శ్రీ సత్యసాయి జిల్లా: రాయలసీమ జిల్లాలకు అన్యాయం జరుగుతోందని, ప్రాంత హక్కుల సాధన కోసం పిడికిలి బిగించి పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని వైయస్ఆర్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ పిలుపునిచ్చారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై సమాలోచన పేరిట సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలోని వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు ఉషా శ్రీ చరణ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ, రాష్ట్ర విభజనతోనే నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రస్తుతం మరింత అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. రాయలసీమ ప్రాంతానికి తాగునీరు, సాగునీటి కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో, వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించిందని గుర్తు చేశారు. శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోతల ద్వారా అందించేలా ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకెళ్లారని తెలిపారు. అయితే ఈ ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టించేందుకు అప్పటి ప్రభుత్వం ప్రయత్నించిందని విమర్శించారు. రాయలసీమ అభివృద్ధి కోసం అవసరమైన అన్ని ప్రాజెక్టులను సాధించే దిశగా భవిష్యత్తులో మరింత ఉత్సాహంగా పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సాధన కోసం ప్రతి ఒక్క రాయలసీమ వాసి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి, ప్రోగ్రాం కన్వీనర్ సాకే శైలజానాథ్, మాజీ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ, మాజీ ఎమ్మెల్యేలు దుద్దకుంట శ్రీధర్ రెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, ప్రకాష్ రెడ్డి, తిప్పేస్వామి, సమన్వయకర్తలు దీపిక, ఈర లక్కప్ప, ప్రోగ్రాం కోఆర్డినేటర్ మంజునాథ్ యాదవ్, పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.