ని విచారణకు పిలవకుండానే మాపై ఆరోప‌ణ‌లు చేస్తూ క‌థ‌నాలు రాయ‌డం ఏంట‌ని మండిప‌డ్డారు. మాపై బురదజల్లేందుకు, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఈ కమిషన్‌ను ఉపయోగిస్తున్నార‌ని తిరుప‌తిలో మీడియాతో మాట్లాడిన ఆయ‌న ప్ర‌భుత్వ తీరును త‌ప్పుప‌ట్టారు. ఇందాపూర్‌-హెరిటేజ్ డెయిరీ మ‌ధ్య ఉన్న అక్ర‌మ సంబంధం బ‌య‌ట‌ప‌డుతుంద‌నే భ‌యంతో చంద్ర‌బాబు డైవ‌ర్ష‌న్ కోసం ఏక‌స‌భ్య క‌మిష‌న్ ఏర్పాటు చేశార‌ని ధ్వ‌జ‌మెత్తారు.
ప్రెస్‌మీట్‌లో భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి ఇంకా ఏమ‌న్నారంటే..

- ఇది ఏక‌ప‌క్ష క‌మిష‌న్‌
తిరుమ‌ల ల‌డ్డూ క‌ల్తీ వ్య‌వ‌హారంపై సుప్రీం కోర్టునియ‌మించిన సీబీఐ-సిట్‌ దాదాపు ఏడాదిన్న‌ర‌ పైగా విచార‌ణ చేప‌ట్టింది. ల‌డ్డూ కల్తీ వ్యవహారంలో రాజకీయ నాయకుల ప్రమేయం లేదని సీబీఐ–సిట్ నివేదిక స్పష్టంగా తెలిపినా, చంద్రబాబు, పవన్‌లు వైయస్సార్‌సీపీ పాలనలో తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిపారనే ఆరోపణలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ దినేష్‌కుమార్‌తో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి, 45 రోజుల్లో నివేదిక ఇవ్వమని ఆదేశించి తరువాత కాలవ్యవధిని పొడిగించింది. అయితే ఈ కమిషన్ ఏకపక్షంగా మారి చంద్రబాబు పక్షాన నివేదిక ఇచ్చింది. కమిషన్ నివేదిక అధికారికంగా విడుదల కాక‌ ముందే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల చేతుల్లోకి వెళ్లి విభిన్న కథనాలు ప్రచారం చేస్తున్నాయి. ఒక పత్రికలో అనిల్ సింఘాల్, మరొకటిలో ధర్మారెడ్డి పేర్లు, తరువాత మా పేర్లను కూడా చేర్చడం అనుమానాస్పదం. దినేష్‌కుమార్ నివేదిక ప్రకారం నేను, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పర్చేజ్ కమిటీలో కేవలం ప్రత్యేక ఆహ్వానితులమే, పూర్తి స్థాయి సభ్యులు కాదు. అసలు సభ్యులైన మంత్రి కొలుసు పార్థసారధి, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిని సీబీఐ గంటల తరబడి విచారించగా, నన్ను మాత్రం 15 నిమిషాల్లోనే బ‌య‌ట‌కు పంపించి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి పంపించారు 

- దినేష్‌ కుమార్‌కు టీటీడీ ఛైర్మన్‌ పదవి ఆఫ‌ర్‌
దినేష్‌కుమార్‌ అనే వ్యక్తి ఇప్పటికే అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఐఏఎస్ అధికారిగా పేరుంది. గతంలో చంద్రబాబు హయాంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఆయనకు ఇప్పుడు టీటీడీ చైర్మన్ పదవి ఆశ చూపించి, ఏకసభ్య కమిషన్‌గా నియమించి, చంద్ర‌బాబు చెప్పినట్టుగా నివేదిక ఇప్పించారు. ఆయ‌న‌ రెండు నెలలు కొండపై విచారణ చేశామని చెబుతున్నారు… అయితే అనిల్‌కుమార్ సింఘాల్, ధర్మారెడ్డి వంటి వారిని పిలిచారా? నిందితులుగా పేర్కొంటున్న జగదీశ్వర్‌రెడ్డి, బాలాజీ, విజయభాస్కర్, సురేంద్రనాథ్‌లను విచారించారా? మమ్మల్ని ఎప్పుడైనా విచార‌ణ‌కు పిలిచారా? పిలవకుండానే మీ ఇష్టం వచ్చినట్లు నివేదిక ఎలా ఇస్తారు? ఏడాదిన్నర పాటు సీబీఐ–సిట్ అధికారులు ఎనిమిది రాష్ట్రాలు తిరిగి వందల మందిని విచారించి ఇచ్చిన నివేదిక కంటే మీ విచారణ గొప్పదా? సీబీఐ మమ్మల్ని ఎవరినీ దోషులుగా నిర్ధారించలేదు కాబట్టి, మమ్మల్ని దోషులుగా చూపించేందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేశారు.

