రాజమండ్రి : రాష్ట్రంలో కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ కొరతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ వైయస్ఆర్‌సీపీ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాజమండ్రి మోరంపూడి సెంటర్‌లోని పెట్రోల్ బంకు వద్ద వైయస్ఆర్‌సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ ఆధ్వర్యంలో ఈ నిరసన జరిగింది. ఈ సందర్భంగా మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న ఇంధన కొరత వల్ల రైతులు, ఆటో కార్మికులు, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతాంగానికి వ్యవసాయ పనుల కోసం డీజిల్ అత్యవసరం అయినప్పటికీ, సరిపడా ఇంధనం అందక పనులు నిలిచిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లు, రవాణా రంగానికి చెందినవారు రోజువారీ జీవనోపాధి కోసం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే పెట్రోల్, డీజిల్ కొరత నెలకొనడం దురదృష్టకరమని అన్నారు. ఇది ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు. ప్రజలకు అవసరమైనంత ఇంధనం అందుబాటులో ఉండేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వం వెంటనే స్పందించాలని నినాదాలు చేశారు.