ఆంధ్రప్రదేశ్ లో  మద్యం ఫుల్-పెట్రోల్, డీజల్ నిల్ 

 సామాన్యులు బాగుపడాలంటే సైకిల్ పోవాలి 

మాజీ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు 
 
 పలాసలో పెట్రోల్, డీజిల్ కొరతపై వైయ‌స్ఆర్‌సీపీ నిరసన 

పలాస : రాష్ట్రంలో కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ కొరతపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలాస నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మందస మండలం హరిపురం జాతీయ రహదారి వద్ద ఉన్న పెట్రోల్ బంక్ వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అందుబాటులో ఉండగా పెట్రోల్, డీజిల్ లభించకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. గత నాలుగు ఐదు రోజులుగా ఇంధన కొరత తీవ్రరూపం దాల్చి ప్రజలు, రైతులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇంధన కొరతపై ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా కాలయాపన చేసిందని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపిస్తున్నాయని, ప్రభుత్వం మాత్రం కొరత లేదని చెబుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని మండిపడ్డారు.

ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పాలకులు మాత్రం టూర్లలో బిజీగా ఉండటం బాధాకరమని విమర్శించారు. ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నిలదీయాలనే ఉద్దేశంతో వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైయ‌స్ఆర్‌సీపీ డాక్టర్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. ఇంధన కొరతను తక్షణమే పరిష్కరించాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావాలని డిమాండ్ చేశారు. 

Back to Top