ఆడబిడ్డ నిధి అమలు చేయకుండా మోసం 

సూపర్ సిక్స్ కాదు.. సూపర్ మాయ

ప్రతి ఆడబిడ్డ ఆడపులిలా మారే రోజు దగ్గర్లోనే ఉంది

కూట‌మి ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించిన మాజీ మంత్రి విడదల రజిని

తాడేపల్లి: ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన ‘ఆడబిడ్డ నిధి’ హామీని అమలు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం మహిళలను నిలువునా మోసం చేసిందని మాజీ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పడం దుర్మార్గమని విమర్శించారు.
తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆమె, ఆడబిడ్డ నిధి అమలు చేయలేమని రెండేళ్ల తర్వాత చెప్పడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. హామీ ఇచ్చేటప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా అని ప్రశ్నించారు. ఇప్పుడు రాష్ట్రాన్ని అమ్మేసినా ఆడబిడ్డ నిధి అమలు చేయలేమని చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని అన్నారు.

చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మరచిపోయారని, రెండు సంవత్సరాల తర్వాత హెలికాప్టర్‌లో మేనిఫెస్టో చదివానని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. ఇప్పటివరకు ఇచ్చిన హామీలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ‘సూపర్ సిక్స్’ పేరుతో ప్రజలను ఆకర్షించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు వాటి అమలుకు దూరంగా పారిపోతోందని ఆరోపించారు. అది సూపర్ సిక్స్ కాదని, ‘సూపర్ మాయ’ అని ఎద్దేవా చేశారు.

మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్  తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేశారని, అందుకే మహిళలు మళ్లీ జగన్ పాలన కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. సంక్షేమానికి జగన్ ఐకాన్ అయితే, వెన్నుపోటుకు చంద్రబాబు ఐకాన్‌గా నిలిచారని విమర్శించారు. తిరుపతి సభలో మహిళలకు ఇచ్చిన హామీలపై సమాధానం చెప్పకుండా చంద్రబాబు సెల్ఫీ డబ్బా కొట్టుకున్నారని రజిని వ్యాఖ్యానించారు. సంపద సృష్టిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు సంక్షేమ పథకాలను అమలు చేయలేమని చెప్పడం ప్రజలను మభ్యపెట్టడమేనన్నారు.

మహిళలను మోసం చేసిన నారా కుటుంబానికి త్వరలోనే నారీశక్తి తన సమాధానం చెబుతుందని హెచ్చరించారు. ప్రతి ఆడబిడ్డ ఆడపులిలా మారే రోజు దగ్గర్లోనే ఉందని పేర్కొన్నారు. అన్ని వర్గాలను దగా చేసిన ఘనత చంద్రబాబుదేనని, మహిళలు, యువత, రైతులు, ఉద్యోగులు సహా ప్రతి వర్గం కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉందని విడదల రజిని అన్నారు.
 

Back to Top