తాడేపల్లి: అమరావతి పేరుతో చంద్రబాబు దోపిడీ చేస్తున్నారని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. అనంతపురం జిల్లా అభివృద్ధికి వైయస్ కుటుంబం చేసిన సేవలను గుర్తించకుండా చంద్రబాబు అనవసర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ, హంద్రీనీవా, సుజల స్రవంతి వంటి ప్రాజెక్టులను తీసుకొచ్చింది వైయస్ఆరేనని, కరువు ప్రాంతాల్లో చెరువులు నిండటానికి కూడా అదే కారణమని తెలిపారు. “చంద్రబాబుకు శంకుస్థాపనలు చేసి వదిలేయడం మాత్రమే తెలుసు. కానీ వైఎస్సార్, జగన్ పాలనలోనే రాయలసీమకు నిజమైన మేలు జరిగింది” అని అన్నారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపు వంటి కీలక అంశాలపై కూడా స్పందించకుండా చంద్రబాబు మౌనం పాటిస్తున్నారని విమర్శించారు. అమరావతి ప్రాజెక్టుపై తీవ్ర ఆరోపణలు చేసిన ఆయన, “లక్షల కోట్లతో అమరావతి పేరుతో దోపిడీ జరుగుతోంది. బినామీలకు లాభాలు చేకూర్చే విధంగా అవినీతికి రాజధానిగా మార్చేశారు” అని అన్నారు. జనాభా లేని ప్రాంతంలో రాజధాని నిర్మాణం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తూ, నయా రాయపూర్ ఉదాహరణగా చూపించారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల అభివృద్ధిని పక్కనబెట్టి అమరావతిపై భారీ ఖర్చులు చేయడం వల్ల రాయలసీమకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. “మా దగ్గర వసూలు చేసే పన్నులు అమరావతిలో ఖర్చు చేస్తే మా పరిస్థితి ఏంటి?” అని ప్రశ్నించారు. అదే సమయంలో, ప్రాజెక్టులు నిలిపివేయడం, నీటి సరఫరాకు భారీగా ఖర్చులు చేయడం, నిర్మాణ వ్యయాలు పెరగడం వంటి అంశాలపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలనలో పారదర్శకత లేదని, చట్టాల అమలు విషయంలోనూ వివక్ష ఉందని ఆరోపించారు.