అమ‌రావ‌తిలో ప్ర‌పంచ స్థాయి అవినీతి

సెక్ర‌టేరియ‌ట్‌, సీఎంవో భ‌వ‌న నిర్మాణాల్లో త‌వ్వే కొద్దీ దోపిడీ

చ‌ద‌రపు అడుగు నిర్మాణానికి చేస్తున్న ఖ‌ర్చు రూ. 20,439

లెక్క‌ల‌తో చంద్ర‌బాబు అవినీతి చిట్టా విప్పిన మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి  

నెల్లూరులోని పార్టీ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన నెల్లూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు, మాజీ మంత్రి 
కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి 

సెక్ర‌టేరియ‌ట్ నిర్మాణానికి చంద్రబాబు పెట్టే ఖ‌ర్చుతో 10 పార్ల‌మెంట్ భ‌వ‌నాలు కట్టొచ్చు

అదే ఖ‌ర్చుతో కేసీఆర్ తెలంగాణ‌లో నిర్మించిన 16 సెక్ర‌టేరియ‌ట్‌లు క‌ట్టొచ్చు

చంద్ర‌బాబు దోపిడీకి నిలువెత్తు సాక్ష్యం అమ‌రావ‌తి

చంద్ర‌బాబుకి ఏటీఎంలా నాడు పోల‌వ‌రం, నేడు అమ‌రావ‌తి 

2017-18కి ఇప్ప‌టికీ రెండింత‌లు పెరిగిన నిర్మాణ వ్య‌యం

అవినీతి సంపాద‌న‌లో చంద్ర‌బాబు మాస్ట‌ర్ మైండ్‌

రాష్ట్ర సంప‌ద‌ను గునపాల‌తో త‌వ్వి దోచేస్తున్నాడు  

తెలుగుదేశం పార్టీని గునపం పార్టీ అన‌డంలో త‌ప్పు లేదు 

నెల్లూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ  అధ్య‌క్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి ధ్వ‌జం

నెల్లూరు: అమ‌రావ‌తి రాజ‌ధానిని సీఎం చంద్రబాబు ప్ర‌పంచ స్థాయి అవినీతికి కేరాఫ్‌గా మార్చేశాడ‌ని, సీఎంవో, హెచ్‌వోడీ భ‌వ‌నాలు, సెక్ర‌టేరియ‌ట్ నిర్మాణాల ముసుగులో జ‌రుగుతున్న అవినీతే దానికి నిలువెత్తు సాక్ష్య‌మ‌ని నెల్లూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి వెల్ల‌డించారు. ప్ర‌పంచంలో ఎక్కడా లేనివిధంగా చ‌ద‌ర‌పు అడుగు నిర్మాణానికి రూ. 20,439లు ఖర్చు చేయ‌డం చూస్తుంటే ఎవ‌రికైనా ఒళ్లు గ‌గుర్పొడుస్తాయ‌ని అన్నారు. ఆ మూడు భ‌వ‌నాల‌కు 2017-18 మ‌ధ్య రూ. 2271 కోట్లకు అప్ప‌గించిన చంద్ర‌బాబు, ఇప్పుడు అవే ప‌నుల‌ను అవే సంస్థ‌ల‌కు ఏకంగా రూ. 2083 కోట్లు అద‌నంగా చెల్లించి రూ. 4354.43 కోట్ల‌కు అప్ప‌జెప్పాడని చెప్పారు. ఇది చాల‌ద‌న్న‌ట్టు స‌చివాలయాల‌కు అద్దాలు బిగించ‌డానికి మ‌రో రూ.2540 కోట్లు, ప్లంబింగ్, ఫైర్ ప్రొటెక్ష‌న్‌, ఎల‌క్ట్రిక‌ల్‌ వైరింగ్ త‌దిత‌ర ప‌నుల కోసం రూ. 2316 కోట్ల‌కు, రోడ్లు, డ్రైనేజీల కోసం రూ.1057 కోట్లు టెండ‌ర్లు పిలిచారని వివ‌రించారు. ఇదంతా చూశాక అవినీతిలో చంద్ర‌బాబుని మించిన మాస్ట‌ర్ మైండ్ ఎవ‌రైనా ఉంటారా? అని ప్ర‌శ్నించారు. రాష్ట్ర సంప‌ద‌ను గునపాల‌తో త‌వ్వి దోచేస్తున్న 
తెలుగుదేశం పార్టీని గునపం పార్టీ అన‌డంలో త‌ప్పు లేదని మండిప‌డ్డారు. 
ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే...  

