ఇంధన, గ్యాస్ కొరతపై కేంద్రానికి ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ  

వైయ‌స్ఆర్ జిల్లా: రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతపై కడప ఎంపీ వైయ‌స్ అవినాష్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు. వెంటనే కేంద్రం జోక్యం చేసుకుని సమస్యపై చర్యలు తీసుకోవాలని కోరుతూ లేఖ రాశారు. ఈ కొరత కారణంగా రాష్ట్రంలో వ్యవసాయం, వ్యాపారం సహా అనేక రంగాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆయన తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో గ్యాస్, ఇంధనాన్ని పూర్తి స్థాయిలో నిల్వ ఉంచేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 70 శాతం పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి లేకపోయినా ఏపీలో మాత్రమే ఇంధన కొరత నెలకొనడం ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సరఫరాదారులతో కుమ్మక్కై కృత్రిమ కొరత సృష్టిస్తోందని ఆరోపిస్తూ, ఈ అంశంపై కేంద్రం వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెట్రోల్, డీజిల్, గ్యాస్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
 

Back to Top