పార్వతీపురం మన్యం: మహిళలను కించపరిచన ఏబీఎన్ రాధాకృష్ణపై ఇప్పటికే ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై వైయస్ఆర్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రెండు ప్రాంతాల్లో పోలీస్ అధికారులను కలిసి వినతిపత్రాలు అందజేశారు. పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ ఎం. వెంకటేశ్వర్లును కలిసి వైయస్ఆర్‌సీపీ నేతలు వినతిపత్రం సమర్పించారు. పాలకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 9న ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, వీరఘట్టం ఎంపీపీ దమలపాటి వెంకటరమణ నాయుడు, పాలకొండ వైస్ ఎంపీపీ కణపాక సూర్యప్రకాష్, జడ్పీటీసీ ప్రతినిధులు సవర రాము, సవర చంద్రశేఖర్, సవర సాయి కుమార్, కందుల వెంకట నాయుడు, మిడితాన కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. పాడేరులో.. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గంలో జిల్లా అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ రెడ్డిని కలిసి అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం నేతృత్వంలో వైయస్ఆర్‌సీపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మత్స్యలింగం మాట్లాడుతూ, ఈనెల 9న రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వం లేదా పోలీస్ శాఖ నుంచి స్పందన లేకపోవడం ఆందోళనకరమన్నారు. మహిళలపై, ముఖ్యంగా ఆదివాసి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసి మహిళలపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకపోతే ఆదివాసులు ఐక్యంగా పోరాటం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు, జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, మాజీ ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి, పార్టీ పరిశీలకులు ఏరువాక సత్యరావు, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య, ఎస్టీ సెల్ నాయకులు, మండల స్థాయి నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.