తాడేపల్లి : చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన ‘మెగా డీఎస్సీ’ వాస్తవానికి ‘మెగా స్కామ్’కు తెర లేపిందని మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. లక్షలాది నిరుద్యోగ యువత జీవితాలతో ఆడుకున్న ఈ నియామక ప్రక్రియలో భారీ అవకతవకలు, అవినీతి చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై స్వతంత్ర సంస్థ అయిన సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ఎక్స్ వేదికగా వైయస్ జగన్.. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత దారుణమైన నియామక ప్రక్రియ ఎప్పుడూ చూడలేదన్నారు. 16 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం చేపట్టిన డీఎస్సీ నియామకాల్లో పారదర్శకతకు రక్షణగా ఉన్న ప్రతి వ్యవస్థను బలహీనపరిచారని విమర్శించారు. ప్రశ్నాపత్రాల తయారీ నుంచే కుట్ర డీఎస్సీలో ప్రశ్నాపత్రాల రూపకల్పన బాధ్యతలు, పరీక్ష నిర్వహణ బాధ్యతలు సంప్రదాయంగా వేర్వేరు వ్యవస్థల వద్ద ఉండేవని జగన్ గుర్తుచేశారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఈ విధానాన్ని మార్చి రెండు కీలక బాధ్యతలనూ ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్ చేతుల్లో పెట్టిందన్నారు. దీంతో గోప్యత, పారదర్శకత దెబ్బతిని అవకతవకలకు మార్గం సుగమమైందని ఆరోపించారు. పేపర్ లీకేజీకి ప్రత్యక్ష నిదర్శనం అత్యంత గోప్యమైన ప్రశ్నాపత్రాల తయారీ, అప్‌లోడ్ పనులను అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు అప్పగించడం అనుమానాలకు తావిచ్చిందన్నారు. ప్రశ్నాపత్రాల ప్రక్రియతో సంబంధం ఉన్న ఓ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి డీఎస్సీలో తొలి ర్యాంకు సాధించడం పేపర్ లీకేజీకి ప్రత్యక్ష సాక్ష్యమని పేర్కొన్నారు. ఆ ఉద్యోగికి మొదటి ర్యాంకు వచ్చినప్పటికీ ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదని, అనంతరం అతని వివరాలను మెరిట్ జాబితా నుంచి ఎందుకు తొలగించారని, సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. ఈ అంశాలపై సంబంధిత అభ్యర్థి కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని గుర్తుచేశారు. ఫలితాల ప్రకటనలోనూ గందరగోళం డీఎస్సీ ఫలితాల ప్రకటనలో కూడా పూర్తిగా పారదర్శకత లోపించిందని జగన్ ఆరోపించారు. గతంలో కలెక్టరేట్ నోటీస్ బోర్డులపై మెరిట్ జాబితాలు, రోస్టర్ జాబితాలు ప్రదర్శించేవారని, కానీ ఈసారి మొత్తం ప్రక్రియను ఆన్‌లైన్‌కే పరిమితం చేశారని విమర్శించారు. సర్టిఫికెట్లు ధ్రువీకరించించుకున్న అనేక మంది అభ్యర్థుల పేర్లు తుది ఎంపిక జాబితాలో కనిపించకపోవడం తీవ్ర అనుమానాలకు తావిస్తోందన్నారు. ఎంపిక నిబంధనల ప్రకారం అలా జరగకూడదని పేర్కొన్నారు. స్పోర్ట్స్ కోటాలో ‘పాలసీ బ్లూప్రింట్ ఫర్ స్కామ్’ ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత అనుమానాస్పద అంశం స్పోర్ట్స్ కోటా వ్యవహారమేనని జగన్ ఆరోపించారు. గతంలో స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు కూడా డీఎస్సీ పరీక్షలో అర్హత సాధించాల్సి ఉండేదని, అయితే కొత్త జీవోలను తీసుకువచ్చి వారికి పరీక్ష నుంచి మినహాయింపు కల్పించారని తెలిపారు. నియామక ప్రక్రియ పూర్తయిన వెంటనే మళ్లీ పాత విధానాన్నే పునరుద్ధరించడం ద్వారా ప్రభుత్వం తన ఉద్దేశాన్ని తానే బయటపెట్టుకుందని విమర్శించారు. ఈ విధాన మార్పుల వల్ల అనేక ఫిర్యాదులు, అభ్యంతరాలు వచ్చాయని ప్రభుత్వం స్వయంగా అంగీకరించిందని పేర్కొన్నారు. టీచర్ పోస్టుల కోసం బేరసారాల వీడియోలు టీచర్ పోస్టుల కోసం డబ్బుల బేరసారాలు జరుగుతున్నట్లు బయటకు వచ్చిన వీడియోలు రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయని జగన్ అన్నారు. ఈ వ్యవహారంలో పోలీసులు నామమాత్రపు కేసు నమోదు చేసి, నిందితులకు స్టేషన్ బెయిల్ ఇవ్వడం తప్ప లోతైన దర్యాప్తు చేపట్టలేదని విమర్శించారు. సీబీఐ విచారణ తప్పనిసరి డీఎస్సీ కుంభకోణం బహుళస్థాయిల్లో జరిగిందని, దీనికి రాష్ట్రంలోని అత్యున్నత స్థాయి పాలకులు బాధ్యత వహించాలని జగన్ ఆరోపించారు. రాష్ట్ర దర్యాప్తు సంస్థలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నందున నిజాలు వెలికితీయాలంటే స్వతంత్ర సంస్థ అయిన సీబీఐతో విచారణ జరిపించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. లక్షలాది మంది నిరుద్యోగ యువత ఆశలను వమ్ము చేసిన ఈ ‘మెగా డీఎస్సీ’ వ్యవహారంలో పూర్తి నిజాలు బయటపడాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జగన్ కోరారు.