- చాలెంజ్ చేస్తున్నాం… దమ్ముంటే కేసులు పెట్టండి?
దినేష్‌కుమార్ నివేదిక‌పై ఈనాడులో కథనం వచ్చిన వెంటనే టీటీడీ బోర్డు సభ్యులు హడావుడిగా మీడియా ముందుకు వచ్చి ఈ నెల 6న బోర్డు మీటింగ్‌లో తీర్మానం చేసి మాపై క్రిమినల్ కేసులు పెడతామని చెబుతున్నారు. చాలెంజ్ చేస్తున్నాం… దమ్ముంటే కేసులు పెట్టండి. అదే పత్రికలో నేను, భాస్కర్‌రెడ్డి ప్రత్యేక ఆహ్వానితులమేనని, చర్యలు బోర్డు నిర్ణయానికే వదిలేశారని రాశారు. అనిల్‌కుమార్ సింఘాల్‌పై ఎలాంటి చర్యలకు కమిషన్ ఆదేశించకపోయినా, ఆయన కింద ఉన్న సీఈవో బాలాజీ, ధర్మారెడ్డి, జగదీశ్వర్‌రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు సూచించడం ఆశ్చర్యకరం. ఇందులో ఉన్న మతలాబు ఆలోచించాలి. దినేష్‌కుమార్‌ను ఉద్దేశపూర్వకంగానే ఏకసభ్య కమిషన్‌గా నియమించారు. ఆయన బీఆర్ నాయుడు వ్యవహారాలపై, కొండపై రెండేళ్లుగా జరుగుతున్న అపచారాలపై విచారణ చేయాల్సింది. 

ఇందాపూర్ డెయిరీ–హెరిటేజ్ డెయిరీ సంబంధాలపై ఎందుకు విచారణ చేయలేదు? చంద్రబాబు హయాంలో రూ.321కి నెయ్యి సరఫరా చేసిన ఇందాపూర్, అదే హెరిటేజ్‌తో సంబంధం ఉన్న సంస్థ ఇప్పుడు రూ.658కి ఎలా సరఫరా చేస్తోంది? ఇందాపూర్–హెరిటేజ్ సంబంధం ఏమిటి? దీనిపై కూడా దినేష్‌కుమార్ విచారణ చేయాలి. అలాగే 2018లో చంద్రబాబు పాలనలోనే బోలేబాబాకు సంబంధించిన హర్ష్‌ప్రెష్ డెయిరీకి తలుపులు తెరిచి, ఆ సంస్థ నుంచి సుమారు 82 వేల కేజీల నెయ్యి సరఫరా జరిగిన విషయాన్ని ఎందుకు పట్టించుకోలేదు? 

-  ఒక్క కొత్త డెయిరీ అయినా వ‌చ్చిందా దినేష్‌కుమార్‌?
2019లో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కల్తీ నెయ్యికి తలుపులు తెరిచామని చెబుతున్నారు. అయితే నియమ నిబంధనలు సులభతరం చేసిన తరువాత ఒక్క కొత్త డెయిరీ కంపెనీ అయినా వచ్చిందో దినేష్‌కుమార్ చెప్పాలి. అంతకు ముందు కఠినతరం చేసినప్పుడే బోలేబాబా, హర్ష్‌ప్రెష్ డెయిరీలు వచ్చాయన్నది వాస్తవం కాదా? 2023లో నేను టీటీడీ చైర్మన్ అయిన తర్వాత మళ్లీ నిబంధనలు కఠినతరం చేసినప్పటికీ వైష్ణవి, ప్రీమియం, మావిగంగ డెయిరీలు టెండర్లలో పాల్గొన్నాయి కదా? మేం నిబంధనలు మార్చింది నాణ్యత తగ్గించడానికి కాదు, కేంద్ర ప్రభుత్వ స్టార్టప్ విధానం ప్రకారం స్థానిక డెయిరీలకు అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే. నాణ్యత ప్రమాణాలు తగ్గించామని మీరు ఎందుకు నిరూపించలేకపోతున్నారు? ఇప్పుడు మీరు చెబుతున్న ఆల్ఫా, ప్రీమియం డెయిరీలు 2014–2019 మధ్య 80 శాతానికి పైగా నెయ్యి సరఫరా చేశాయి. అలాగే ఇందాపూర్, ఆల్ఫా, బోలేబాబా డెయిరీలు టెండర్లలో పాల్గొన్నదీ నిజమే కాదా?.