పార్టీల‌ను, ప్ర‌జ‌ల‌ను గున‌పాల‌తో కుళ్ల‌బొడిచాడు
ఎన్నిక‌ల్లో ఇబ్బ‌డిముబ్బ‌డిగా హామీలిచ్చి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌జ‌ల‌ను గున‌పంతో పొడిచిన‌ట్టుగా పొడిచి మోసం చేసినందుకు టీడీపీని గునపం పార్టీ అన‌కూడ‌దా? పిల్ల‌నిచ్చిన మామ ద‌గ్గ‌ర నుంచి అధికారం కోసం పొత్తులు పెట్టుకున్న పార్టీ బీజేపీ, కాంగ్రెస్, జ‌న‌సేన‌, క‌మ్యూనిస్ట్  పార్టీల‌ను గునపంతో పొడిచ‌న‌ట్టు పొడిచేశాడు. ఆఖ‌రుకి రాష్ట్ర ఖ‌జానాను కూడా గునపంతో త‌వ్వి దోచేస్తున్నాడు. అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణం పేరుతో వేల కోట్లు త‌వ్వి త‌ర‌లించుకుపోతున్నారు. గున‌పాల‌తో త‌వ్వి త‌ర‌లించుక‌పోవ‌డ‌మే చంద్ర‌బాబు చెప్పే విజ‌న‌రీ పాల‌న‌. అమ‌రావ‌తి నిర్మాణాల‌ను గున‌పాలతో త‌వ్వుతుంటే చంద్ర‌బాబు అవినీతి బాగోతాలు ఒళ్లు గ‌గుర్పొడిచేలా ఉన్నాయి. 

అవే కాంట్రాక్టులు, అవే సంస్థ‌లు.. కానీ,

అమ‌రావ‌తి స‌చివాల‌య శాశ్వ‌త నిర్మాణానికి చ‌ద‌ర‌పు అడుగుకు రూ. 18,413లకు కాంట్రాక్టులు క‌ట్ట‌బెట్టాడు. ప్రాథ‌మిక మౌలిక స‌దుపాయాలు కూడా క‌లుపుకొంటే చ‌ద‌ర‌పు అడుగుకి అయ్యే ఖ‌ర్చు రూ. 20,439లు. గ‌తంలో 2014-19 మ‌ధ్య ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు షాపూర్ జీ ప‌ల్లోంజీ, ఎల్ అండ్‌టీ సంస్థ‌ల‌కు కాంట్రాక్టులు క‌ట్టబెట్టాడు. ఇప్పుడు మ‌ళ్లీ అవే సంస్థ‌ల‌కు కాంట్రాక్టులు క‌ట్ట‌బెట్టాడు. 2017-18 లో బేస్‌మెంట్‌, గ్రౌండ్ ఫ్లోర్‌, 49 అంతస్థుల‌తో కూడిన సీఎంవో, హెచ్ఓడీ బిల్డింగుల నిర్మాణాల‌ను ఎన్‌సీసీ సంస్థ‌కు రూ. 544 కోట్ల‌కు క‌ట్ట‌బెట్టిన చంద్ర‌బాబు 2026కి వ‌చ్చేస‌రికి దాన్ని ఏకంగా రూ. 844.22 కోట్లకు టెండ‌ర్లు పిలిచి రూ. 884 కోట్ల‌కు నిర్ధారించి దానికి అద‌నంగా మ‌రో రూ.120 కోట్ల విలువైన జీఎస్టీ, సీవ‌రేజీ వంటి ట్యాక్సులు వంటి రీయింబ‌ర్స్ చేస్తామ‌ని హామీ ఇచ్చారు. దీంతో 2017-18లో రూ.544 కోట్ల‌కు క‌ట్ట‌బెట్టిన టెండ‌ర్ల‌ను ఇప్పుడు ఏకంగా రూ. 492 కోట్లు పెంచి రూ. 1046.07 కోట్ల‌కు అప్ప‌జెప్పాడు. 

