ఇది కమీషన్ల కక్కుర్తి ప్రభుత్వం

పుత్తా శివశంకర్ ధ్వజం

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌.

చిన్న కాంట్రాక్టర్లను తొక్కేసి బడా కాంట్రాక్టర్లకు సత్వర చెల్లింపులు 

ఎక్కువ బిల్లులుంటే, ఎక్కువ కమీషన్లు వస్తాయని ఆశ  

ఏజెన్సీలు తమ వారిదైతే నిబంధనలు పాటించకపోయినా ఓకే 

ప్రెస్‌మీట్‌లో పుత్తా శివశంకర్‌ ఆక్షేపణ

తాడేపల్లి: కార్పొరేట్‌ కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ల పేరిట కోట్లలో బిల్లులు చెల్లిస్తున్న కూటమి ప్రభుత్వం, చిన్న కాంట్రాక్టర్లకు మాత్రం నెలల తరబడి చెల్లింపులు చేయకుండా వేధిస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌ ఆక్షేపించారు. ప్రభుత్వ పనుల కోసం చిన్న కాంట్రాక్టర్లు తమ సొంత ఆస్తులు కుదవ పెట్టి తెచ్చిన అప్పులు తీర్చలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ధ్వజమెత్తారు. గ్రామీణ మంచినీటి సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్‌) విభాగంలో కాంట్రాక్టర్లకు 16 నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో గత్యంతరం లేక వారు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోందని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పుత్తా శివశంకర్‌ గుర్తు చేశారు.
ప్రెస్‌మీట్‌లో పుత్తా శివశంకర్‌ ఇంకా ఏమన్నారంటే..:

తెచ్చిన అప్పంతా ఏమవుతోంది?:
    గత ప్రభుత్వంలో జగన్‌గారు అమలు చేసిన పథకాలన్నీ రద్దు చేయడంతో పాటు, కొత్తగా ఏ ఒక్క సంక్షేమ, అభివృద్ధి పథకాన్ని పక్కాగా అమలు చేయకపోయినా, టీడీపీ కూటమి ప్రభుత్వం 21 నెలల్లోనే రూ.3.37 లక్షల కోట్లకు పైగా అప్పు చేసింది. మరి ఆ నిధులన్నీ ఏమవుతున్నాయి?
    వందలాది చిన్న కాంట్రాక్టర్లకు రూ.850 కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉండగా, అందులో కేవలం 10 శాతం రూ.85.88 కోట్లు మాత్రమే విడుదల చేశారు. కానీ, అదే సమయంలో కార్పొరేట్‌ కాంట్రాక్ట్‌ సంస్థలు కేవలం 20 రోజుల క్రితం పెట్టిన బిల్లులకు చెల్లింపులు చేశారు. నిజానికి ఆర్‌డబ్ల్యూఎస్‌ విభాగంలో జరిగిన పనుల బిల్లుల పేరుతో ఈ వారం రూ.707 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం, అందులో రూ.562 కోట్లు మొబిలైజేషన్‌ అడ్వాన్సుల పేరిట కార్పొరేట్‌ కాంట్రాక్ట్‌ సంస్థలకు చెల్లించింది. ఇది అత్యంత దారుణం. 

కమిషన్ల కోసమే ఈ కక్కుర్తి:
    పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు చేస్తే ఎక్కువ మొత్తంలో కమీషన్లు వస్తాయనే ఉద్దేశంతోనే వారికి చెల్లింపులు చేసి, తమను ఈ ప్రభుత్వం వేధిస్తోందని ఆర్‌డబ్ల్యూఎస్‌ కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం వల్ల తమకు 1 శాతం కూడా మిగలడం లేదని, కానీ 7 శాతం కమీషన్లు చెల్లించమంటే ఎవరికి చెప్పుకోవాలని వారు ఆవేదన చెందుతున్నారు.

శానిటేషన్‌ పనుల్లో అక్రమ దందా:
    ప్రభుత్వ ఆస్పత్రులు, మెడికల్‌ కాలేజీల్లో శానిటేషన్‌ పనుల కోసం మ్యాన్‌ పవర్‌ ఏజెన్సీలకు టెండర్లు పిలిచి తమ అనుయాయులకే టెండర్లు కట్టబెట్టేశారు. సిబ్బందికి 95 శాతం హాజరు ఉంటేనే పూర్తిగా బిల్లులు చెల్లించేలా ఎఫ్‌ఆర్‌ఎస్‌ (ఫేసియల్‌ రికగ్నిషన్‌ సిస్టం) అనే నిబంధన పెట్టారు. అంతకన్నా తక్కువైతే ఆ మేరకు బిల్లులు కట్‌ చేయాలనే నిబంధన తీసుకొచ్చారు. కానీ ఆ మేరకు ఎక్కడా హాజరు ఉండక పోవడంతో తమ అనుయాయులు కాబట్టి 65 శాతం హాజరు ఉన్నా పూర్తిగా బిల్లులు చెల్లించేలా మౌఖిక ఆదేశాలు ఇవ్వడం సిగ్గుచేటు. 
    చెల్లింపులు తగ్గితే కమీషన్లు తగ్గుతాయని భావించి ఈ కుట్ర చేశారు. రూ.14 కోట్లు శానిటేషన్‌ బిల్లులు, రూ.8 కోట్లు సెక్యూరిటీ బిల్లులు చెల్లించారు. రాయలసీమలో సీఎం చంద్రబాబు బంధువుకి చెందిన పద్మావతి ఏజెన్సీకి ఎఫ్‌ఆర్‌ఎస్‌ 61 శాతమే ఉంది. అయినా వంద శాతం బిల్లులు చెల్లించారని పుత్తా శివశంకర్‌ తెలిపారు.

Back to Top