తాడేపల్లి: మార్కెట్‌లో ప్రభుత్వ జోక్యం లేకపోవడం వల్ల ధరలు కుప్పకూలాయని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని, వారికి వెంటనే కనీస మద్దతు ధర కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి తరచూ కేంద్రానికి లేఖలు రాస్తున్నామని ప్రకటించడం తప్ప, రైతులకు నేరుగా ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు. ధరల స్థిరీకరణ పథకం, ధరల వ్యత్యాస పథకం పేరుతో కేంద్రాన్ని ఆశ్రయించడం కాకుండా, రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా కొనుగోలు చేపట్టాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ రబీ సీజన్‌లో రాష్ట్రంలో సుమారు 42 లక్షల టన్నుల మొక్కజొన్న ఉత్పత్తి అవుతుందని అంచనా ఉన్నప్పటికీ, మార్కెట్‌లో రైతులు క్వింటాల్‌కు 1400 నుంచి 1800 రూపాయల మధ్య మాత్రమే ధర పొందుతున్నారని చెప్పారు. కేంద్రం నిర్ణయించిన కనీస మద్దతు ధర 2400 రూపాయలు ఉండగా, రైతులు క్వింటాల్‌కు 600 నుంచి 900 రూపాయల వరకు నష్టపోతున్నారని తెలిపారు. మొత్తం మీద రైతులు దాదాపు 3000 కోట్లకు పైగా నష్టపోతున్న పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12 లక్షల ఎకరాలకు పైగా మొక్కజొన్న సాగు జరిగిందని, ముఖ్యంగా అనంతపురం, కర్నూలు, నంద్యాల, బాపట్ల, గుంటూరు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అధికంగా పంట సాగు జరిగిందని వివరించారు. అయితే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు మధ్యవర్తుల ఒత్తిడికి లోనై తక్కువ ధరలకు పంటను అమ్ముకుంటున్నారని అన్నారు. ఇతర రాష్ట్రాలు కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. మార్కెట్‌లో ప్రభుత్వ జోక్యం లేకపోవడం వల్ల ధరలు కుప్పకూలి రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం చేయాలంటే వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, కనీస మద్దతు ధరకు పంటను కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే ధరల వ్యత్యాసం కింద రైతులకు కలిగిన నష్టాన్ని ప్రభుత్వం భరించి వారికి పరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.