అవే ప‌నులు.. అంచ‌నాలు డ‌బుల్ 
బేస్‌మెంట్‌, గ్రౌండ్ ఫ్లోర్‌, 39 అంతస్థుల‌తో కూడిన సెక్ర‌టేరియ‌ట్ ట‌వ‌ర్లు 1,2 నిర్మాణం కోసం 2017-18లో రూ. 932.46 కోట్ల‌కు టెండ‌ర్లు పిలిస్తే ఇప్పుడు ఏకంగా దాన్ని రెండింత‌ల‌కు పెంచేసి రూ. 1762 కోట్లకు అప్ప‌జెప్పేశాడు. అంటే, ఈ రెండు ట‌వ‌ర్ల నిర్మాణం కోసం రూ. 830.35 కోట్లను షాపూర్‌జీ ప‌ల్లోంజీ సంస్థ‌కు ఇప్పుడు అద‌నంగా చెల్లిస్తున్నాడు. దీంతోపాటు బేస్‌మెంట్‌, గ్రౌండ్ ఫ్లోర్‌, 39 అంతస్థుల‌తో కూడిన సెక్ర‌టేరియ‌ట్ ట‌వ‌ర్లు 3, 4 నిర్మాణం కోసం 2017-18లో ఎల్ అండ్ టీ సంస్థ‌కు రూ. 784.62 కోట్ల‌కు కాంట్రాక్టు ఇచ్చాడు. ఇప్పుడు కూడా అదే సంస్థ‌కు రూ. 1545 కోట్ల‌కు పెంచి ప‌నులు అప్పజెప్పాడు. ఏకంగా రూ. 760 కోట్ల‌ను దోచిపెడుతున్నాడు. మొత్తంగా ఈ మూడు వ‌ర్కుల‌ను 2017-18 మ‌ధ్య రూ. 2271 కోట్లకు అప్ప‌గించిన చంద్ర‌బాబు, ఇప్పుడు అవే ప‌నుల‌ను అవే సంస్థ‌ల‌కు ఏకంగా రూ. 2083 కోట్లు అద‌నంగా చెల్లించి రూ. 4354.43 కోట్ల‌కు అప్ప‌జెప్పాడు. ఇంకోప‌క్క ఇసుక ఉచితంగా అందిస్తూనే కాంట్రాక్టు విలువ‌లు ఇంత భారీగా పెంచ‌డం అవినీతి కాదా? ఇది చాల‌ద‌న్న‌ట్టు స‌చివాలయాల‌కు అద్దాలు బిగించ‌డానికి మ‌రో రూ.2540 కోట్లకు టెండ‌ర్లు పిలిచాడు. ప్లంబింగ్, ఫైర్ ప్రొటెక్ష‌న్‌, వైరింగ్ త‌దిత‌ర ప‌నుల కోసం మ‌రో రూ. 2316 కోట్ల‌కు, రోడ్లు, డ్రైనేజీల కోసం రూ.1057 కోట్లు టెండ‌ర్లు పిలిచారు. అవినీతిలో చంద్ర‌బాబుని మించిన మాస్ట‌ర్ మైండ్ ఎవ‌రైనా ఉంటారా?  

