పబ్లిసిటీ ఫుల్.. పనితనం నిల్

అమరావతి అద్దాల పేరుతో వేల కోట్ల దోపిడీకి తెర

ప్రభుత్వ దోపిడీపై  మాజీ మంత్రి విడదల రజిని ధ్వజం

తాడేపల్లి వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి విడదల రజిని.

పబ్లిసిటీ ఫుల్.. పనితనం నిల్ 

ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదు.. పైగా 6 లక్షల పెన్షన్లు కోత!

అమరావతి అద్దాలకే రూ. 2,500 కోట్లా? ఇది దోపిడీ కాదా?

ఆరోగ్యశ్రీని తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్న ఏకైక ప్రభుత్వం ఇదే.

వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రస్ తెలుగుదేశం.

రెండేళ్ల కూటమి పాలనపై విడదల రజిని ఫైర్

తాడేపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా, ఒక్కహామీని నెరవేర్చకుండానే కేవలం ప్రచార ఆర్భాటాలతోనే కాలం గడుపుతోందని వైయ‌స్ఆర్‌సీపీ మాజీ మంత్రి విడదల రజిని విమర్శించారు. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఒకటో తేదీ వస్తే చాలు ఏదో ఒక గ్రామంలో స్కిట్లు వేస్తూ, సెట్టింగ్స్ ఏర్పాటు చేసి పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు చంద్రబాబు ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని ఎద్దేవా చేశారు. వైయస్.జగన్ ప్రభుత్వ హత హయాంలో ఇచ్చిన 66.35 లక్షల పెన్షన్లలో 6 లక్షల పెన్షన్లను కట్ చేసి, ఇప్పటి వరకు ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వని అసమర్థ ప్రభుత్వం కూటమిదేనని మండిపడ్డారు.

అమరావతిని తన స్వప్రయోజనాల కోసం ఒక 'అవినీతి కేంద్రం'గా మార్చిన చంద్రబాబు, అక్కడ భవనాల అద్దాల కోసం ఏకంగా రూ. 2,500 కోట్లు ఖర్చు చేయడంపై విడదల రజిని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే నిధులు ప్రజల ఆరోగ్యం, విద్య కోసం వెచ్చిస్తే పేదలకు మేలు జరిగేదని, కానీ చంద్రబాబుకు ప్రజల కష్టాల కంటే అమరావతి కాంట్రాక్టుల మీదనే ప్రేమ ఎక్కువ అని విమర్శించారు. ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేసి, ఆసుపత్రులను తాకట్టు పెట్టి అప్పులు చేస్తున్నారని దుయ్యబట్టారు. వైయ‌స్ఆర్‌సీపీని 'గొడ్డలి పార్టీ' అని విమర్శించే టీడీపీకి, వెన్నుపోటు పొడిచిన చరిత్ర తప్ప మరొకటి లేదని, త్వరలోనే ప్రజలు ఈ అరాచక పాలనకు చరమగీతం పాడతారని ఆమె హెచ్చరించారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే.. 

ప్రచార ఆర్భాటం - అమలులో శూన్యం
కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా, కేవలం పబ్లిసిటీ స్టంట్లు తప్ప ఒక్క పథకమూ సక్రమంగా అమలు చేయలేదు సరికదా... ఒక్క కొత్త పెన్షన్ సైతం మంజూరు చేయలేదు. 
ప్రతి నెలా ఒకటో తేదీన ఏదో ఒక గ్రామంలో సెట్టింగ్స్ వేసి, పెన్షన్లు ఇస్తున్నట్లు షూటింగ్‌లు చేయడం చంద్రబాబు మార్క్ డ్రామాలకు నిదర్శనం. వైయస్ జగన్ హయాంలో మంజూరైన 66.35 లక్షల పెన్షన్లలో, ఇప్పటివరకు ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వకపోగా.. ఏకంగా 6 లక్షల పెన్షన్లను తొలగించి పేదల కడుపు కొట్టారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ అనే సూపర్ సిక్స్ హామీ పూర్తిగా గాలికివదిలేసింది. 

అమరావతి పేరుతో 'అద్దాల' దోపిడీ..

