ప్రభుత్వంపై గవర్నర్‌కు బొత్స సత్యనారాయణ ఫిర్యాదు

రాష్ట్ర అప్పులపై తప్పుడు సమాచారం ఇచ్చారని వెల్లడి

ఆధారాలతో సహా, గవర్నర్‌కు మండలి విపక్షనేత లేఖ 

తప్పుడు సమాచారంపై చర్య తీసుకోవాలని బొత్స విజ్ఞప్తి

తాడేపల్లి: రాష్టంలో టీడీపీ కూటమి ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేస్తుండటమే కాక, వాటిపై ప్రశ్నిస్తే శాసనమండలికి తప్పుడు సమాచారం ఇచ్చిందని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ రాష్ట్ర గవర్నర్‌ శ్రీ అబ్దుల్‌ నజీర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పూర్తి ఆధారాలతో ఆయన గవర్నర్‌కు ఒక లేఖ రాశారు. ఆ విధంగా ప్రభుత్వం తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా తప్పు బట్టిన బొత్స సత్యనారాయణ, దీనికి సంబంధించి ప్రభుత్వంపై తగిన చర్య తీసుకోవాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.
మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ గవర్నర్‌ శ్రీ అబ్దుల్‌ నజీర్‌కు రాసిన లేఖలో ఏం పేర్కొన్నారంటే..:

- అప్పులపై మండలికి ప్రభుత్వం తప్పుడు సమాచారం:

    ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన శాసన మండలి సమావేశాల్లో కూటమి ప్రభుత్వం రాష్ట్ర రుణాలపై ఆర్థిక శాఖ ద్వారా వాస్తవాలను దాచిపెట్టి, తప్పుడు  సమాచారం అందించింది. రాష్ట్ర ప్రభుత్వ రుణాలకు సంబంధించి సభలో వైయస్సార్‌సీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సంతకంతో ఇచ్చిన సమాధానంలో కీలకమైన సమాచారం దాచిపెట్టారు. ప్రభుత్వ ఉద్యోగి చట్ట సభకు తప్పుడు సమాధానం ఇస్తే, అది మొత్తం ప్రభుత్వ ప్రతిష్ఠను మాత్రమే కాకండా, ప్రజల విశ్వాసాన్ని కూడా దెబ్బ తీస్తుంది. సత్యాన్ని పక్షపాతం లేకుండా, నిష్పాక్షికంగా తెలియజేయడం అధికారుల ముఖ్య బాధ్యత. కానీ మా పార్టీ సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన విధానం ఆర్థిక శాఖ నిబద్ధతకే ము¬ప్పుగా మారింది. అలాగే చట్టసభ గౌరవానికి కూడా భంగం కలిగిస్తోంది. ఆ సమాధానంలో వ్యత్యాసాలు బయటపడగా, తర్వాతే  ఆర్థిక మంత్రి ఆ సమాధానాన్ని సమర్థించడానికి ప్రయత్నించారు.

- ఇవీ ఆ వ్యత్యాస వివరాలు:

    మొదటి ప్రశ్న 2024–25, 2025–26 ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వం చేసిన బడ్జెట్, బడ్జెటేతర అప్పులకు సంబంధించింది. కానీ ప్రభుత్వం ఇచ్చిన సమాధానంలో ప్రజా పద్దు కింద కొన్ని అంశాల వివరాలే ఇచ్చి, ఆదాయం–వ్యయం మధ్య ఉన్న లోటును భర్తీ చేయడానికి ఉపయోగించిన ఇతర మార్గాల వివరాలను వదిలేసింది. పైగా ఆ వివరాలు బడ్జెట్‌ ప్రతుల్లో, కాగ్‌ తమ రికార్డుల్లో పేర్కొన్నవే. వాటి ప్రకారం 2024–25లో ఆదాయం–వ్యయం మధ్య లోటు రూ.81,071.18 కోట్లు కాగా, దాన్ని ప్రభుత్వ రుణాలు, ప్రజా పద్దులోని వివిధ విభాగాల ద్వారా భర్తీ చేసినట్లు తెలిపారు. ఇక 2025–26లో 9 నెలల్లో కూడా రూ.85,269.19 కోట్ల లోటు వివిధ వనరుల ద్వారా భర్తీ చేశామని చెప్పారు. అయితే ఆ సమాధానంలో 2024–25లో రూ.60,485.40 కోట్లు, 2025–26లో 9 నెలల్లో రూ. 53,878.71 కోట్ల రుణాలని చెప్పడం కచ్చితంగా విషయాన్ని పక్కదారి పట్టించడమే.

