పల్నాడు జిల్లా : కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం బదులు రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతుందని మాజీ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. రెండేళ్లలో రెడ్‌బుక్ హోర్డింగ్స్.. బ్లడ్‌బుక్‌గా మారాయని ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు పోలీసులను అడ్డుపెట్టుకుంటున్నారని ఫైర్ అయ్యారు. హైకోర్టు ఆదేశాల మేరకు చిలకలూరిపేట పోలీస్ స్టేషన్‌కు హాజరైన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. మీడియాతో విడదల రజిని ఏమన్నారంటే.. - రెడ్‌బుక్ ..బ్లడ్ బుక్‌గా మారింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. హైకోర్టు ఆదేశాలతోనే నేను పోలీస్ స్టేషన్‌కు వచ్చాను. రాష్ట్రంలో ‘రెడ్ బుక్’ పేరుతో ప్రారంభించిన వ్యవస్థ ఇప్పుడు ‘బ్లడ్ బుక్’గా మారింది. సామాన్యులు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. - అందరూ రెడ్‌బుక్ బాధితులే రాష్ట్రంలో హత్యలు, హత్యాయత్నాలు పెరిగిపోయాయి. 70కి పైగా జర్నలిస్టులపై కేసులు పెట్టారు. మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్ అధికారులు కూడా ఈ రెడ్ బుక్ నుంచి తప్పించుకోలేకపోయారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రషీద్, మందా సాల్మన్‌ను హత్య చేశారు. పోలీసులు మాత్రం వైయస్సార్‌సీపీ కార్యకర్తలపైనే దృష్టి పెట్టారు. అందుకే పోలీస్ శాఖ ర్యాంకు పడిపోయింది. - ప్రజల తరఫున పోరాడకూడదా? చిలకలూరిపేట నియోజకవర్గంలో నేను యాక్టివ్‌గా ఉంటే ఇక్కడి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల తరపున పోరాడకూడదా? విద్యుత్ ఛార్జీలు తగ్గించమని నిరసన ర్యాలీ చేస్తే నాపై కేసులు పెడుతున్నారు. గుడికి వెళ్లి వస్తున్న సమయంలో నాపై దాడి చేసి, తిరిగి నాపైనే కేసు కట్టారు. కట్టుకథలు అల్లుతూ అక్రమ కేసులు పెడుతున్నారు. ప్రతిపక్ష గొంతు వినిపించకుండా చేయాలనే కుట్ర ఇది. కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత దోపిడీ చేస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మేము ఆందోళనలు కొనసాగిస్తాం. మీ అక్రమ కేసులకు మేము భయపడము. మేము అధికారంలో ఉన్నప్పుడు కేసులు పెట్టాలనుకుంటే ఎన్ని కేసులు పెట్టేవాళ్లమో మీ ఊహకే వదిలేస్తున్నాను. కానీ మేము ‘సత్యమేవ జయతే’ని నమ్ముతున్నాం. మీరు నాటిన విష విత్తనం వృక్షమైతే పరిస్థితులు ఎలా ఉంటాయో ఆలోచించుకోండి అంటూ రజిని హెచ్చరించారు.