- మా హ‌యాంలో 18 సార్లు వెన‌క్కి పంపించాం
చంద్రబాబు హయాంలోనే కల్తీ నెయ్యిని పట్టుకుని, అదే నెయ్యిని తిరిగి లడ్డూ తయారీలో వాడారని సీబీఐ చెప్పింది కాదా? మీరు వెనక్కి పంపిన అదే నెయ్యిని వైష్ణవి డెయిరీ ద్వారా తిరుమలకు పంపించి లడ్డూలు తయారు చేయించిందీ మీరే కాదా? జంతు కొవ్వు కలిసింద‌ని ప్రచారం చేసిన నెయ్యినే మీరు ఉపయోగించారు. మా హయాంలో బీటా సైటోస్టెరాల్ పరీక్షల్లో లోపాలు తేలితే 18 సార్లు నెయ్యిని వెనక్కి పంపించాం. మీ హయాంలో కూడా 14 సార్లు తిరస్కరించారనే విషయం వాస్తవమే కాదా? మేం ఎన్‌డీడీబీతో ఒప్పందం చేసుకుని ల్యాబ్‌లను ఆధునీకరించాం, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐతో కలిసి రూ.30 కోట్ల ల్యాబ్‌కు పునాదులు వేసింది కూడా మేమే. ఆ త‌రువాత మీరు దేవాన్ష్ పుట్టిన రోజున‌ ఓపెన్ చేశారు అంతే.

ఇందాపూర్–హెరిటేజ్ మధ్య ఉన్న సంబంధం ఏంటి?
బోలేబాబా, ఏఆర్ డెయిరీలు మీ హయాంలోనే టెండర్లలో పాల్గొన్నాయి, ఆల్ఫా డెయిరీ 2013–2019 వరకు కొనసాగింది; వైష్ణవి కూడా పాల్గొంది. మేం నిబంధనలు సులభతరం చేశామని చెబుతున్నారే—అయితే కొత్తగా వచ్చిన ఒక్క డెయిరీని చూపించండి. ఇందాపూర్–హెరిటేజ్ మధ్య ఉన్న సంబంధం బయటపడుతుందనే భయంతోనే జంతు కొవ్వు ఆరోపణలు చేశారా? ఈ విషయం సీబీఐ–సిట్ లేదా దినేష్‌కుమార్ విచారణలో ఎక్కడా తేలలేదు. అవసరమైతే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5లతో కలిసి త్రిసభ్య కమిషన్ వేయండి, మమ్మల్ని జైలుకు పంపిస్తామని చెప్పండి.

- డైవ‌ర్ష‌న్ కోస‌మే..
టీటీడీ బోర్డు సభ్యులు మాపై చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారు; దమ్ముంటే మీ ప్రభుత్వంలో ఉన్న పార్థసారధి, ప్రశాంతిరెడ్డిపై విచారణ చేసి చర్యలు తీసుకోండి—మేం కేవలం ప్రత్యేక ఆహ్వానితులమే. ఈ ఏకపక్ష కమిషన్ అసలు ఉద్దేశం డైవర్షన్ రాజకీయాలే. ఇందాపూర్–హెరిటేజ్ బంధాన్ని దాచడానికే ఇది. రూ.321 నుంచి రూ.658కు ధరలు ఎలా పెరిగాయి అన్నదానికి సమాధానం చెప్పాలి. 2018లోనే మీరు రూ.4.5 కోట్లకు ఫ్లేవర్ గీ కొనుగోలు చేశారు. మీ లడ్డూ నాణ్యమైనదైతే అది ఎందుకు?

సీబీఐ–సిట్ నివేదిక మాకు క్లీన్ చిట్ ఇచ్చింది కాబట్టి, ఎల్లో మీడియాలో విషప్రచారం చేయడానికి ఈ ఏకపక్ష కమిషన్‌ను ఏర్పాటు చేశారు. టీటీడీ చైర్మన్ పదవి ఆశతో కమిషన్ సభ్యుడు మీ మాట ప్రకారం నివేదిక ఇచ్చారని స్పష్టంగా కనిపిస్తోంది. అసలు విషయాన్ని పక్కనబెట్టి మమ్మల్ని దోషులుగా చూపిస్తూ ప్రజలను మభ్యపెట్టే డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు అని భూమన కరుణాకర్‌రెడ్డి ఆక్షేపించారు.

Back to Top