తాడేపల్లి: మీడియా స్వేచ్చ పేరుతో పాత్రికేయ ప్రమాణాలు కాలరాస్తూ, ఆంధ్రప్రదేశ్ లో విపక్ష వైయస్ఆర్‌సీపీ నేతల్ని ఉద్దేశపూర్వకంగా కించపరిచేలా కథనాలు ప్రసారం చేస్తున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్, డిజిటల్ అసోసియేషన్ కు లేఖ రాశారు. ఇందులో ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి తమ పార్టీ నేతల పరువుకు భంగం కలిగించేలా, దురుద్దేశపూరితంగా ప్రసారం చేసిన కథనానికి సంబంధించిన వీడియో ఆధారాల్ని సమర్పించడంతో పాటు సదరు వీడియోను వెంటనే యూట్యూబ్ నుంచి తొలగించేలా, బహిరంగ క్షమాపణలు చెప్పేలా, భవిష్యత్తులో పాత్రికేయ ప్రమాణాలకు కట్టుబడేలా ఏబీఎన్ యాజమాన్యాన్ని ఆదేశించాలని అసోసియేషన్ సెక్రటరీని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి విజ్ఞప్తి చేశారు.న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్,డిజిటల్ అసోసియేషన్ కు రాసిన లేఖలో లేళ్ల అప్పిరెడ్డి ఇంకేం పేర్కొన్నారంటే.. - నిస్సిగ్గుగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీడియా ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో విపక్ష పార్టీ అయిన వైయస్ఆర్‌సీపీపై, పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దురుద్దేశపూరితంగా కథనాన్ని ప్రసారం చేసింది. ఈ కథనం ప్రసారం మీడియా స్వేచ్ఛ దుర్వినియోగానికి స్పష్టమైన ఉదాహరణ. ఎందుకంటే ఈ ఛానల్, మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠను దిగజార్చే ఉద్దేశంతో, తప్పుడు, ధృవీకరించని, దురుద్దేశపూరిత, ఉద్దేశపూర్వక కంటెంట్‌ను వ్యాప్తి చేసింది. ఈ కార్యక్రమం పూర్తిగా పక్షపాతంతో కూడుకున్న పాత్రికేయం. అది ద్వేషాన్ని, హేళనను, వీక్షకుల మనసుల్లో విషాన్ని నాటేందుకు ఉద్దేశించిన ఏకపక్ష కథనం. ఈ ఛానల్ తన ఎలక్ట్రానిక్ , డిజిటల్ వేదికల ద్వారా, యూట్యూబ్ ద్వారా అత్యంత పరువు నష్టం కలిగించే, అవమానకరమైన, తప్పుదారి పట్టించే , అనైతిక కంటెంట్‌ను ప్రసారం చేసింది. దీని యూట్యూబ్ లింక్ ఇదే -https://youtu.be/iF_9828F18c - పరువునష్టం కల్గించే కథనం, పూర్తిగా అభ్యంతకరం ఈ కథనంలోని వీడియోలో 7వ నిమిషం నుండి 8వ నిమిషం వరకు ప్రత్యేకంగా యాంకర్ అత్యంత అభ్యంతరకరమైన, పరువు నష్టం కలిగించే భాషను ఉపయోగించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు, మద్దతుదారులను వెన్నుముక లేని బ్యాచ్ అంటూ దారుణమైన వ్యాఖ్యలు చేసింది. తమ నాయకుడి ఎలాంటి తర్కం లేని, అసంభవమైన వ్యాఖ్యలనూ వారు గుడ్డిగా నమ్ముతారని సూచించేలా దారుణ వ్యాఖ్యలు చేసింది. ఇందులో “రేపు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మీ భార్యలు మీ భార్యలే కాదు అని చెబితే, మీరు గుడ్డిగా నమ్మి, మీ భార్యలను కూడా అక్కాచెల్లెళ్లుగా భావించి పెళ్లి సంబంధాల కోసం వెతుకుతారు; వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బుద్ధిలేని నాయకులు ఇలానే ఉంటారు!” అంటూ విషాన్ని చిమ్మింది. ఈ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారం, వీటికి ఎలాంటి ఆధారాలు కూడా లేవు. అలాగే ప్రజల్లో తమ పార్టీ నేతల ప్రతిష్టను దిగజార్చేలా, వ్యక్తిత్వ హననం చేసేలా ఉన్నాయి. - వైయస్ఆర్‌సీపీ నేతల్ని పిచ్చోళ్లుగా చిత్రీకరించే యత్నం ఏబీఎన్ కథనంలో తమ పార్టీ నాయకత్వం, సభ్యులను బుద్ధి, తర్కం లేని వారిగా చిత్రీకరించే పదాల్ని వాడారు. ఉదాహరణకు వారిని “మేధస్సు లేదా జ్ఞానం లేని వ్యక్తులు” అని చిత్రీకరించారు. అలాగే రాజకీయ అభిప్రాయాలను “పిచ్చి ప్రతిపాదనలు”గా పేర్కొన్నారు. యాంకర్ తమ పార్టీ నేతల్ని “పిచ్చి మనుషుల సమూహం”గా కూడా వర్ణించింది. ఇది కథనంలోని నిర్లక్ష్యపూరిత, దుర్వినియోగపూరిత, పరువు నష్టం స్వభావాన్ని స్పష్టంగా నిరూపిస్తోంది. ఇలాంటి వ్యాఖ్యలకు ఎలాంటి వాస్తవ ఆధారం కానీ, సాక్ష్యాలు కానీ లేవు. దీన్ని పూర్తిగా సాధారణీకరించి, తీవ్ర స్ధాయిలో చేసిన ఈ వ్యాఖ్యల ఉద్దేశ్యం తమ పార్టీ నేతల ప్రతిష్ఠను దెబ్బతీయడం, ప్రజలను తప్పుదారి పట్టించడం మాత్రమే. ఇందులో ఉపయోగించిన భాష అత్యంత దారుణంగా, అనుచితంగా, బాధ్యతాయుత మీడియా సంస్థ నుంచి ఆశించే ప్రాథమిక నైతిక ప్రమాణాలకు విరుద్ధంగా ఉంది. - కేబుల్ టెలివిజన్ చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించారు కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ (రెగ్యులేషన్) చట్టం 1995 ప్రకారం నిర్దేశించిన కార్యక్రమ నియమావళిని ఈ కథనం దారుణంగా ఉల్లంఘించింది. ఆ చట్టం ప్రకారం ఎలాంటి కార్యక్రమం కూడా పరువు నష్టం కలిగించే, తప్పుడు, అర్ధసత్యాల ఆధారిత విషయాలను కలిగి ఉండకూడదు. సంబంధిత కంటెంట్ పై పూర్తి నిషేధం ఉంది. ఎందుకంటే అది పరువు నష్టం కలిగించేలా, తప్పుదారి పట్టించేలా, ఘర్షణలు, ద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉంది. వాస్తవాలను ధృవీకరించడంలో, సమతుల్య అభిప్రాయాలను ప్రదర్శించడంలో లేదా స్పందనకు అవకాశం ఇవ్వడంలో ఏబీఎన్ ఛానల్ విఫలమవడం పాత్రికేయ బాధ్యత , నైతిక ప్రమాణాల తీవ్రమైన ఉల్లంఘనగా కనిపిస్తోంది. మేనేజ్‌మెంట్ ద్వారా సంపాదకీయ నియంత్రణ పూర్తిగా లేనట్లు అర్ధమవుతోంది. అందుకే ఇలాంటి బాధ్యతారహిత, హానికరమైన కంటెంట్ ప్రసారం అయ్యింది. - వెంటనే యూట్యూబ్ నుంచి తొలగించండి.. ఇలాంటి కంటెంట్ డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో కొనసాగడం వల్ల, ప్రేక్షకులందరికీ అందుబాటులో ఉండి, పరువు నష్టం ప్రభావాన్ని కొనసాగిస్తోంది. దీనిని నియంత్రించకుండా వదిలేస్తే.. ప్రమాదకరమైన ఉదాహరణను సృష్టించడమే కాకుండా, మీడియా సంస్థలపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి గౌరవనీయ సెక్రటరీ గారు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని, చట్టానికి అనుగుణంగా ఏబీఎన్ ఆంధ్ర జ్యోతి, దాని యాంకర్, ఎడిటర్, మేనేజ్‌మెంట్‌పై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అందులో అభ్యంతరకర కంటెంట్ తొలగింపుతో పాటు బహిరంగ క్షమాపణ చెప్పించడం, భవిష్యత్తులో కార్యక్రమ నియమావళి, పాత్రికేయ ప్రమాణాలను కచ్చితంగా పాటించేలా ఆదేశాలు జారీ చేయాలని వినయపూర్వకంగా కోరుతున్నాం. న్యాయం, నిష్పక్షపాతత్వం, వ్యక్తుల, సంస్థల గౌరవ పరిరక్షణ కోసం తగిన ఇతర ఉత్తర్వులు కూడా జారీ చేయాలని పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కోరారు.