పెట్రోల్, డీజిల్ వెంటనే సరఫరా చేయాలి

మాజీ మంత్రి డా. సాకే శైలజానాథ్ డిమాండ్ 

అనంత‌పురం: రాష్ట్రంలో కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ కొరతపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైయ‌స్ఆర్‌సీపీ నేతలు నిరసనలు చేపట్టారు. పార్టీ ఆదేశాల మేరకు పెట్రోల్ బంక్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరసనకారులు అసమర్థ ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ కొరతతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా కూటమి ప్రభుత్వం మాత్రం మాటలతో కాలయాపన చేస్తోందని వారు విమర్శించారు.

డాక్టర్ సాకే శైలజానాథ్ మాట్లాడుతూ ఇంధనం అందుబాటులో లేకపోవడంతో రైతులు, వాహనదారులు, సాధారణ ప్రజలు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూలైన్లు కనిపిస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సంబంధిత మంత్రులు పరిస్థితిని పట్టించుకోకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి పెట్రోల్, డీజిల్ సరఫరాను పునరుద్ధరించాలని, ప్రజల ఇబ్బందులను తొలగించాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. 

Back to Top