- అప్పులను ఎలా దాచేశారంటే..:
    
2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్‌ నివేదికను 2026 మార్చి 6న సభ ముందు పెట్టారు. అందులో ఆర్థిక ఖాతాల స్టేట్‌మెంట్‌–6 ప్రకారం, 2024–25లో రాష్ట్ర ప్రభుత్వ అప్పు రూ.81,082.51 కోట్లు కాగా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఇచ్చిన సమాధానంలో ఆ మొత్తాన్ని రూ.60,485 కోట్లుగా అబద్దం చెప్పారు.
అంతే కాకుండా 2024–25 తర్వాత ఇతర రుణాలు లేవని కూడా ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే మూడు ముఖ్యమైన అంశాలను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టినట్లు కనిపిస్తోంది.
ఒక్కసారి ఆ వివరాల్లోకి వెళ్తే..
    2024–25లో చేబదులు (వేస్‌ అండ్‌ మీన్స్‌) అడ్వాన్సులు రూ.13,419.30 కోట్లు. అదే ఏడాదిలో పబ్లిక్‌ అకౌంట్‌ నెట్‌ పెరుగుదల రూ.2,983.81 కోట్లు కాగా, గత సర్దుబాటు, ప్రొఫార్మా సవరణ తర్వాత ఆ మొత్తం రూ.4,193.99 కోట్లుగా తేలింది. ఈ మూడు అంశాలను కలిపితే, మొత్తం లోటు రూ.20,597.10 కోట్లు. అంటే ఈ వివరాలు దాచి పెట్టడం ద్వారా ప్రభుత్వ రుణం తక్కువగా చూపే ప్రయత్నం చేశారు.

- చేబదులు రుణం కాదా?:

డబ్బు సర్దుబాటు కోసం చేసే చేబదులు (వేస్‌ అండ్‌ మీన్స్‌) కూడా రుణమే అని ఆర్బీఐ చెబుతోంది. అంటే అది అంతర్గత రుణంలో భాగమే. కాబట్టి ఆ మొత్తాన్ని మొత్తం రుణంలో తగ్గించి చూపడం సరికాదు. ఇంకా చెప్పాలంటే ఆ మినహాయింపునకు కారణం లేదు. ఇక్కడ మరో విషయం. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా చేబదులును నికర అప్పు సీలింగ్‌లో భాగంగా పరిగణిస్తుంది. 
    భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 293(3) ప్రకారం రాష్ట్రం రుణాలు తీసుకునే ముందు కేంద్ర ప్రభుత్వ సమ్మతి అవసరం. అందువల్ల ప్రజా పద్దు నికర నిల్వను మొత్తం రుణాల నుంచి మినహాయించడానికి కారణం లేదు. 
    ఇక జీఎస్టీ పరిహారానికి బదులుగా రాష్ట్రాలకు ఇచ్చిన బ్యాక్‌–టు–బ్యాక్‌ రుణాలకు సంబంధించిన విషయం. ఈ సర్దుబాటు కారణంగా 2024 ఏప్రిల్‌ 1 నాటికి ప్రారంభ బ్యాలెన్స్, 2024 మార్చి 31 నాటికి ముగింపు బ్యాలెన్స్‌ మధ్య రూ.4,193.99 కోట్ల తేడా వచ్చింది.  కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి రుణాల కింద నమోదు చేసిన వాస్తవ రశీదులు, తిరిగి చెల్లింపులు మాత్రం మారలేదు. కాబట్టి ఈ మొత్తాన్ని అప్పుల్లో లెక్కించకపోవడం ఏ మాత్రం సమర్థనీయం కాదు.

- మరో ప్రశ్న సమాధానంలో వ్యత్యాసాలు:

2014–24 మధ్య సంవత్సరాల వారీ రుణాల వివరాలు కోరితే, సమాధానంలో ప్రతి ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి ఉన్న మొత్తం రుణాన్ని చూపిన వివరాలు (పట్టిక) మాత్రమే ఇచ్చారు. అంటే పబ్లిక్‌ డెట్‌తో పాటు పబ్లిక్‌ అకౌంట్‌ బ్యాలెన్స్‌లు కూడా ఉన్న మొత్తం స్ధూల అప్పును చూపించారు. అయితే 2024–25, 2025–26 కోసం మాత్రమే పబ్లిక్‌ డెట్‌లోని కొన్ని అంశాలను చూపి, పబ్లిక్‌ అకౌంట్‌ను పూర్తిగా వదిలేయడం సరైంది కాదు. ఇది అభ్యంతరకరం. ప్రభుత్వం రుణ నిర్వచనంలో చూపుతున్న ఈ సౌకర్యవంతమైన మార్పు రాజకీయ కారణాల కోసమే అని అర్దమవుతోంది. ప్రజా రికార్డులో ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల ముఖ్యమైన వివరాలను పొందుపరచాల్సిన అవసరం ఉంది. 

- ఇది సరికాదు. తగిన చర్యలు తీసుకొండి:
    
అలా ప్రభుత్వ సమాధానాల్లో కచ్చితత్వం లేకపోవడం సరికాదు. ఇలా చట్టసభ ముందు తప్పుడు సమాచారం ఇవ్వడం రాష్ట్ర ప్రతిష్ఠకు, పాలనలో పారదర్శకతకు హానికరం. బాధ్యతాయుతమైన ప్రభుత్వ వ్యవస్థ కోసం ఆర్థిక శాఖ మరింత స్పష్టత, నిజాయితీతో వ్యవహరించాలి.  
    మండలిలో లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తప్పుడు సమాచారం ఇవ్వడం, విషయాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన వారిపై తగిన చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.. అని మండలి విపక్షనేత గవర్నర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

Back to Top