రాజధాని నిర్మాణాన్ని చంద్రబాబు తన సంపద సృష్టించుకునే 'అవినీతి కేంద్రం'గా మార్చేశారు. అసెంబ్లీ భవనాల అద్దాల కోసం రూ. 2,500 కోట్లు ఖర్చు చేయడం, చదరపు అడుగుకు రూ. 18,500 వరకు వృధా చేయడం ఏ రకమైన పాలన. దేశ రాజధాని ఢిల్లీలో సైతం ఇంత భారీ నిర్మాణ వ్యయం లేదు.   కేవలం అద్దాలకే రూ.2500 ఖర్చు పెడతామంటున్నారు. మీకు ఇంత భారీ మెజార్టీ ఇచ్చిన ప్రజల గురించి మీరు నిజంగా ఆలోచన చేస్తే.. ఏడాదికి రూ.1000 కోట్ల చొప్పున ఖర్చు పెడితే మా నాయకుడు వైయస్.జగన్ ప్రారంభించిన 17 మెడికల్ కాలేజీలు పూర్తయ్యేవి. అందులో ఇప్పటికే 6 కాలేజీలు మా హయాంలో ప్రారంభమయ్యాయి. మిగిలిన వాటిని పూర్తి చేయాలన్న ఆలోచన మీకు ఎందుకు రావడం లేదు చంద్రబాబూ? ఇవాళ ఏ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లినా సూదీ లేదూ, దూదీ లేదు. మందులు అసలే లేవు. చివరకు లైట్లు కూడా లేని దుస్థితి. నాడు నేడు పనులకు నోచుకోక స్కూల్లు అధ్వాన్నంగా తయారయ్యాయి. వాటి అభివృద్ధికి వాడుకోవచ్చు. 
మరోవైపు రైతులు పరిస్ధితి మరింత అధ్వాన్నంగా ఉంది. గిట్టుబాటు ధరలేక మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారికి న్యాయం చేయవచ్చు. ఇవన్నీ మీకు ఎందుకు కనిపించడం లేదు చంద్రబాబు గారూ? వీటిని కాదని మీ ఆర్భాటం గురించి మాత్రమే ఎందుకు ఆలోచన చేస్తున్నారు. ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయడం లేదు. వారి పట్ల మీకు చిత్తశుద్ధి లేదు.

ఆరోగ్యశ్రీని తాకట్టు పెట్టిన కూటమి సర్కార్..

లక్షలాది మందికి ప్రాణదానం చేసిన ఆరోగ్యశ్రీ పథకాన్ని చంద్రబాబు పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఆసుపత్రుల్లో మందులు, సూది, దూది కూడా లేని దౌర్భాగ్య స్థితి నెలకొంది.  నెట్‌వర్క్ ఆసుపత్రులను తాకట్టు పెట్టి అప్పులు తేవడం ప్రభుత్వ అసమర్థతకు పరాకాష్. ఆరోగ్యశ్రీకి రూ. 4 వేల కోట్ల బకాయిలు పెట్టి, ప్రజలను వైద్యానికి దూరం చేస్తున్నారు. వైయస్.జగన్ హయాంలో ఆరోగ్యశ్రీని దాదాపు 3300 ప్రోసీజర్స్ వరకు పెంచి ఏ పేదవాడికి కష్టం రాకుండా చేశారు. మరోవైపు ఆరోగ్యఆసరాతో పాటు రూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పరిధిని పెంచితే దాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా భ్రష్టపట్టిస్తోంది. ఇలాంటి కూటమి ప్రభుత్వం, ఇలాంటి చంద్రబాబు అధికారంలోకి రావడం తమ దౌర్భగ్యామని ప్రజలు భావిస్తున్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలకు హక్కుగా వారికి రావాల్సిన పధకాలను అందక ఆవేదనను ఓటు రూపంలో చంద్రబాబుకి చూపించాలని నిర్ణయించుకున్నారు. ఆడబిడ్డ నిధితో  మహిళలను, నిరుద్యోగభృతి పేరుతో నిరుద్యోగులను, రైతులను ఇలా అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ కాలయాపన చేస్తున్నారు.

వెన్నుపోటు పార్టీదే గొడ్డలి రాజకీయాలు..
వైయ‌స్ఆర్‌సీపీని 'గొడ్డలి పార్టీ' అని విమర్శించే నైతిక హక్కు టీడీపీకి లేదు. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుది. వంగవీటి రంగా హత్య మొదలుకుని రాష్ట్రంలో జరిగిన అనేక హత్యారాజకీయాలకు టీడీపీయే కేంద్రం. ప్రజలకు మేలు చేసిన  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గొడ్డలి పార్టీ అని చెప్పడం విడ్డూరం. కేవలం ప్రజల దృష్టిని మరల్చడానికి టీడీపీ ఈ రకమైన ప్రచారం చేస్తోంది. 

ప్రజల తీర్పు తప్పదు..
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లు విలాసవంతమైన స్పెషల్ ప్లైట్లు, హెలికాప్టర్లలో తిరుగుతూ ప్రజల సొమ్మును ఆవిరి చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఇందుకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి ఇలా ప్రతి హామీని గాలికి వదిలేసిన ఈ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. 

చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా తన పబ్లిసిటీ పిచ్చిని, అడ్డగోలు దోపిడీని మానుకోవాలని విడదల రజిని హితవు పలికారు. అమరావతి అద్దాల మీద ఉన్న ప్రేమను, కనీసం ఆసుపత్రుల్లో మందులు లేని దయనీయ స్థితి మీద చూపిస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు. ప్రజలు వాస్తవాలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో మీరు చేస్తున్న అరాచకాలకు, అవినీతికి ఓటు రూపంలో తప్పకుండా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. వెన్నుపోటు రాజకీయాలతో పార్టీని నడిపిన మీరు, ప్రజాసేవ చేసిన పార్టీని 'గొడ్డలి పార్టీ' అని విమర్శించడం హాస్యాస్పదమని, మీ దోపిడీని ఎండగట్టే బాధ్యత వైయ‌స్ఆర్‌సీపీపై ఉందని, దీనికోసం ఎంతటి పోరాటానికైనా వెనకాడమని ఆమె స్పష్టం చేశారు.

Back to Top