నెల్లూరు జిల్లా: సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండల కేంద్రం సమీపంలోని జగనన్న కాలనీని మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి సందర్శించారు. కాలనీలో నిర్మించిన ఇళ్లను, లబ్ధిదారుల సౌకర్యాలను పరిశీలించి, అక్కడి మహిళలు, కుటుంబాలతో మమేకమై వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. “జగనన్న పుణ్యమా అని అద్దె ఇళ్ల నుంచి బయటపడి సొంతింటిలో నివసిస్తున్నాం” అంటూ మహిళలు భావోద్వేగానికి గురయ్యారు. అయితే కాలనీలో సైడ్ కాలవలు, సిమెంట్ రోడ్లు వంటి మౌలిక సదుపాయాల కొరతపై వారు తమ సమస్యలను కాకాణి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన కాకాణి, “జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయిన వెంటనే మిగిలిపోయిన అన్ని పనులను పూర్తి చేస్తాం” అని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. “పేదల సొంతింటి కలను సాకారం చేసిన ఘనత పూర్తిగా జగనన్నదే. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని ధ్యేయంగా పెట్టుకుని పనిచేసింది. లక్షలాది కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్లు నిర్మించి ఇచ్చిన చరిత్ర జగన్ మోహన్ రెడ్డిదే” అని పేర్కొన్నారు. “జగన్ మోహన్ రెడ్డి గారు ఇళ్లను కాదు, ఊళ్లనే నిర్మించారు. మనుబోలు జగనన్న లేఅవుట్‌లో దాదాపు 300 ప్లాట్లు ఇచ్చాం. వాటిలో 120 ఇళ్లు పూర్తయ్యాయి, 40 ఇళ్లు తుది దశలో ఉన్నాయి. మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి” అని వివరించారు. కూటమి ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. “చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క కొత్త ఇల్లు కూడా నిర్మించలేదు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ఇళ్లకు బిల్లులు చెల్లించకుండా పనులను అర్ధాంతరంగా నిలిపివేసింది. కానీ, గతంలో నిర్మించిన ఇళ్లకు క్రెడిట్ తీసుకోవడం మాత్రమే చేస్తోంది” అని ఆరోపించారు. “చంద్రబాబు నాయుడు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా, ఇంత పెద్ద ఎత్తున పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? తాను చేయని పనులకు క్రెడిట్ తీసుకోవడం ఆయన రాజకీయ శైలిగా మారింది” అని విమర్శించారు. అలాగే, “కూటమి ప్రభుత్వం జగనన్న కాలనీల అభివృద్ధిని పూర్తిగా విస్మరించింది. కనీసం మట్టి కూడా పోయలేదు. ప్రజలు మాత్రం జగన్ మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి రావాలని ఆశిస్తున్నారు. ఆయన వస్తేనే కాలనీలకు సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ వంటి సదుపాయాలు వస్తాయి” అని అన్నారు. “ప్రతి మంగళవారం ఒక జగనన్న కాలనీని సందర్శించి, అక్కడ జరిగిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తాం. కూటమి నాయకులు ఊహల్లో కాకుండా క్షేత్రస్థాయికి వచ్చి నిజాలను చూడాలి” అని కాకాణి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైయస్ఆర్‌సీపీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.