చంద్ర‌బాబుకి ఏటీఎంలా నాడు పోల‌వ‌రం, ఇప్పుడు అమ‌రావ‌తి 
తెలంగాణ‌లో కేసీఆర్ రూ. 600 కోట్ల‌తో అద్భుతంగా స‌చివాల‌యం క‌ట్టాడు. ప్ర‌ధాని మోడీ ప్ర‌పంచ‌స్థాయి పార్లమెంట్‌ను రూ. 900 కోట్ల‌తో పూర్తి చేశాడు. ఈ లెక్క‌న చంద్ర‌బాబు క‌డుతున్న ఒక్క స‌చివాలయంకి అయ్యే ఖ‌ర్చుతో కేసీఆర్ తెలంగాణలో క‌ట్టిన లాంటివి 16 సచివాల‌యాలు క‌ట్టొచ్చు. ప్ర‌ధాని మోడీ క‌ట్టిన పార్లమెంట్ లాంటివి 10 భ‌వ‌నాలు క‌ట్టొచ్చు. ఈ విధంగా ప్ర‌జాధనాన్ని చంద్ర‌బాబు లూఠీ చేస్తున్నాడు. ఇంత అవినీతి బాగోతం పెట్టుకుని, మేం తెచ్చిన అదానీ డేటా సెంట‌ర్‌కి పేరు మార్చి గూగుల్ డేటా సెంట‌ర్ అని ప్రచారం చేసుకుంటూ.. జీ అంటే గూగుల్‌, వైయ‌స్ఆర్‌సీపీ కి జీ అంటే గొడ్డ‌లి అని లోకేష్ మాట్లాడ‌టం హేయం. నిజానికి టీడీపీకి సంబంధించ‌ జీ అంటే గున‌పం పార్టీ అని ఇప్ప‌టికైనా ఒప్పుకోవాలి. వైయ‌స్ జ‌గ‌న్ గారిలా ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాలు అందించాలంటే తండ్రీకొడుకులు వంద జ‌న్మ‌నెత్తాలి. గ‌తంలో పోల‌వ‌రం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకున్నారు. ఇప్పుడు అమ‌రావ‌తి నిర్మాణం పేరుతో వేల కోట్లు దోచుకుంటున్నారు. రాష్ట్ర ఖ‌జానాను గున‌పాల‌తో తవ్వి దోచుకుని పోతున్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు, మ‌హిళ‌లు, రైతులు, ఉద్యోగులు, కార్మికుల సంక్షేమాన్ని గాలికొదిలేసి దొరికినకాడికి గున‌పాల‌తో త‌వ్వి దోచేస్తున్నారు. ఇలాంటి తెలుగుదేశం పార్టీకి వైయ‌స్ఆర్‌సీపీ గురించి, వైయ‌స్ జ‌గన్ గురించి మాట్లాడే అర్హ‌త లేదు. ఇంత భారీ అవినీతి చేస్తున్నారు కాబ‌ట్టే వైయ‌స్ జ‌గ‌న్ గారు మావిగ‌న్ ప్ర‌తిపాద‌న తెచ్చారు. దాన్ని త‌ట్టుకోలేక వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల మీద బుర‌ద‌జ‌ల్లుతున్నారు. 

తెలుగుదేశం పార్టీ సింబ‌ల్ గున‌పంగా మ‌ర్చుకోవాలి
ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి ఆయ‌న పెట్టిన పార్టీని లాక్కున్న చంద్ర‌బాబుకి ఆయ‌న మొద‌లుపెట్టిన మహానాడు నిర్వ‌హించే అర్హ‌తే లేదు. నెల్లూరులో మ‌హానాడు పేరుతో ఎంత హ‌డావుడి చేసినా ఏం ప్ర‌యోజ‌నం ఉండ‌దు. రాబోయే ఎన్నిక‌ల్లో నెల్లూరులో ప‌దికి ప‌ది సీట్లు వైయ‌స్ఆర్‌సీపీ గెల‌వ‌డం ఖాయం. సూప‌ర్ సిక్స్ హామీలు అమ‌లు చేయ‌ని చంద్ర‌బాబుని ప్ర‌జ‌లు చీకొడుతున్నారు. హ‌త్యారాజ‌కీయాల‌కు చంద్ర‌బాబు బ్రాండ్ అంబాసిడ‌ర్ అనేది రాష్ట్రంలో చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. అమ‌రావ‌తికి భూములిచ్చిన రైతుల‌ను ఆదుకోకుండా వారికి డెవ‌ల‌ప్ చేసిన ప్లాట్లు ఇవ్వ‌కుండా సొంత అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడంలోనే చంద్ర‌బాబు బిజీగా ఉన్నాడు. ఆ పార్టీ సింబ‌ల్‌ను గున‌పంగా మార్చుకుంటే మంచిది.

Back to Top